విలీనంతో వృథా!

ABN , First Publish Date - 2022-07-24T05:07:37+05:30 IST

‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు చేశారు. భవనాలు నిర్మించారు. వసతులు కల్పించారు. పాఠశాలల రూపురేఖలే మార్చామన్నారు. ఇప్పుడేమో అవన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరు’ అవుతున్నాయి. కొత్త విద్యావిధానం పేరిట ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తుండడంతో ఈ పరిస్థితి దాపురించింది. తమ పిల్లలను కిలోమీటర్ల దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు పంపేదిలేదని, విలీన ప్రక్రియ మానుకోవాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం.

విలీనంతో వృథా!
టెక్కలి రూరల్‌ సీతాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నేలపైనే కూర్చున్న 3వ తరగతి విద్యార్థులు

గత ఏడాది నాడు-నేడు కింద రూ.కోట్ల వ్యయంతో పనులు
ఇప్పుడు నూతన విద్యావిధానం పేరిట తరగతుల తరలింపు
విద్యార్థులు, తల్లిదండ్రులు వద్దంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
నిరుపయోగంగా నూతన భవనాలు, ఫర్నిచర్‌, ఇతర సామగ్రి
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు చేశారు. భవనాలు నిర్మించారు. వసతులు కల్పించారు. పాఠశాలల రూపురేఖలే మార్చామన్నారు. ఇప్పుడేమో అవన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరు’ అవుతున్నాయి. కొత్త విద్యావిధానం పేరిట ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తుండడంతో ఈ పరిస్థితి దాపురించింది. తమ పిల్లలను కిలోమీటర్ల దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు పంపేదిలేదని, విలీన ప్రక్రియ మానుకోవాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం.

ఆ భవనాలు అంతే
జిల్లాలో 317 పాఠశాలలను విలీనం చేయాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆందోళనలు.. ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే నాడు-నేడు కింద 150 పాఠశాలల్లో పనులు జరిగాయి. విలీనం చేపట్టిన కొన్ని స్కూళ్లలో ఇప్పటికీ పనులు సాగుతున్నాయి. అయితే విలీనం చేసి.. ఖాళీగా ఉండనున్న భవనాల సంఖ్య.. అందులో నాడు-నేడు పనుల కోసం ఎంత ఖర్చుచేశారన్న వివరాలు వెల్లడించేందుకు సమగ్రశిక్ష, విద్యాశాఖ అధికారులు సుమఖత చూపడంలేదు. ఇంకా సమాచారం రావాలని, లెక్కిస్తున్నామని, పరిశీలిస్తున్నామని మాత్రమే చెబుతున్నారు. అయితే విలీనం వల్ల ఖాళీ అయ్యే పాఠశాలల్లో నాడు-నేడు కింద రూ.15కోట్ల పైనే ఖర్చుచేసినట్లు సమాచారం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఈ నిధులన్నీ వృథా అయ్యే పరిస్థితి నెలకొంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి
హిరమండలం: పెద్దకోరాడ, చిన్నకోరాడ, మోడల్‌ స్కూల్‌లో ప్రస్తుతం నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఈ పాఠశాలల్లో చదివే 3, 4, 5 తరగతులను హిరమండలం ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో విలీనం చేయనున్నారు. అలాగే తంప, గులుమేరు, అవలంగి, మామిడి జోల, భగీరథపురం ప్రాథమిక పాఠశాలలను నాడు-నేడు కింద అభివృద్ధి చేశారు. ఇందులో తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సంగతి అలా ఉంచితే.. విలీనం చేస్తున్నప్పుడు.. నాడునేడు కింద ప్రజాధనాన్ని ఇంకనూ ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాతపట్నం : గంగువాడ, రొంపివలస, పెద్దసీది, కొరసవాడ-ఏ, కాగువాడ ఎంపీపీ స్కూళ్లలో నాడు-నేడు పనులు పూర్తయ్యాయి. వీటిలో కింది తరగతులను విలీనం చేశారు. దీంతో ఈ భవనాలు వృథాకానున్నాయి.

