ప్రభుత్వ బడులు... అసౌకర్యాల లోగిళ్లు

ABN , First Publish Date - 2022-07-04T06:11:38+05:30 IST

ఈ ఏడాది విద్యాసంవత్సరం ఈనెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నది.

ప్రభుత్వ బడులు... అసౌకర్యాల లోగిళ్లు
శిథిలావస్థలో గొల్లగుంట ప్రాథమిక పాఠశాల

పలు పాఠశాలలను వేధిస్తున్న సమస్యలు

నేటికీ శిథిల భవనాల్లో సాగుతున్న చదువులు 

అరకొరగా పాఠ్య పుస్తకాల సరఫరా

పాఠశాలల విలీనంతో విద్యార్థుల్లో గందరగోళం

నాడు- నేడు పనుల్లోనూ నాణ్యతా లోపం

ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల తీరు


శిథిల భవనాలు... పెచ్చులూడిపోతున్న గచ్చులు, విరిగిపోయిన ఫర్నిచర్‌, ట్యాప్‌లు ఊడిపోయిన కొళాయిలు... ఇదీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల తీరు. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం కొన్నింటికే పరిమితం కాగా... ఏళ్లుగా అవస్థల మధ్య చదువులు సాగుతూనే ఉన్నాయి. అసౌకర్యాలకు మోక్షం లభించకపోవడంతో సమస్యల మధ్యే పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. 


(విశాఖపట్నం ఆంధ్రజ్యోతి) 

ఈ ఏడాది విద్యాసంవత్సరం ఈనెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. గతానికి భిన్నంగా ఈసారి వారం రోజుల ముందుగా ప్రభుత్వం స్కూల్‌ రడీనెస్‌ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ చాలావరకు పాఠశాలలు బోధనకు అనుకూలంగా సిద్ధంకాలేదు. పలుచోట్ల పాఠశాలల ఆవరణలో పొదలు పెరిగి, చిందరవందరగా మారాయి. ఇటీవల కురిసిన గాలులకు పడిపోయిన చెట్ల కొమ్మలు, చెత్త చెదారంతో నిండిపోయాయి. ఇక బాత్రూమ్‌లు, వా్‌ష్‌బేసిన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 


శిథిల భవనాల్లోనే...

జిల్లాలో కొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరిపోవడం, కిటికీలు, ద్వారాలు, తలుపులు విరిగిపోయి ఉన్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అసౌకర్యాల మధ్యే తరగతులు ప్రారంభం కానున్నాయి. నాడు నేడులో భాగంగా చేపట్టిన పనుల్లోనూ నాణ్యత లోపించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదు. నగరంలో తోటగరువు జడ్పీ పాఠశాలలో తొలిదశ నాడు-నేడులో భాగంగా రూ.కోట వెచ్చించి పనులు చేపట్టినా... విరిగిపోయన పలకలు, ట్యాపులు వెక్కిరిస్తున్నాయి. పాఠశాల ఆవరణలోని బాత్రూమ్‌ల వద్ద పొదలు పెరిగాయి. పనులు చేపట్టిన అనధికార కాంట్రాక్టరు మధ్యలో వదిలేయడం, పనుల్లో నాణ్యత లేకపోవడంతో పాఠశాల హెచ్‌ఎంకు విద్యాశాఖ షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది. నగరంలో ఎస్‌ఐజీ నగర్‌ (రవీంద్రనగర్‌) పాఠశాలను ఆదర్శ పాఠశాలగా గుర్తించారు. అయితే గదుల్లో పిల్లలు కూర్చునే బెంచీలపై బల్లలు, బాత్రూమ్‌ తలుపులు ఊడిపోయాయి. సుమారు 200 మంది పిల్లలు ఉండే పెదజాలారిపేట ప్రాఽథమిక పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ పాడైనా మరమ్మతులు చేసే పరిస్థితి కనిపించలేదు.


విద్యార్థులపై విలీన ప్రభావం 

ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలలను గత ఏడాది విలీనం చేశారు. ఈ ఏడాది ఒక కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయనున్నారు.దీంతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నతపాఠశాలలకు చేరారు. దీంతో వసతి సమస్య ఏర్పడింది. ఇప్పటికే విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాలలు కిక్కిరిసిపోయాయి. దీనికితోడు ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. 


