బడి బాగుపడేనా?

ABN , First Publish Date - 2022-01-28T05:12:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రాబోతున్నాయా..? శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించబోతున్నారా? పెచ్చులూడుతున్న తరగతి గదులను కూల్చివేయనున్నారా? ప్రైవేట్‌ స్కూళ్లలో ఉన్నట్లుగా అన్ని వసతులను కల్పించబోతున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. మన ఊరు.. మన బడి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు

బడి బాగుపడేనా?
బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో శిథిలావస్థకు చేరిన పాఠశాల గది

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ఆశలు

శిథిలావస్థకు చేరిన పలు పాఠశాలల భవనాలు

పెచ్చులూడుతున్న తరగతి గదులు

సిద్దిపేట జిల్లాలో 191 స్కూళ్లు ఉన్నట్లు నివేదిక

ప్రత్యేక నిధులతోపాటు సీడీపీ నిధుల వెచ్చింపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 27 : ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రాబోతున్నాయా..? శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించబోతున్నారా? పెచ్చులూడుతున్న తరగతి గదులను కూల్చివేయనున్నారా? ప్రైవేట్‌ స్కూళ్లలో ఉన్నట్లుగా అన్ని వసతులను కల్పించబోతున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. మన ఊరు.. మన బడి కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో 976 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 636 ప్రాథమిక, 113 ప్రాథమికోన్నత, 227 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 90వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 


శిథిలావస్థలో 425 గదులు..

జిల్లాలోని దాదాపు సగానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవు. చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాలల్లోనే ఇప్పటికీ తరగతులు నడుస్తున్నాయి. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తూ వాటిలోనే కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకురావడానికి ఇటీవలే ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించ తలపెట్టారు. అదే విధంగా అదనపు గదులు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని 191 ప్రభుత్వ పాఠశాలల్లో 425 గదులు శిథిలావస్థకు చేరినట్లు విద్యాశాఖ నివేదిక సమర్పించింది. ఇందులో ఎక్కువగా ప్రాథమిక పాఠశాలల భవనాలే ఉన్నాయి. 


ప్రత్యేక నిధులు.. సీడీపీ నిధులు

రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు-మన బడి కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భవనాల నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పన కోసం ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దృష్ట్యా మొదటి దశలోనే జిల్లాకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. నిధుల కేటాయింపులోనూ అగ్రస్థానం దక్కుతుందనే భావన నెలకొన్నది. ఈ నిధులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించిన సీడీపీ నిధుల్లో నుంచి 40 శాతం పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. ఈ లెక్కన జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు ప్రాతినిథ్యం ఉంది. ఒక్కొక్కరికి రూ.5 కోట్ల సీడీపీ నిధులు ఉండగా ఇందులో నుంచి రూ.2 కోట్ల వరకు పాఠశాలలకు వెచ్చించాల్సి ఉంటుంది.



Updated Date - 2022-01-28T05:12:08+05:30 IST