సమస్యల ఒడి.. సర్కారు బడి

ABN , First Publish Date - 2022-07-05T07:08:55+05:30 IST

ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, తదితర సమస్యల నడుమ మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

సమస్యల ఒడి.. సర్కారు బడి

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

తగినంత మంది లేకపోవడం వల్లనే గత ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గిందనే వాదన

మూడేళ్లుగా డీఎస్‌సీ లేదు

పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త వారిని నియమించని ప్రభుత్వం

ఇప్పటికిప్పు 550 మంది వరకూ అవసరం

పాఠశాలల విలీనంపై సందిగ్ధం

ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌ టూ ప్రారంభంపై రాని ఆదేశాలు

జగనన్న కిట్లు అరకొరగానే రాక

అందని యూనిఫాం, బూట్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, తదితర సమస్యల నడుమ మంగళవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఏటా జూన్‌ 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యేవి. అయితే కరోనా ప్రభావంతో గత విద్యా సంవత్సరం మే ఐదో తేదీ వరకు పాఠశాలలు కొనసాగడంతో ఈ ఏడాది 25 రోజులు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 

సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన డైస్‌ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3,62,977 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వీరందరికీ బోధన కోసం సరిపడా ఉపాధ్యాయులు లేరు. గత మూడేళ్ల నుంచి టీచర్ల నియామకాలకు సంబంధించి డీఎస్సీ నిర్వహించలేదు. దీంతో పదవీ విరమణ చేసిన టీచర్ల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. విద్యా శాఖ అంచనా ప్రకారం అన్ని కేటగిరీలు కలిపి ఇప్పటికిప్పుడు 500 నుంచి 550 మంది ఉపాధ్యాయులు అవసరం. అలాతే విద్యార్థులు తక్కువగా ఉన్న చోట నుంచి ఎక్కువ వున్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. గత ఏడాది టీచర్ల కొరత కారణంగానే పలు పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు నిరాజనకంగా వచ్చాయని విద్యా శాఖ అధికారులు అంటున్నారు.

నూతన విద్యా విధానం అమలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉన్నత పాఠశాలల్లో చుట్టుపక్కల 250 మీటర్లలోపు వున్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేసింది. కొత్త సంవత్సరంలో ఒక కిలోమీటరు పరిధిలో గల పాఠశాలలను విలీనం చేసేందుకు ప్రతిపాదించింది. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో 330 ప్రాథమిక పాఠశాలలు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం అవుతాయి. విలీన పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు వెళతారు. అయితే విలీనంపై ఇంతవరకు పాఠశాల విద్యా శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో పాఠశాలల విలీనం ఉందా? లేదా?...అన్న విషయం జిల్లా అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలలో ప్లస్‌ టూ తరగతులు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు, దానిపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు టీసీలకు ఒత్తిడి తీసుకువస్తుండడంతో హెచ్‌ఎంలు అయోమయంలో పడ్డారు. 


అరకొరగా జగనన్న కిట్లు...

పాఠశాల తెరిచే నాటికి ప్రతి విద్యార్థికి జగనన్న విద్యాకానుక కిట్‌ అందజేస్తామన్న హామీని కూడా  ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్‌కు క్లాత్‌, వర్క్‌ బుక్స్‌, నోట్‌ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువు అందించాల్సి ఉంది. గత ఏడాది విద్యా సంవత్సరంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 258 స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిఽధిలోని 4,133 పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న 3,69,733 విద్యా దీవెన కిట్లు పంపిణీ చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత మూడు జిల్లాలు ఏర్పడినా కిట్ల పంపిణీ బాధ్యత విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే కిట్‌లోని వస్తువులన్నీ పూర్తిగా అందకపోవడంతో అన్ని పాఠశాలలకు అరకొరగానే కిట్లు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 3.62 లక్షల మంది విద్యార్థులకుగాను కేవలం 35 వేల మందికి మాత్రమే యూనిఫాం వచ్చింది. అది కూడా క్లాత్‌. అలాగే బూట్లు 30 వేలు, సాక్సులు 60 వేలు వచ్చాయి. 2.62 లక్షల బ్యాగులు, 2.62 లక్షల బెల్టులు సరఫరా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన బ్యాగ్‌లను జిల్లాలకు సరఫరా చేసేందుకు అనకాపల్లి ఏఎంఏఎల్‌ పాఠశాలలో ఉంచారు. నాలుగైదు రోజుల క్రితం ఆ పాఠశాల వద్ద రహదారి నిర్మాణం కోసం గోతులు తవ్వడంతో వాహనాలు వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాగుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇంకా ఎనిమిది మండలాలకు బ్యాగులు అందాల్సి ఉంది. నోటుపుస్తకాలు మాత్రం పూర్తిగా జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు మూడింట రెండొంతులు జిల్లాకు చేరినా,  మండలాలకు, అక్కడ నుంచి పాఠశాలలకు చేరే సరికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎనిమిదో తరగతికి ఇంతవరకు పాఠ్యపుస్తకాలు చేరలేదు. కాగా ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత ధరకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నారు. అయితే జిల్లాలో ప్రైవేటు పాఠశాలల డిమాండ్‌కు తగినంతగా పాఠ్య పుస్తకాలు అందడానికి సమయం పడుతుందని అంచనా.

Updated Date - 2022-07-05T07:08:55+05:30 IST