Abn logo
Oct 30 2020 @ 12:57PM

తెరిస్తే .. తిప్పలే.. ఏపీలో విద్యా సంస్థల ప్రారంభంపై కలవరం

Kaakateeya

ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఆందోళన

బడుల వద్ద కొవిడ్‌-19 నిబంధనల అమలు సాధ్యమేనా..?


గుంటూరు (ఆంధ్రజ్యోతి): కరోనా రోజుకో రీతిలో తగ్గుతూ పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి అంతుచిక్కడంలేదు. ఈ పరిస్థి తుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను వచ్చే నెల 2 నుంచి తెరిచేం దుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధిం చి ప్రభుత్వం షెడ్యూల్‌ని ఖరారు చేసింది. దీంతో తల్లిదండ్రుల్లో ఆందో ళన మొదలైంది. పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే పిల్లల్ని ఎలా పంపా లి.. ఒకవేళ పంపితే ఏమన్నా అయితే పరిస్థితి ఏమిటి అని కలవ రపడుతున్నారు. ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం జరిగే తరగతులకు గైర్హాజరైతే తమ పిల్లలు వెనకబడే అవకాశం ఉందని.. ఏమి చేయాలో అర్థం కావడంలేదని పలువురు తల్లిదండ్రులు మదనపడుతున్నారు. ప్రభుత్వం షెడ్యూల్‌ ఇవ్వడంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఎప్పుడెప్పుడు స్కూళ్లని తెరుద్దామా అన్న ఆత్రుతలో ఉన్నాయి.  ఇప్పటికే జిల్లాలో గుంటూరు సహా పట్టణాల్లో జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. కొవిడ్‌ నిబంధనల అమలు అంతగా అమలుకావడంలేదు.  ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు తెరిస్తే కొవిడ్‌ నిబంధనలు అమలు కష్టంగా మారే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల వద్ద కొవిడ్‌-19 స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అవి ఎంతవరకు ఆయా విద్యాసంస్థల వద్ద అమలు అవుతాయనేది ప్రశ్నార్థకమే. వందల సంఖ్యలో విద్యార్థులు న్న పాఠశాలలు, కళాశాలల వద్ద నిబంధనల అమలు, పర్యవేక్షణ కష్టసాధ్యమనే అభిప్రాయం కూడా వస్తోంది. ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తికి అవకాశం లేకపోలేదని పలువురు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఆస్పత్రుల్లో బాధితులకు పడకలు కూడా లభ్యం కాని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల పర్యవేక్షణకు కొంతమంది అధికారులను ఇన్‌చార్జిలుగా పెట్టనున్నారని సమాచారం.


షెడ్యూల్‌ ఇలా..

నవంబరు 2 నుంచి 9, 10, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభమవనున్నాయి. ప్రస్తుతానికి ఒంటి పూట తరగతులు నిర్వహిస్తారు. అలానే రోజు విడిచి రోజు క్లాసులు జరుగుతాయి. ఉన్నత విద్యకు సంబంధించి నవంబరు 2 నుంచి రొటేషన్‌ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. ఇక 6, 7, 8 తరగతులకు నవంబరు 23న పాఠశాలలు ప్రారంభమౌతాయి. డిసెంబరు 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభిస్తారు. వీరికి కూడా ఒంటి పూట, రోజు విడిచి రోజు క్లాసులు జరుగుతాయి. 


తాజాగా కరోనా కేసులు 359

జిల్లాలో గురువారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన శాంపిల్స్‌ ఫలితాల్లో  కొత్తగా 359 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గుంటూరు నగరంలో 65, తెనాలి - 41, రేపల్లె - 16, బాపట్ల - 15, దుగ్గిరాల - 13, వట్టిచెరుకూరు - 13, తాడికొండ - 11, మంగళగిరి - 10, ప్రత్తిపాడు - 10, మాచర్ల - 10 కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో 155 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 68,130 మంది కరోనా బారిన పడగా వారిలో 677 మంది చనిపోయారు.

Advertisement
Advertisement