బడి భద్రమేనా?

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

జిల్లాలోని విద్యాసంస్థల్లో కరోనా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోజురోజుకీ కరోనా సెకండ్‌వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో అత్యధిక శాతం విద్యాసంస్థల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖాలాలు లేవు. దీంతో కరోనా వ్యాప్తి కేంద్రాలుగా విద్యాసంస్థలు మారబోతున్నాయి.

బడి భద్రమేనా?
విద్యార్థులు రాక వెలవెలబోతున్న ముక్తినూతలపాడు ఉన్నత పాఠశాల

 విద్యాసంస్థల్లో పొంచి ఉన్న కరోనా ప్రమాదం

మాస్క్‌ల వాడకం అంతంతమాత్రం

బ్యాగుల్లో పెట్టుకుంటున్న కొందరు

కనిపించ ని భౌతిక దూరం, శానిటైజర్‌వాడకం

అధిక ప్రాంతాల్లో ఫించన్ల పర్యవేక్షణ

ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో పాజటివ్‌ కేసులు

కందుకూరు హర్టికల్చర్‌ కాలేజీ మూత, 

ముక్తినూతలపాడు స్కూలు నుంచి విద్యార్థులు


ఒంగోలు, ఆంధ్రజ్యోతి

-ఒంగోలు నగరం ముక్తినూతలపాడు జడ్పీహైస్కూల్‌లో విద్యార్థులు కరోనా భయంతో పాఠశాలకు  దూరమైపోయారు. పాఠశాల ఎదురుగా గల తినుబండారాలు దుకాణంలో కొందరికి కరోనా వచ్చిందని తెలియడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కు పంపడం లేదు. ఉపాధ్యాయులు అయితే ఆఫీసుకే పరిమితమయ్యారు. 

-చీరాలలో చాలా పాఠశాలల్లో భౌతికదూరం కనిపించటం లేదు. ప్రధానంగా తరగతి గదుల్లో నిబంధనలు పాటించటం లేదు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శానిటైజర్‌ అందుబాటులో లేదు. గరల్స్‌ హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అలానే పాఠాలు చెప్పాల్సి వస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు.

బల్లికురవ మండలం చెన్నుపల్లి యూపీ స్కూలులో గత పదిరోజుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఎక్కువశాతం పిల్లల్ని స్కూల్‌కు పంపడం లేదు. పలు ప్రాంతాల పాఠశాలల్లో ఈ పరిస్థితే కనిపిస్తోంది. 

-కందుకూరు పట్టణంలోని ఓవీ రోడ్డులో యాక్సిస్‌ బ్యాంకు మిద్దెపైన ఉన్న ఉద్యాన కళాశాల బాలికల హాస్టల్‌లో ఐదుగురికి కరోనా సోకింది. ముగ్గురు విద్యార్థినులతో పాటు కేర్‌ టేకర్‌, స్వీపర్‌లకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ  కావటంతో ఓగూరు సమీపంలో నిర్వహిస్తున్న ఉద్యాన కళాశాలలో తరగతుల నిర్వహణ ఆపివేసి సెలవులు ప్రకటించారు. హాస్టల్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన విద్యార్థినుల్లో మరికొందరికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు చె బుతున్నారు. 

-ఇదీ జిల్లాలో విద్యాసంస్థల పరిస్థితి. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో పాఠశాలలే వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. చాలావరకు నిబంధనలు పాటించక పోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజర్లు, హ్యాండ్‌వా్‌షలు లేవు. ప్రైవేటు స్కూళ్లలో మాస్క్‌లు, శానిటైజర్లు కనిపిస్తున్నా భౌతికదూరం లేదు. ఇరుకిరుకు గదుల్లో 30మందికిపైగా విద్యార్థులను ఉంచుతున్న పరిస్థితి. ఇప్పటికే వారం, పదిరోజులుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గత పది రోజుల్లో జిల్లాలో 1,629 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదు కాగా వారిలో 5 నుంచి 17ఏళ్ళలోపు వారు 188మంది ఉన్నారు. అంటే వారంత విద్యార్థులేనన్నది బహిరంగసత్యం. అలాగే పదులసంఖ్యలో ఉపాధ్యాయులకు కూడా కొవిడ్‌ సోకింది.


