సర్కారు బడి.. సిద్ధమేనా?

ABN , First Publish Date - 2022-07-04T05:07:29+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన, ఉచిత విద్యనందిస్తామంటూ పాలకులు పదే పదే ప్రకటిస్తున్నారు. నాడు నేడు పనులతో మౌలిక వసతులు కల్పించి స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామంటూ చెబుతున్నారు.

సర్కారు బడి..   సిద్ధమేనా?
సత్తెనపల్లిలో తడికలతో ఉన్న ఎస్‌ఆర్‌బీఎన్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల

రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

సగం కూడా పంపిణీ కాని పాఠ్యపుస్తకాలు

ప్రారంభం కానీ రెండో విడత నాడునేడు పనులు

పాఠశాల ప్రాంగణాల్లోనే సిమెంటు, ఇసుక

విద్యార్థులకు సరిపడా లేని తరగతిగదులు

వరండాల్లోనే పాఠాలు 

సమస్యలతో స్వాగతం పలుకుతున్న నూతన విద్యా సంవత్సరం 


మంగళవారం నుంచి బడి గంట మోగనుంది... పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. కానీ సర్కారు పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కరువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులు గణనీయంగా పెరుగుతున్నా.. వారికి సరిపడా తరగతి గదులు లేవు. ఉపాధ్యాయుల కొరత సరేసరి. పాఠ్యపుస్తకాలు సగం మాత్రమే స్కూళ్లకు చేరాయి. పైగా ఈ ఏడాది 8వ తరగతి నుంచి సీబీఎస్‌సీ సిలబస్‌ ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించినా దానికి సంబంధించిన ఒక్క పుస్తకం కూడా పాఠశాలలకు చేరలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులు మందకొడిగా సాగుతున్నాయి. అధికారులు సమీక్షలకే పరిమితమవడంతో కొన్నిచోట్ల ప్రారంభ దశలోనే ఉన్నాయి.  


గుంటూరు(విద్య), జూలై3: ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన, ఉచిత విద్యనందిస్తామంటూ పాలకులు పదే పదే ప్రకటిస్తున్నారు. నాడు నేడు పనులతో మౌలిక వసతులు కల్పించి స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామంటూ చెబుతున్నారు. రేపటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కానీ సమస్యలే ఇక్కడ స్వాగతం పలుకుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలలో మొత్తం 3,607 స్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో 4,18,678 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలివిడత నాడు నేడు పనుల ద్వారా నూతన తరగతి గదులు ఏర్పాటు చేయగా, గుంటూరు జిల్లాలో మాత్రం రెండో విడత నాడు నేడు కింద పనులు ప్రారంభం కానున్నాయి. గుంటూరు, తెనాలి, మంగళగిరి వంటి మున్సిపల్‌, కార్పొరేషన్‌ పట్టణాల్లోని స్కూల్స్‌లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 47.87లక్షల పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 19.23 లక్షలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. 


కనీస సౌకర్యాలు కరువు..

 నరసరావుపేట నియోజకవర్గంలోని పాఠశాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆరు తరగతులకు ఒకే గది ఉండటం తరగతులు నిర్వహణకు ఇబ్బందికంగా ఉంటోందని  తల్లిదండ్రులు చెబుతున్నారు. నాడు నేడు మొదటి దశ పనులు చేపట్టిన స్కూల్స్‌లో మినహా ఇతర పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. నాడు నేడు రెండో విడత పనులు ఇంకా ప్రాంభం కాలేదు. పాఠ్యపుస్తకాలు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేదు. ఈపూరు మండలం గుండేపల్లి, శ్రీనగర్‌, చినకొండాయపాలెం, పెదకొండాయపాలెంలో ప్రాథమిక పాఠశాలల్లో అధ్వాన స్థితిలో ఉన్నాయి. యడ్లపాడు మండలంలో 49 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు సగానికిపైగా పాఠశాలలకు ప్రహరీ, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, ఆట స్థలాలు లేవు. ప్రధానంగా తరగతి గదుల కొరత సమస్య వేధిస్తోంది. పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. నాడు-నేడు తొలి దశలో 20పాఠశాలలను ఎంపికచేసి పనులు పూర్తి చేశారు. రెండోదశలో 17 పాఠశాలలను ఎంపికచేసినా నేటికీ పనులు ప్రారంభించ లేదు. పాఠశాలలు ప్రారంభిస్తే పనులు ఎలా చేయించాలో అర్ధంకాక ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో సరిపడా ఉపాధ్యాయులు లేరు. పాఠ్య పుస్తకాలు నామమాత్రంగానే వచ్చాయి. నాడు-నేడు పనులు జరుగుతూనే ఉన్నాయి. నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి.  


 వరండాలోనే పాఠాలు

 గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిఽధిలో ఉన్న 224 పాఠశాలల్లో 50 నుంచి 70 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి విద్యాశాఖాధికారులే కొనసాగుతున్నారు. నాడు-నేడు పథకంతో పాఠశాలలకు రంగులు వేయటం మాత్రమే చేశారు. గతేడాది కొన్ని పాఠశాలలు అదనపు గదులు ఏర్పాటుచేయకపోవటంతో విద్యార్థులు పాఠశాల వరండాలోనే కూర్చోవాల్సి వచ్చింది. పిడుగురాళ్ల, గుత్తికొండ, జానపాడు, లెనిన్‌నగర్‌, తుమ్మలచెరువు, బ్రాహ్మణపల్లి జడ్పీపాఠశాలల్లో విద్యార్థులు గదులు చాలక కాస్త ఇబ్బందిపడుతూనే ఉన్నారు. నాలుగు మండలాల్లో సుమారు 2లక్షలకు పైగా పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉండగా ఇప్పటికీ సగం మాత్రమే విద్యాశాఖ కార్యాలయాలకు చేరాయి.  


