అవును.. కి.మీ.లోపు స్కూళ్లూ విలీనం

ABN , First Publish Date - 2021-08-04T08:07:39+05:30 IST

ప్రాథమిక పాఠశాలల విలీనంపై ఆంధ్రజ్యోతి’ చెప్పిన మాటే నిజమైంది. ఒకటొకటిగా మొదలుపెట్టి మొత్తంగానే ‘ఊరి బడి’ని మాయం చేస్తారంటూ తాజాగా ప్రచురించిన కథనం అక్షర

అవును.. కి.మీ.లోపు స్కూళ్లూ విలీనం

తొలిసారి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

‘దూరం’పై నిజమైన ‘ఆంధ్రజ్యోతి’కథనం


అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక పాఠశాలల విలీనంపై ఆంధ్రజ్యోతి’ చెప్పిన మాటే నిజమైంది. ఒకటొకటిగా మొదలుపెట్టి మొత్తంగానే ‘ఊరి బడి’ని మాయం చేస్తారంటూ తాజాగా ప్రచురించిన కథనం అక్షర సత్యమని రాష్ట్ర ప్రభుత్వమే రుజువుచేసింది. నూతన విద్యావిధానంపై కొన్నిరోజుల క్రితం తొలి సమావేశం పెట్టినప్పుడు కేవలం 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్నే హైస్కూళ్లలో విలీనం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలకు కూడా అదే భావన కల్పించింది. దీంతో అంతమేరకే ఉంటుందేమే.. కొంతవరకే ఇబ్బందేమో..నని అంతా అనుకున్నారు. సర్కారు ప్రకటనలోని అసలు గుట్టును విప్పుతూ.. ‘బడి మాయం’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ తాజాగా కథనం ప్రచురించింది. ఇప్పుడదే నిజమైంది. మంగళవారం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ సమావేశంలో అసలు విషయం బయటపెట్టారు.‘‘3178 ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల లోపు ఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో విలీనానికి కిలోమీటరు పరిధిలో ఉన్న మరో 8,417 పాఠశాలల్ని మ్యాపింగ్‌ చేశాం’’ అని తెలిపారు.


అంటే.. ఒక్కో ఉన్నత పాఠశాలకు...సుమారు నాలుగు పాఠశాలలను కలిపేస్తారు. ఈ లెక్కన కొన్ని ఊర్లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ కలిసిపోతాయి. అంటే ఇక ఆవాసాల్లో, పిల్లలకు దగ్గరగా ప్రాథమిక పాఠశాలలు ఉండవు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో సగం హైస్కూళ్లలో కలిసిపోతాయి. ఒకప్పుడు ప్రతి ఆవాసంలోను పాఠశాల ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన వాటిని ఇప్పుడు ఏం సాధించేశారని విలీనం చేసేస్తున్నారన్నది అర్థం కావడం లేదు. అక్షరాస్యత రేటులో దేశంలో అన్నింటికంటే ప్రథమ స్థాన ంలో ఉన్నామా?పోనీ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో ఉన్నామా.. అంటే ఆ దరిదాపుల్లో కూడా లేం. పాఠశాల సమీపంలో ఉంటేనే పిల్లలు వస్తారు. అలాంటిది పాఠశాలలు దూరంగా పెట్టేసి పిల్లలను విద్యకు దూరం చేయడం అనేది సరైన చర్య అనిపించుకోదు. భవిష్యత్‌లో పిల్లల విద్యపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

Updated Date - 2021-08-04T08:07:39+05:30 IST