జి.సిగడాం : ఎందువ, దేవరవలస, సంతఉరిటి ప్రాథమిక పాఠశాలల్లో నాడు-నేడు కింద రూ.లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం విలీనం పేరుతో ఈ పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఇది కార్యరూపం దాల్చలేదు. విలీనమైతే ఈ పాఠశాలల్లో నాడు-నేడు కింద ఖర్చు చేసిన నిధులు వృథా అయినట్లే.

ఎచ్చెర్ల: అల్లినగరం, ఎచ్చెర్ల పోలీస్‌ క్వార్టర్స్‌, కేశవరావుపేట, బుడగట్లపాలెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు అక్కడి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను నాడు-నేడు కింద అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ భవనాలను ఉన్నత పాఠశాల అవసరాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వినియోగించనున్నట్టు ఎంఈవో కారు పున్నయ్య తెలిపారు.

ఇచ్ఛాపురం/ రూరల్‌ : ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్న, పురుషోత్తపురం ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. రత్తకన్న ప్రాథమిక పాఠశాల ఆధునికీకరణ కోసం రూ.24లక్షలు ఖర్చు చేశారు. పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో నూతన గదుల నిర్మాణానికి రూ.72 లక్షలు మంజూరయ్యాయి.  ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ప్రాథమిక పాఠశాలను తొలిదశ నాడు-నేడు పథకంలో రూ. 24 లక్షలు వెచ్చించి పనులు చేపట్టారు. ఈ పాఠశాలలో 3, 4, 5 తరగతులను  సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో కొన్ని భవనాలు వృథాగా మిగిలిపోయాయి. ధర్మపురం ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సోంపేట/రూరల్‌: పలాసపురం, గొల్లవూరు, మామిడిపల్లి, తాళ్లభద్ర, కర్తలిపాలెం, మహాదేవిపాఠశాల పాఠశాలలను లక్షలాది రూపాయలతో నాడు-నేడు కింద అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశారు.

కవిటి : పాతకొజ్జిరియా ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. అక్కడా కొన్ని భవనాలు వృథాగా మిగిలాయి.

రణస్థలం : పాతర్లపల్లి, అర్జునవలస ప్రాథమిక పాఠశాలలను ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసి.. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలలు అలంకార ప్రాయంగా మిగిలాయి.

గార : కె.మత్స్యలేశం యూపీ స్కూల్‌ను రూ.20లక్షలతో అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలలో 6, 7, 8 తరగతులను ను ప్రస్తుతం కోకావారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయనున్నారు.

టెక్కలి రూరల్‌: సీతాపురం ప్రాథమిక పాఠశాలను ‘నాడు-నేడు’ కింద రూ.11,81,000లక్షలతో అభివృద్ధి చేశారు. రావివలస ప్రాథమిక పాఠశాలలో రూ.20లక్షలతో పనులు చేపట్టారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే నిధులు వృథా కానున్నాయి.  సీతాపురం ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు లేమి కనిపిస్తోంది. 3,4,5 తరగతులకు చెందిన సుమారు 52 మంది విద్యార్థులకు కేవలం రెండు గదులు మాత్రమే కేటాయించారు. 3వ తరగతి విద్యార్థులకు బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చొంటున్నారు.  

సంతబొమ్మాళి : పాతమేఘవరం ప్రాథమిక పాఠశాలను రూ.26లక్షలతో అభివృద్ధి చేసి.. ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.

నందిగాం: మండలంలో ఏడు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయడంతో ఉన్నత పాఠశాలల్లో స్థల సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  దేవళభద్ర, కణితివూరు బీసీ కానీ, నౌగాం, నర్శిపురం, హరిదాసుపురం, పెద్దబాణాపురం, దిమ్మిడిజోల ప్రాథమిక పాఠశాలలకు నాడు-నేడు కింద సదుపాయాలు సమకూర్చారు. ఈ పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. స్థల సమస్య కారణంగా దేవళభద్ర, కణితివూరు ఉన్నత పాఠశాలల వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.  

