భయం లేకుండా.. ఇలా

ABN , First Publish Date - 2021-08-15T05:15:09+05:30 IST

కరోనా మూడో వేవ్‌ భయం మధ్య సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల నిర్వహణపై మార్గదర్శకాలను జారీ చేసింది.

భయం లేకుండా.. ఇలా

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

20 మందికి మించకుండా తరగతుల నిర్వహణ

ఉన్నత పాఠశాలల్లో రోజుమార్చి రోజు తరగతులు

కొవిడ్‌ ప్రొటోకాల్‌తో పాఠశాలల పునః ప్రారంభానికి ఏర్పాట్లు

 

గుంటూరు(విద్య), ఆగస్టు 14: కరోనా మూడో వేవ్‌ భయం మధ్య సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల నిర్వహణపై మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో  20 మంది విద్యార్థులకు మించకుండా తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.  అదే హైస్కూల్‌ స్థాయిలో 6,7 తరగతుల విద్యార్థులకు ఒక రోజు, 8,9,10 విద్యార్థులకు మరోక రోజు పాఠశాలలు నిర్వహించాలని సూచించింది. అంటే వారికి రోజు మార్చి రోజు మాత్రమే తరగతులు ఉంటాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు  10 శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలనే పునః  ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని పాఠశాలల్ని ఒక యూనిట్‌గా గుర్తించి వాటిని పర్యవేక్షించాలి. విద్యార్థులు పాఠశాలకు వచ్చే, మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు విధిగా మాస్క్‌ ధరించేలా చూడాలి. హ్యాండ్‌ శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి అసరమైన వైద్య సదుపాయాలు అందించేలా పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాల్లో ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది.


విద్యార్థులను బడికి పంపుతారా?

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కరోనా మూడో దశ పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల్ని బడికి పంపి కోరి కష్టాలు తెచ్చుకునేందుకు ఎక్కువ మంది పెద్దలు సుముఖత చూపడంలేదని సమాచారం. కాగా జిల్లాలోని పలు కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం తొందరపడకూదని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు రెండు, మూడు రోజుల నుంచి ఫోన్లు చేసి పిల్లలను పాఠశాలలకు పంపిస్తారా/ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించమంటారా అని అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. గుంటూరులో కొంతమంది పిల్లలు కొవిడ్‌ బారిన పడిన విషయం వెలుగులోకి రావడంతో 80 శాతం మందికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇప్పుడప్పుడే పాఠశాలలకు పంపించమని చెబుతున్నట్లు సమాచారం.



Updated Date - 2021-08-15T05:15:09+05:30 IST