అరకొర పుస్తకాలు, యూనిఫాం 

సుమారు లక్షన్నర మంది విద్యార్థులున్న జిల్లాలో కేవలం పదివేల మందికి మాత్రమే యూనిఫాం వచ్చింది. అది ఈనెల ఐదోతేదీన అందిస్తారు. అటు తరువాత విద్యార్థులు సొంతంగా కుట్టించుకుంటే మజూరీ చెల్లిస్తారు. మిగిలిన 1.4 లక్షల మందికి యూనిఫాం సరఫరా చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. పిల్లలకు ఇవ్వాల్సిన బూట్లు కూడా రాలేదు. నోటు పుస్తకాలు కూడా అరకొరగానే సరఫరా అయ్యాయి. విద్యార్థులకు అందించనున్న బ్యాగులు మరింత నాసిరకంగా ఉన్నాయి. గత ఏడాది బ్యాగులపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది నాణ్యతలో రాజీపడమని చెప్పినప్పటికీ, దానికి భిన్నంగా నాసిరకం బ్యాగులు సరఫరా అయ్యాయి. కాగా నాడు-నేడు రెండోదశ పనులు ఎక్కడా ప్రారంభించలేదు. ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేసినా పాఠశాల పేరెంట్స్‌ కమిటీ, హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ సిబ్బంది మధ్య సమన్వయం కుదరడం లేదు. నిర్మాణ మెటీరియల్‌కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, మార్కెట్‌లోని రేట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. 


భీమిలి మండలం రామజోగి అగ్రహారం మండల పరిషత్‌ ప్రాఽథమిక పాఠశాల భవనం పూర్తిగా శిఽథిలస్థితికి చేరింది. సన్‌సైడ్‌ పెచ్చులు రాలి పడుతున్నాయి. వర్షం పడితే శ్లాబ్‌ కారిపోతోంది. గొల్లల తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల భవనం సన్‌సైడ్‌లో కొంతభాగం పడిపోయింది. చేపల తిమ్మాపురం, పాతపరదేశిపాలెం పాఠశాలల భవనాలు చినుకు పడితే  కారిపోతున్నాయి.  

అగనంపూడి బీసీ కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్‌, గోడల నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. తలుపులు, కిటికీలకు చెదలు పట్టి ధ్వంసమయ్యాయి.  

పాతగాజువాక చిట్టినాయుడు కాలనీ ప్రాథమిక పాఠశాల భవనం బీటలు వారింది. గోడలు నాచుపట్టి శ్లాబ్‌పై మొక్కలు మొలిచాయి.  

చినగంట్యాడ ప్రాథమిక పాఠశాల  భవనం జీర్ణావస్థకు  చేరుకుది. శ్లాబ్‌లో నుంచి మర్రి చెట్టు మొలిచింది. పునాది క్రాక్‌ ఇచ్చి చెట్టు వేర్లు గదుల్లోకి చేరుకున్నాయి.  

చిన నడుపూరు ప్రాథమిక పాఠశాలను నాడు -నేడులో ఎంపికచేసి, శిథిల భవనాన్ని తొలగించారు. ఇప్పటి వరకు భవన నిర్మాణం చేపట్టలేదు.  

అక్కయ్యపాలెం ఎన్‌జీజీఓస్‌ కాలనీలోని ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాల భవనం శ్లాబు పెచ్చులూడాయి.   

గోపాలపట్నం సమీప పద్మనాభనగర్‌ జెడ్పీ హైస్కూల్‌లో  అదనపు తరగతి గదుల నిర్మాణానికి వేసిన పునాదులకు మూడేళ్లు గడిచాయి.  

తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పథకం కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. 

పాత పెందుర్తి ఉన్నత పాఠశాల వానొస్తే చెరువును తలపిస్తోంది. 

సీతమ్మధార ఎన్‌ఎంసీహెచ్‌ స్కూల్‌ తరగతి గదిలో గోడలు బీటలువారాయి.  


రేపటికి పాఠశాలలన్నీ సిద్ధం

ఈనెల ఐదో తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా వారం రోజులుగా ప్రతి పాఠశాలను టీచర్లు అన్నిరకాలుగా తీర్చిదిద్దుతున్నారు. వసతుల విషయంలో ఎక్కడా ఇబ్బంది తలెత్తే అవకాశాలు లేవు. ఐదోతేదీన ప్రతి పాఠశాలలో జగనన్న విద్యాదీవెన కింద కిట్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందీ లేదు. నాడు-నేడు రెండోదశ పనులు ప్రారంభించాలని ఆదేశించాం. 

-ఎల్‌.చంద్రకళ, డీఈవో, విశాఖపట్నం



Updated Date - 2022-07-04T06:11:38+05:30 IST