దూరం.. భారం

ABN , First Publish Date - 2022-07-09T05:17:06+05:30 IST

పాఠశాలల విలీన ప్రక్రియ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతోంది. ఇప్పటివరకు దగ్గరలో ఉన్న స్కూలు... ఒక్కసారిగా మూడు, నాలుగు కిలోమీటర్లు దూరం అవడంతో వెళ్లేందుకు తమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

దూరం.. భారం
నందిరాజుపాలెం పాఠశాల వద్ద ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

విలీనంతో పాఠశాలలు బహుదూరం

ఉమ్మడి జిల్లాలో 375పైగా పాఠశాలల విలీనం

ఇష్టారాజ్యంగా మ్యాపింగ్‌

కొత్త పాఠశాలకు విద్యార్థులు వెళ్లాలంటే  అగచాట్లే

రోడ్డెక్కుతున్న తల్లిదండ్రులు

మూడు జిల్లాల్లో ఆందోళనలు 


మా స్కూలే మాకు ముద్దు.. విలీనం వద్దే.. వద్దు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నారు. మూడు జిల్లాల్లో పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటివరకు కూత వేటు దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం పేరుతో దూరం చేస్తున్నారని, తమ పిల్లలను అంత దూరం ఎలా పంపాలంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనం పూర్తయితే ఉమ్మడి జిల్లాలో దాదాపు 375 స్కూల్స్‌ మూతపడతాయని, ఈ కారణంగా ఇక భవిష్యత్‌తో టీచర్ల భర్తీ ప్రక్రియే ఉండబోదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. 

 

గుంటూరు(విద్య), జూలై 8: పాఠశాలల విలీన ప్రక్రియ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతోంది. ఇప్పటివరకు దగ్గరలో ఉన్న స్కూలు... ఒక్కసారిగా మూడు, నాలుగు కిలోమీటర్లు దూరం అవడంతో వెళ్లేందుకు తమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల విలీన ప్రక్రియను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం విలీనం అయిన పాఠశాలలు ఇక మూతేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 3,575 వరకు ప్రభుత్వ, జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 4.75లక్షల మంది ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 375పైగా పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేశారు. ఇక ఆయా పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు తమ సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. విలీన ప్రక్రియ కోసం మ్యాపింగ్‌ ఇష్టారాజ్యంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 


విలీనం అయిన పాఠశాలలు ఇక మూతే

విలీనం చేస్తే అక్కడ ప్రాథమిక విద్య ఉండదు. వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచిఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయా పాఠశాలల్లో దాదాపు 2వేల మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఇందులో సగం మంది స్కూల్‌అసిస్టెంట్స్‌గా పదోన్నతి పొంది ఉన్నత పాఠశాలలకు వెళ్తారు. మిగిలిన సగం మందిని ఇతర పాఠశాలల్లో సర్దుబాటు  చేస్తారు. అంటే జిల్లాలో ఇక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలే ఉండవు. కొన్నాళ్ల వరకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీ చేయాల్సిన అవసరం ఉండదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇలా ఇటు పేద విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు ఇక్కట్లు తీసుకువచ్చేలా విలీన ప్రక్రియ ఉంది. 


జిల్లావ్యాప్తంగా ఆందోళనలు..

తమ పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ మాచవరం మండలం కొత్తగణేశునిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు రెండురోజుల కిందట ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అదేరోజు  బెల్లంకొండ నందిరాజుపాలెంలోనూ పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఉన్న ఎంపీపీ స్కూల్‌ను గ్రామంలోని యూపీ స్కూల్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు  నిరసన వ్యక్తం చేశారు. నందిగామలో ఉన్న ఎంపీపీ స్కూల్‌ను హైస్కూల్‌లో విలీనం చేయడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అచ్చంపేట మండలం వేల్పూరు, చింతపల్లి గ్రామాల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను మరో పాఠశాలకు మార్చొద్దని గురువారం వేల్పూరు బస్టాండ్‌ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. క్రోసూరు మండలం అనంతవరం బీసీ ప్రాథమిక పాఠశాలను కిలోమీటరు దూరంలో ఉన్న యూపీ స్కూల్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల సహా తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం స్కూల్‌లో ఇప్పటికే ప్రాథమిక పాఠశాల ఉంది. చుట్టుగుంట సమీపంలోని మరొక స్కూల్‌ విద్యార్థుల్ని ఇక్కడ చేర్పించాలని భావించారు. ఉన్న వారికే గదులు లేక ఇబ్బందులు పడుతుంటే కొత్తగావచ్చే విలీన పాఠశాలల విద్యార్థులకు  బోధన ఎలా అందించాలని ఉపాధ్యాయులు మదన పడుతున్నారు.

Updated Date - 2022-07-09T05:17:06+05:30 IST