వజ్రపుకొత్తూరు : హుకుంపేట ప్రాథమిక పాఠశాలను రూ.25 లక్షలతో అభివృద్ధి చేసి.. ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు.  

కొత్తూరు : మండలంలో 13 పాఠశాలల విలీనానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రస్తుతం 8 విలీనమయ్యాయి. నివగాం-3, కుద్దిగాం, కుంటిభద్ర-1, మాతల ప్రాథమిక పాఠశాలల్లో రూ.లక్షలు వెచ్చించి.. పనులు చేపట్టారు. వాటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

నరసన్నపేట : మండలంలో 14 ఉన్నతపాఠశాలల్లో 17 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేశారు. జగన్నాథపురం, తమ్మయ్యపేట, పెద్దపేట పాఠశాలలను నరసన్నపేటలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల, బోర్డు, బాలికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. పెద్దపేట పాఠశాలకు రూ.16లక్షలతో అదనపు భవనాలు, వంటగది, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. తమ్మయ్యపేట పాఠశాలలో రూ.12లక్షలు, పెద్దపేట పాఠశాలలో రూ.14 లక్షలతో ‘నాడు-నేడు’ పనులు చేపడుతున్నారు. సుందరాపురం, మాకివలస, మడపాం, ఉర్లాం, కంబకాయి పాఠశాలల్లో నాడునేడు పనులు చేయగా.. ప్రస్తుతం వాటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

జలుమూరు : చల్లవానిపేట ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఉన్నత పాఠశాలలో తరగతి గదులు చాలక..  ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకు వెళ్లి బోధిస్తున్నారు. జలుమూరు, కరవంజ, యలమంచిలి, లింగాలపాడు ప్రాథమిక పాఠశాలల్లో నాడు-నేడు పనులు చేపట్టారు. వీటన్నింటినీ సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయడంతో భవనాలు వృథాగా మిగిలాయి.  

ఆమదాలవలస :  తొగరాం, అక్కులపేట, చింతాడ, మెట్టక్కివలస ప్రాథమిక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి పనులు చేపట్టి.. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. పొందూరు మండలం తోలాపి ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, కొత్తకోట, షలంత్రి ప్రాథమిక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి పనులు చేశారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

పోలాకి: బెలమర ప్రాఽథమికోన్నత పాఠశాలలో ఇటీవల రూ.30 లక్షలతో అదనపు భవనాలు నిర్మించారు. 3,4,5 తరగతులను ప్రియాగ్రహారం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. తలసముద్రం, పల్లిపేట, ప్రియాగ్రహారం, దీర్ఘాశి, గాతలవలస, చెల్లాయివలస, జిల్లేడువలస, కుసుమపోలవలస, చల్లబంద, కోరాడలచ్చయ్యపేట, పిరువాడ, కోడూరు, పిన్నింటిపేట,. బెలమరపాలవలస, పాఠశాలలు సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనమయ్యాయి. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో భవనాలు నిరుపయోగంగా మారాయి.

మెళియాపుట్టి : కొసమాల మండల పరిషత్‌ పాఠశాలలో గత ఏడాది రూ.23.48 లక్షలతో నాడునేడు కింద పనులు చేపట్టారు. ఈ పాఠశాల విలీనం చేయడంతో భవనాలు వృధాగా కనిపిస్తున్నాయి. పెద్దలక్ష్మీపురం, కరజాడ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉండగా.. ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం వృధాగా దర్శనమిస్తున్నాయి.  

317 పాఠశాలలు విలీనం
జిల్లాలో 317 పాఠశాలల విలీనం జరుగుతోంది. ప్రక్రియను ప్రారంభించాం. కొన్నిచోట్ల నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులు.. విలీనం కింద మూసివేస్తున్న స్కూళ్లకు ఎంతమొత్తం నిధులు కేటాయించారు? పనులు జరిగాయా? అన్నది సమగ్ర శిక్ష ద్వారా వివరాలు తెప్పిస్తాము.
- పగడాలమ్మ, డీఈవో

Updated Date - 2022-07-24T05:07:37+05:30 IST