బడి.. సమస్యల సుడి! ఆ విద్యార్థులు ఎక్కడ చదవాలి?

ABN , First Publish Date - 2022-07-04T17:11:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసి మంగళవారం నుంచి వాటిని ప్రారంభిస్తున్నారు. విద్యా..

బడి.. సమస్యల సుడి! ఆ విద్యార్థులు ఎక్కడ చదవాలి?

రేపటి నుంచే స్కూళ్లు పునఃప్రారంభం

3, 4, 5 క్లాసుల విద్యార్థులు ఎక్కడ చదవాలి?

తల్లిదండ్రులు, పిల్లల్లో అయోమయం

ఇంకా పూర్తికాని విలీనం, రేషనలైజేషన్‌

విద్యా కానుకలో అరకొరగా బ్యాగులు, బూట్లు యూనిఫారాలూ అందలేదు

టెండర్లు ఆలస్యంగా పిలవడం వల్లే

వాటి రవాణాలో సర్కారు కక్కుర్తి

ఎంఈవోలు, హెచ్‌ఎంలపై ఖర్చుల భారం

డ్రాపవుట్లను పట్టించుకోని సీఆర్‌పీలు

వచ్చిన సరుకు సర్దుకోవడమే వారి పని

హైస్కూళ్లలో ఇంటర్‌ ఉంటుందో.. ఉండదో?


రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసి మంగళవారం నుంచి వాటిని ప్రారంభిస్తున్నారు. విద్యా సంవత్సరం దాదాపు నెల రోజులు ఆలస్యంగా మొదలవుతున్నా.. అన్ని ఏర్పాట్లూ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏ పాఠశాల ఎక్కడ ఉండాలనే దానిపైనే ఎవరికీ స్పష్టత లేదు. ముఖ్యంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఏ బడికి వెళ్లాలో ఇంతవరకూ తెలియకపోవడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఇక విద్యా కానుక కిట్లలో కొన్ని వస్తువులే అందాయి. పాఠ్యపుస్తకాలు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఇన్ని సమస్యల మధ్య తలెత్తే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పాఠశాలల విలీనం ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఆరు రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంగన్‌వాడీ విద్యార్థులకు శాటిలైట్‌ ఫౌండేషన్‌.. ప్రీప్రైమరీ-1, ప్రీప్రైమరీ-2.. ఒకటి, రెండు తరగతులతో ఫౌండేషన్‌.. ప్రీప్రైమరీ-1, ప్రీప్రైమరీ-2.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్‌ ప్లస్‌.. 3 నుంచి 8 తరగతుల వరకు ప్రీహైస్కూల్‌.. 3 నుంచి 10 వరకు హైస్కూల్‌ ‘ఏ’ కేటగిరీ.. 6 నుంచి 10 తరగతుల వరకు హైస్కూల్‌ ‘బీ’ కేటగిరీ.. అని ఆరు రకాలుగా వర్గీకరించింది. ఒక కిలోమీటరు పరిధిలో ఉన్నత పాఠశాల ఉంటే సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులను అందులో విలీనం చేయాలని నిర్ణయించింది. అంటే ఈ విద్యా సంవత్సరంలో ఆ తరగతుల విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూల్‌ లేదా ప్రీహైస్కూల్‌కు మారాలి. అందుకు అనుగుణంగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ ప్రక్రియను చేపట్టింది. కానీ మంగళవారం బడులు తెరుస్తున్నా ఇంతవరకూ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. ఆ తరగతుల విద్యార్థులు ఎక్కడ చేరాలనే దానిపై అధికారిక ఉత్తర్వులు జారీచేయలేదు.  రాష్ట్రంలో మొత్తం 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. సుమారు 10 వేల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలలకు తరలి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఏ బడికి వెళ్లాలో అర్థంకాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


