ఎయిడెడ్‌.. వసూళ్లు

ABN , First Publish Date - 2021-08-12T05:46:29+05:30 IST

ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఊపిరి తీసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండగా.. ఇదే అవకాశంగా మరికొందరు వసూళ్లకు తెరలేపారు.

ఎయిడెడ్‌.. వసూళ్లు

సంస్థలు, పోస్టుల రక్షణ కోసమంటూ

కోర్టుల ఖర్చులకు చెల్లించాలని ఆదేశాలు

వసూళ్లకు తెరలేపిన యాజమాన్య ప్రతినిధులు

పాతగుంటూరులో విద్యాసంస్థల నిర్వాహకుల భేటీ 


గుంటూరు(విద్య), ఆగస్టు 11: ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఊపిరి తీసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండగా.. ఇదే అవకాశంగా మరికొందరు వసూళ్లకు తెరలేపారు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గ్రాంట్లు ఇచ్చే విషయంలో అచితూచి వ్యవహరిస్తోంది. గ్రాంట్లుతో పాటు పోస్టులు కూడా పోతాయి కాబట్టి.. విద్యాసంస్థల్ని రక్షించుకోవాలంటే ముందుగానే మేల్కోవాలంటూ కొందరు రంగంలోకి దిగారు. కోర్టుల్ని ఆశ్రయించి విద్యా సంస్థలను కాపాడుకోవాలని.. అందుకు అయ్యే ఖర్చులను తలోకొంత వేసుకోవాలని కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తేరలేపాయి. ఈ క్రమంలో రెండు రోజుల  క్రితం నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో ఎయిడెడ్‌ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి జిల్లాలోని దాదాపు 50 విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యారని సమాచారం. ఒక్కో కళాశాల నుంచి రూ.30 వేలు ఒక్కో రెగ్యులర్‌  పోస్టుకు రూ.10 వేలు, కాంట్రాక్టు పోస్టుకు రూ.5 వేలు చొప్పున విద్యాసంస్థలు చెల్లించాలని సూచించారు. ఇలా వసూలైన నగదుతో న్యాయపోరాటం చేయాలని తీర్మానించారు. జిల్లాలో వందల ఏళ్ల క్రితం స్థాపించిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు వందల్లోనే ఉన్నాయి. ఆయా యాజమాన్యాల ఆధ్వర్యంలో స్కూల్స్‌, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు.    ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చూస్తే జిల్లాలో ఏ ఎయిడెడ్‌ కళాశాలకు గ్రాంటు మంజూరు అయ్యే పరిస్థితి లేదు. ఈ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలకు బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అనేక ఎయిడెడ్‌ కళాశాలల్లో సంవత్సరాల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సంస్థలు, పోస్టుల రక్షణకు అంటూ వసూళ్లకు తెరలేపడంతో పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గతంలో కూడా వారి సంస్థల్లో టీచర్‌ పోస్టులను రూ.15 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లపై ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల, కళాశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-08-12T05:46:29+05:30 IST