దూర..విద్య

ABN , First Publish Date - 2022-01-23T05:50:03+05:30 IST

దూర..విద్య

దూర..విద్య

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విలీనానికి ప్రభుత్వ కసరత్తు

250 మీటర్ల దూరంలోని స్కూళ్లన్నీ ఉన్నత పాఠశాలల్లో విలీనం

వచ్చే ఏడాది కిలోమీటరులోపు 

ఆపై ఏడాది రెండు కిలోమీటర్లలోపు

ఆ తరువాత మూడు కిలోమీటర్లలోపు

ఇష్టానుసారంగా నిబంధనలను మార్చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభ్యంతరాలు

ఎంతెంత దూరం అని విద్యార్థులంటుంటే.. చాలాచాలా దూరం అంటోంది ప్రభుత్వం.  విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేస్తూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు దూరాలను లెక్కించి.. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే  ప్రక్రియకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి గందరగోళంగా ఉంది. వీటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనన్న వాదన వినిపిస్తోంది. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా పాఠశాలల విలీనానికి కసరత్తు  జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 163 ప్రాథమిక పాఠశాలలను 250 మీటర్ల దూరంలో ఉన్న  ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. రానున్న మూడేళ్లలో విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరంలో విలీనం చేస్తారు. ఆపై వచ్చే సంవత్సరం రెండు కిలోమీటర్ల దూరం, మూడో సంవత్సరంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేస్తారు. ఈ ప్రకియ పూర్తయితే జిల్లాలోని 2,200 ప్రాథమిక పాఠశాలలు, 400కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉనికిని కోల్పోతాయి. 

విద్యాహక్కు చట్టంలో మార్పులు చేసి..

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2010 నుంచి అమలవుతున్న విద్యాహక్కు చట్టంలో కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల అనే నిబంధన ఉండగా, దానిని నెల రోజుల కిందట మూడు కిలోమీటర్లకు సవరణ చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధన ఉండగా, దానిలో మార్పులు చేసి ఒక టీచరుకు 30 మంది పిల్లలుండాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది దుర్మార్గమైన నిర్ణయమని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ రెండు మార్పులతో మూడేళ్లలో జిల్లాలోని మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 250 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినా విద్యార్థులు వెళ్లట్లేదు.  ఉన్నత పాఠశాలల్లో కూర్చునేందుకు జాగా లేకపోవడంతో 3, 4, 5 తరగతులకు ఉన్నత పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్పి వస్తున్నారు. 

అంతా ఆన్‌లైన్‌లోనే..

జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు తాము పనిచేసే పాఠశాలలు ఉన్నత పాఠశాలకు ఎంత దూరంలో ఉన్నాయనే అంశంపై ఆన్‌లైన్‌లో వివరాలు పంపుతున్నారు. ఆ వివరాల ప్రకారం ఎంఈవోలు, డీవైఈవోలు తనిఖీలు చేసి ఈ వివరాలు కచ్చితంగానే ఉన్నాయని నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోంది. ఈ పరిశీలన పూర్తయ్యాక వచ్చే విద్యా సంవత్సరంలో కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. తమకు కూడా ఈ వివరాలు తెలియవని, అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తోందని డీఈవో కార్యాలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-23T05:50:03+05:30 IST