అరకొరగా విద్యా కానుకలు

విద్యా కానుక కిట్లుగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు, బెల్టుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాఠ్యపుస్తకాలు 80 శాతం వరకు చేరినా.. బ్యాగులు, బూట్లు మాత్రం చాలా తక్కువ శాతమే వచ్చాయి. ప్రతి పాఠశాలకు ఒకట్రెండు వస్తువలు తక్కువగా పంపారు. ఎక్కువ చోట్ల బ్యాగుల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. బూట్లు కూడా సరిపడా రాలేదు. కొన్ని స్కూల్‌ కాంప్లెక్సుల వద్ద, ఇంకొన్ని ఎంఈవో, డీఈవో కార్యాలయాల వద్ద ఆగిపోయాయి. ఇక టెండర్లు ఆలస్యంగా పిలవడం వల్ల పై నుంచే చాలా జిల్లాలకు కిట్లు సక్రమంగా అందలేదు. అరకొరగా పంపడంతో డీఈవోలు వాటిని ఏదోలా సర్దుబాటు చేస్తున్నారు. ఇదంతా ముందే ఊహించిన పాఠశాల విద్యాశాఖ.. విద్యా కానుక కిట్ల పంపిణీకి నెలంతా గడువు ఇచ్చింది. రోజుకు గరిష్ఠంగా 40 మంది విద్యార్థులకు ఇవ్వాలని సూచించింది. అంటే బడులు తెరిచినా వెంటనే పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, బూట్లు లాంటివి అందవని పరోక్షంగా వెల్లడించింది. పాఠశాల విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న జగన్‌ ప్రభుత్వం.. పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్ల రవాణాలో కక్కుర్తి పడుతోంది. పాఠ్య పుస్తకాలకు ఎంఈవో కార్యాలయాల వరకే రవాణా వ్యయం భరిస్తోంది. అక్కడి నుంచి స్కూల్‌ కాంప్లెక్సులు, అనంతరం స్కూళ్లకు తీసుకెళ్లే భారం ఎంఈవోలు, హెచ్‌ఎంలపై పడేసింది. ఒక్కో పాఠశాలకు పాఠ్య పుస్తకాలు, కిట్ల కోసం ఐదు సార్లు వాహనం తిరుగుతోంది. దీనికి సగటున రూ.10 వేలు భారం పడుతోంది. ఒక్కో ఎంఈవో కార్యాలయం పరిధిలో ఎన్ని పాఠశాలలుంటే అంత భారం ఎంఈవోలు, హెచ్‌ఎంలపై పడుతోంది. సగటున తీసుకుంటే రూ.50 వేలకు పైగా భారం  వేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదు. మరోవైపు పాఠశాలలకు కిట్లు చేరాక వాటిని పాఠశాలలో మోయడం, సర్దడం లాంటి పని భారాన్ని కస్టమ్‌ రీసోర్స్‌ పర్సన్‌ల(సీఆర్‌పీ)పై వేస్తున్నారు. డ్రాపవుట్లపై దృష్టిపెట్టాల్సిన సీఆర్‌పీలు కిట్లు సర్దుకునే పనిలో మునిగిపోతున్నారు.


ఇంటర్‌ ఉందా.. లేదా?

ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్మీడియట్‌ ప్రారంభించాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం 800కి పైగా పాఠశాలల్లో ఇంటర్‌ ప్రారంభించాల్సి ఉంది. ఈ నెల 1 నుంచి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో అక్కడే చదవాలని భావించిన పది పూర్తయిన విద్యార్థులు ఎక్కడా చేరకుంగా ఆగిపోయారు. కాగా అక్కడి నుంచి వెళ్లిపోదామని విద్యార్థులు టీసీలు అడుగుతుంటే ఇంటర్‌ ప్రారంభమవుతుందని, కొంతకాలం ఆగాలంటూ హెచ్‌ఎంలు వారికి టీసీలు ఇవ్వకుండా అక్కడే ఉంచుతున్నారు. దీంతో ఇంటర్‌ విద్య గందరగోళంలో పడింది.


తిరోగమనంలోకి ప్రాథమిక విద్య: ఆప్తా

ప్రభుత్వం ప్రాథమిక విద్యను తిరోగమన దిశలోకి తీసుకెళ్తోంది. జీవో 117 ద్వారా విద్యా బోధన దారుణంగా దెబ్బతింటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి గతంలో 1:20గా ఉంటే దానిని 1:30గా మార్చారు. దీనివల్ల ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతాయి. ఫలితంగా నాణ్యత దెబ్బతిని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. పాఠశాలలను విడగొట్టి ఒకటి, రెండు తరగతుల్లో బోధనకు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడం దారుణం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిలో పాత విధానాన్ని తీసుకురావాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

- ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్తా)

Updated Date - 2022-07-04T17:11:24+05:30 IST