 



చెరువుల్లా బడి ప్రాంగణాలు

బాపట్ల నియోజకర్గంలో నాడునేడు  రెండో విడత పనులకు ఇంకా మోక్షం కలగలేదు. చాలా చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇటుకలు, ఇసుక బడి ప్రాంగణం మొత్తం నిండి ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తవడానికి ఇంకా నెలల తరబడి సమయం పడుతుంది. అసలే ఇరుకుగా ఉండే గదుల్లో విద్యాబోధన జరుగుతుంటే ఉన్న స్థలాన్ని కూడా నిర్మాణ సామగ్రికి కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.  నిర్మాణాల సంగతి ఇలా ఉంటే చిన్నపాటి వర్షాలకే బడి ప్రాంగణాలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. శిఽథిలావస్థలో ఉన్న బడుల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. 


పేరుకే పేరెంట్స్‌ కమిటీలు..

 నాడు-నేడు పనుల్లో పేరెంట్స్‌ కమిటీ ప్రాధాన్యం లేదు. అన్ని పనులు పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. నాడు-నేడు రెండో విడత కింద తెనాలి పట్టణానికి రూ.7.35 కోట్లు కేటాయించారు. నాలుగు ఉన్నత పాఠశాలల్లో 47 అదనపు తరగతి గదులు నిర్మాణానికి రూ.5.59 కోట్లు, పది ప్రాథమిక పాఠశాలల్లో పలు అంశాల్లో అభివృద్ధికి రూ.1.56 కోట్లు, నాలుగు పాఠశాలల్లో అంగన్‌వాడీల నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో పాఠశాలల్లో రంగులు, మరమ్మత్తులు, టీవీ, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు, గ్రీన్‌బోర్డులు, మినరల్‌ వాటర్‌ప్లాంట్‌, వాటర్‌ సరఫరాతో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పరికరాలన్నీ ప్రభుత్వమే సరఫరా చేయడం పేరెంట్‌ కమిటీల ఖాతాల్లో ఉన్న నిధులను ఆయా సంస్థలకు చెక్కుల ద్వారా ఇవ్వడం చేస్తున్నారు. అలాంటప్పుడు పేరెంట్స్‌ కమిటీలతో పని చేయిస్తున్నామనే ప్రభుత్వం చెప్పడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కమిషన్ల కోసమే ఈ పరికరాలన్నీ సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పేరెంట్స్‌ కమిటీలు కొద్దిపాటి మరమ్మతులు, చిన్న చిన్న పనులు చేయించడమే తప్పా 75 శాతం నిధుల పని అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందనేది సత్యం. 


పాఠశాలలపై ప్రచారం ఘనం..  

పొన్నూరు మండలం చింతలపూడి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వసతుల లేమితో కునారిల్లుతుంది. పాఠశాల తరగతి గదులు శిథిలమై ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే తరగతి గదుల పెచ్చులూడి నిర్వహణ కష్టంగా మారింది. అలాగే పట్టణంలోని ఎస్‌పీపీ రోడ్డులోని ఉర్దూపాఠశాల, ఇటికంపాడు రోడ్డులోని మునిసిపల్‌ పాఠశాలతో పాటు పలుపాఠశాలలు శిథిలావస్థకు చేరి తరగతులు నిర్వహించాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి నెలకొన్నాయి. వర్షం వచ్చిందంటే పాఠశాల మైదానాలు వర్షపునీటితో నిండి విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. వీవర్స్‌ కాలనీలో పాఠశాల పూర్తిగా శిథిలమవ్వడంతో  వేరొక చిన్న భవనంలోనికి మార్చి తాత్కాలిక తరగతులు నిర్వహిస్తున్నారు. శిథిలమైన పాఠశాలలను తొలగించినప్పటికీ నూతన భవన నిర్మాణం నేటి వరకూ చేపట్టలేదు. ఈ విద్యా సంవత్సరంలో 8,158 మంది విద్యార్థులకు అవసరమైన 94,647 పుస్తకాలకు గానూ కేవలం 40,052 పుస్తకాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. 8వ తరగతి నుంచి సీబీఎస్‌సీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఒక్క పుస్తకం కూడా పాఠశాలలకు ప్రభుత్వం సరపరా చేయలేదు. 


 తడికెలతో తరగతి గదులు 

  సత్తెనపల్లి పట్టణంలోని ఎస్‌ఆర్‌బీఎన్‌ మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. వరండాకు తడికలు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడైనా ఈ భవనం కూలే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు అదనంగా రెండు గదుల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని సుగాలి కాలనీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల రెండోవిడత నాడు-నేడు పథకం కింద ఎంపికైంది. కానీ నేటివరకు పనులు ప్రారంభించలేదు.  పెదమక్కెన గ్రామంలో మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం లోపల పైకప్పు పెచ్చులూడుతుంది. ఇనుప చువ్వలు కూడా బయటకు కనిపిస్తున్నాయి. ఈ పాఠశాలకు ప్రహరీ కూడా లేదు. ఈ పాఠశాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. మండలానికి మొత్తం 1,53,443పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 36,460పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి.  ముప్పాళ్ల 20,800 పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి.  


Updated Date - 2022-07-04T05:07:29+05:30 IST