1 నుంచి స్కూళ్లు

ABN , First Publish Date - 2022-01-30T07:56:57+05:30 IST

కొవిడ్‌ కారణంగా 24 రోజులపాటు సుదీర్ఘంగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన బడులు, విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

1 నుంచి స్కూళ్లు

  • అన్ని విద్యాసంస్థల పునఃప్రారంభానికి సర్కారు ఉత్తర్వులు 
  • 24 రోజుల పాటు సంక్రాంతి సెలవులు
  • సిలబస్‌ కవర్‌ చేసేందుకు స్పెషల్‌ క్లాసులు
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి సబిత
  • స్వాగతించిన ట్రస్మా ప్రతినిధులు
  • మే మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు!
  • షెడ్యూల్‌ ప్రకారమే ఇతర ప్రవేశ పరీక్షలు!!
  • గురుకులాలు కూడా ఎల్లుండి నుంచే
  • జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వేరే గదులు
  • 14 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్‌కు చర్యలు


మే మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పదోతరగతి పరీక్షలకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇంటర్‌లో ఈ ఏడాది సిలబస్‌ను కుదించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు తీసుకువచ్చారు. ఈ ఏడాది పరీక్షల్లో చాయి్‌సలను పెంచాలని నిర్ణయించారు. మే చివరి వారం నుంచి టెన్త్‌ పరీక్షలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా 24 రోజులపాటు సుదీర్ఘంగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన బడులు, విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలన్నీ మంగళవారం నుంచి పనిచేయనున్నాయి. ప్రభుత్వం శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే విద్యాశాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 16 నుంచి అన్ని విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానుండగా.. కరోనా దృష్ట్యా సెలవులను ఈనెల 30వరకు పొడిగించింది.. 31 నుంచి పునఃప్రారంభమవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తాజాగా శనివారం తీసుకున్న నిర్ణయంతో 31వ తేదీ వరకు సెలవులను కొనసాగించి, ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు ఇచ్చారు.


 14 ఏళ్లు పైబడ్డ విద్యార్థుల్లో చాలా మంది మొదటి డోసు తీసుకున్నారు. దీనికి తోడు.. ఇప్పుడు తీవ్రంగా ఉన్న ఒమైక్రాన్‌ వేరియంట్‌ అంతగా ప్రమాదకారి కాకపోవడం.. ఇతర రాష్ట్రాల్లో బడులను తిరిగి తెరుస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలను పునఃప్రారంభించినా.. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై అన్ని జిల్లాల డీఈవోలు తమ పరిధిలోని బడులకు పలు సూచనలను చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా బడుల పునఃప్రారంభానికి ముందే.. వాటి ఆవరణలు,  తరగతి గదులను శానిటైజ్‌ చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లను శుభ్రంగా పెట్టడం.. తాగునీటి సదుపాయాన్ని కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లకు సూచించారు. అదే విధంగా.. విద్యార్థులు తరగతుల్లో భౌతిక దూరం పాటి స్తూ కూర్చొనేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులెవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో స్థానిక పీహెచ్‌సీలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్కూళ్లు, విద్యాసంస్థల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతికి 24 రోజులపాటు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సిలబ్‌సను పూర్తిచేసేందుకు స్పెషల్‌ క్లాసులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. బడుల పునఃప్రారంభానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రస్మా స్వాగతించింది. ట్రస్మా ప్రతినిధులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూధన్‌, రమణారావు తదిరులు సీఎం కేసీఆర్‌,   మంత్రి సబితారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.


గురుకులాల్లోనూ జాగ్రత్తలు

కొవిడ్‌ కారణంగా సుమారు నెల రోజుల విరామం తర్వాత గురుకులాలు మంగళవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవులకు ముందు గురుకులాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో.. గురుకులాలు పునఃప్రారంభమైన తొలిరోజు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై రీజినల్‌ కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు. విద్యార్థులకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే.. వారిని మిగతా పిల్లలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. కొవిడ్‌ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించడం.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కుల ధారణ, భౌతిక దూరం వంటి కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను తూ.చ తప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించారు. 14 ఏళ్లు పైబడ్డ విద్యార్థులందరికీ టీకాలు ఇప్పించేలా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


షెడ్యూల్‌ మేరకే ప్రవేశ పరీక్షలు!

రాష్ట్రంలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే జరిపించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎంసెట్‌, ఐసెట్‌, పీజీసెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రతి సంవత్సరం 4 లక్షల మంది దాకా విద్యార్థులు హాజరవుతుంటారు. జాతీయ ప్రవేశ పరీక్షలైన జేఈఈ వంటి వాటినీ సకాలంలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా సెట్ల నిర్వహ ణ కోసం కన్వీనర్లను ఎంపిక చేశారు. జూన్‌, జూలై నెలల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.



Updated Date - 2022-01-30T07:56:57+05:30 IST