జిల్లాలోని విద్యాసంస్థల్లో కరోనా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోజురోజుకీ కరోనా సెకండ్‌వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో అత్యధిక శాతం విద్యాసంస్థల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖాలాలు లేవు. దీంతో కరోనా వ్యాప్తి కేంద్రాలుగా విద్యాసంస్థలు మారబోతున్నాయి. జిల్లాలోని 30 విద్యాసంస్థల్లో  కరోనా జాగ్రత్తల తీరుపై గురువారం ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించగా కొద్దిచోట్ల మాత్రమే అప్రమత్తత కనిపించింది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటింపు, శానిటైజర్‌ వాడకం, కరోనా నివారణకు ప్రధానాంశాలు కాగా అత్యధిక పాఠశాలల్లో అవి అమలు జరగడం లేదు. అధిక పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ఒక మోస్తరుగా వాడకంలో ఉన్నా భౌతికదూరం పాటింపు, శానిటైజర్ల వాడకం చాలా తక్కువగా ఉంది. విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయం, ప్రార్థన సమయం, క్లాసు రూముల్లో తరగతులు జరిగేటప్పుడు మధ్యాహ్న భోజన సమయాల్లో పరిశీలించగా ఇంచుమించు అన్నిచోట్ల పరిస్థితి దారుణంగానే ఉంది.


భౌతిక దూరం ఎక్కడా లేదు

ప్రైవేటు విద్యాసంస్థల్లో వాచ్‌మన్‌, ఆయాలను పెట్టి శానిటైజర్‌ వేయడం, మాస్కులు ఉంది లేనిదీ చూస్తున్నా భౌతికదూరం మాత్రం పాటించడం లేదు. ఇరుకైన తరగతి గదుల్లో 20 నుంచి 30మందిపైనే విద్యార్థులను ఉంచి బోధన చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజర్‌ మచ్చుకైనా కనిపించడం లేదు. అదేవిధంగా భౌతికదూరం ఉండటం లేదు. మాస్కులు కొందరు పెట్టుకుంటున్నా, మిగతావారు పెట్టుకోకుండా వస్తున్నారు. గుంపులు, గుంపులుగా కలియ తిరుగుతున్న నియంత్రణ ఉండటం లేదు. ఒంగోలు, చీరాల, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి వంటి పట్టణాలతోపాటు పలు ఇతర మండలకేంద్రాలు, కొన్ని ప్రధాన గ్రామాల్లో విద్యాసంస్థల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఒంగోలు నగరపరిధిలోని ముక్తినూతలపాడు హైస్కూలులో గురువారం ఉపాధ్యాయులు తప్ప విద్యార్థులు ఒక్కరు రాలేదు. కందుకూరులోని హార్టికల్చర్‌ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు, వార్డెన్‌కు కరోనా సోకడంతో కాలేజీని మూసివేశారు. పర్చూరు మండలం ఉప్పుటూరు జడ్పీ స్కూలులో గుంపులు, గుంపులుగా విద్యార్థులు మాస్కులు లేకుండా తిరుగుతున్న నియంత్రణ కనిపించలేదు. కొండపిలో జూనియర్‌ కాలేజీ, హైస్కూలు విద్యార్థులు మాస్కులు లేకుండానే ఉండటం కనిపించింది.


గుంపులుగుంపులుగా విద్యార్థులు

గిద్దలూరులోని ప్రైవేటు పాఠశాలల్లో మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా విద్యార్థులు గుంపులుగా ఉన్నారు. ఉలవపాడు ప్రభుత్వ హైస్కూలులోనూ అలాంటి పరిస్థితే కనిపించగా కనిగిరిలోని బాలుర హైస్కూలులో కొందరు విద్యార్థులు మాస్క్‌లు పెట్టుకుంటే మరికొందరు పెట్టుకోకుండా కనిపించారు. దోర్నాలలోని ఏకలవ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాస్కులు లేకుండానే ఎక్కువమంది విద్యార్థులు కనిపించారు. దాంతో పాటు కనీసదూరం కూడా పాటించకుండా గుంపులుగా భోజన సమయంలో కనిపించారు. చిన్నారికట్లలోని ఒక ప్రైవేటు పాఠశాలలో కరోనా నిబంధనలు సంగతి యాజమాన్యానికి పట్టినట్లు లేదు.

 

ఆటోలు, బస్సులు కిటకిట

ఇక పెద్దసంఖ్యలో విద్యార్థులు బస్సులు, ఆటోల్లో స్కూళ్లకు వస్తున్నా వాటిలో భౌతికదూరం మచ్చుకైనా కానరాక పోతుండగా మాస్కులు కూడా ఎక్కువమంది పెట్టుకోవడం లేదు. మార్కాపురంలోని జడ్పీ బాలికల హైస్కూలులో 1,200 మంది విద్యార్థులు ఉంటే 60శాతం మంది మాస్కులు లేకుండా వస్తున్నారు. కొందరు బ్యాగుల్లో మాస్కులు ఉంటున్న ముఖాలకు పెట్టుకోవడం లేదు. అలాంటి వారిని హెచ్చరించడం, శానిటైజర్‌ వేయడం, భౌతికదూరం పాటింపు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. క్లాసు రూంలో 19 మంది విద్యార్థులు మాత్రమే ఉండాల్సి ఉండగా గదులు కొరతతో 40 మందిని ఉంచుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రం కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 







Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST