ప్రాథమికంగా.. విలీనం

ABN , First Publish Date - 2021-08-04T05:54:57+05:30 IST

జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విలీనానికి మార్గదార్శకాలు దాదాపు ఖరారయ్యాయి. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాథమికంగా.. విలీనం
ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉన్న గుంటూరు నగరం ఎన్జీవోకాలనీలోని ఎస్‌కెబిపిఎం స్కూల్‌

జిల్లాలో 241 పాఠశాలల గుర్తింపు

మార్గదర్శకాలు ఖరారు చేసిన విద్యాశాఖ

నూతన విద్యా విధానంలో భాగంగా చర్యలు

దూరాభారంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన


గుంటూరు(విద్య), ఆగస్టు 3: జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విలీనానికి మార్గదార్శకాలు దాదాపు ఖరారయ్యాయి. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో విలీనానికి సంబంధించి అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ఇటీవల గుంటూరులో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో  సమీక్షించారు. ఈ సమీక్షలో అధికారులు విఽధి విధానాలను ఖరారు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 241 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఇలా విలీనమయ్యే పాఠశాలలు ఉన్నత పాఠశాలల ఆవరణలోనే 59 వరకు ఉన్నాయి. అదేవిధంగా ఉన్నత పాఠశాల పక్కనే ఉన్నవి 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలకు 0 మీటర్ల 50 మీటర్ల దూరంలో 6, 50 నుంచి 100 మీటర్ల దూరంలో 47, 100 నుంచి 150 మీటర్ల దూరంలో 11, 150 నుంచి 200 మీటర్ల దూరంలో 50, 200 నుంచి 250 మీటర్ల దూరంలో 26 ప్రాథమిక పాఠశాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాథమిక పాఠశాలలను మూసి వేసి ఆ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు తరలించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సమీపంలో ఉన్న విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లేవారు. విలీనం అయితే వారంతా దూరంగా ఉండే ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిందే.


ఉపాధ్యాయుల్లో ఆందోళన

పాఠశాలల విలీనంపై ఇప్పటికే ఉపాధ్యాయలు అనేక విధాలుగా ఆందోళన చేస్తున్నారు. విలీన ప్రక్రియ వల్ల అనేక మంది విద్యార్థులకు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజనం పథకం అమలులో కూడా ఇబ్బందుల వస్తాయని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక మెనూ, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మరో మెనూ అమలు చేస్తున్నారు. విలీనం తరువాత మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం ఇబ్బందులు ఎదురయ్యే అకాశం ఉంది. ఉపాధ్యాయుల్ని ఏవిధంగా సర్దుబాటు చేస్తారనే విషయంపై కూడా  ఇప్పటి వరకు మార్గదర్శకాలు విడుదల కాలేదు. సబ్జెక్టు టీచర్లతో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు బోధన అందిస్తారా? లేక ప్రత్యేకంగా ఎస్‌జీటీలను నియమిస్తారా? అనే విషయం ఇంకా తేలలేదు. విద్యార్థుల విలీనం తరువాతే ఉపాధ్యాయుల సర్దుబాటు గురించి విద్యాశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు ఈ విధంగా ఆందోళన చెందుతుండగా.. తల్లిదండ్రులు ఆందోళన మరో విధంగా ఉంది. ఇప్పటి వరకు తమ ఇళ్లకు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు పిల్లల్ని పంపేవారు. ప్రస్తుత విలీనం వల్ల దూరంగా పాఠశాలలకు 3, 4, 5 తరగతుల ప్రాయంలోని పిల్లల్ని ఒంటరిగా పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఏదైనా రవాణా వాహనం ఏర్పాటు చేయాలంటే ఆర్థిక భారం మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-04T05:54:57+05:30 IST