టార్గెట్‌ టీచర్స్‌!

ABN , First Publish Date - 2022-06-30T05:01:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసుకుందా? వారిని ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు తీసుకుంటోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయాల కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ ఉద్యోగులపై క్లరికల్‌ ఉద్యోగులకు పెత్తనాన్ని అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి.

టార్గెట్‌ టీచర్స్‌!

సచివాలయ ఉద్యోగులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు
సర్క్యులర్‌ జారీ చేసిన ప్రభుత్వం
‘గెజిటెడ్‌’పై క్లరికల్‌ ఉద్యోగుల పెత్తనమా?
మండిపడుతున్న ఉపాధ్యాయులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసుకుందా? వారిని ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు తీసుకుంటోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయాల కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ ఉద్యోగులపై క్లరికల్‌ ఉద్యోగులకు పెత్తనాన్ని అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ బాధ్యతలను హెచ్‌ఎంలకు అప్పగించారు. భోజనం సరఫరాలో నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా మరుగుదొడ్లు ప్రతిరోజూ శుభ్రం చేయించి ఆ ఫొటోలు తీసి యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వివాదాస్పదమయ్యాయి. అలాగే విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా.. ఉపాధ్యాయులకు మాత్రం ఇవ్వలేదు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా మండల, మునిసిపల్‌  ప్రాథమిక, ప్రాధమికోన్నత, జిల్లా పరిషత్‌  ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా పరిసర గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో పరిస్థితులను పర్యవేక్షించి, కానిస్టెంట్‌ రిథమ్స్‌ ఇన్‌ స్కూల్‌ యాప్‌ కోసం వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్తిగా సహకరించాలని సూచించింది.

ఇదీ పరిస్థితి
 ఉమ్మడి జిల్లాలో 2,354 ప్రాథమిక, 411 ప్రాథమికోన్నత, 491 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న కార్యదర్శులు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు కావడంతోపాటు క్లరికల్‌ కేడర్‌ కంటే దిగువ పోస్టుల్లో ఉన్నారు. ప్రాథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వీరి కంటే ఎక్కువ కేడర్‌లో ఉండగా, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ గెజిటెడ్‌ హోదా ఉంది. ఈ స్థాయి వారిపై సచివాలయ వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీని పర్యవేక్షణ చేసి వివరాలు సేకరించాలని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇది తమను అవమానపరిచేందుకు జారీ చేసిన ఉత్తర్వులుగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను టార్గెట్‌ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మండల విద్యాశాఖాధికారికి అన్ని వివరాలు అందజేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా ఈ పర్యవేక్షణ, వివరాలు సేకరణ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే యాప్‌ల అప్‌డేట్‌తో విద్యాబోధనకు సమయం సరిపోవడంలేదని వారు వాపోతున్నారు.

నిర్ణయం సరికాదు
పర్యవేక్షణ బాధ్యతల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలి. పాఠశాలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అప్‌లోడ్‌ చేసేందుకు ప్రతి పాఠశాలకు ఒక కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ని నియమించాలి. సచివాలయ ఉద్యోగులది క్లర్క్‌ కేడర్‌స్థాయి. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్‌ ఆఫీసర్‌ స్థాయి ఉంది. పాఠశాలల పర్యవేక్షణ సచివాలయ కార్యదర్శులకు అప్పగిస్తే సమన్వయం లోపించే అవకాశాలున్నాయి.
- ఆర్‌వీ.అనంతాచార్యులు, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు

లేనిపోని సమస్యలు
 సచివాలయ ఉద్యోగులు వారి పనులు వారు చూసుకుంటే పర్వాలేదు. ఉపాధ్యాయులపై అజమాయిషీ చేయాలని చూస్తే అనేక సమస్యలు వస్తాయి. పాఠశాలల నిర్వహణ బాధ్యతలు ఇప్పటికే ఎంఈవో, సీఆర్‌పీలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా సచివాలయ ఉద్యోగులను పర్యవేక్షణ పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయులపై కక్ష సాధింపులా ఉంది.
- బి.శంకరం, ఆపస్‌ మండల అధ్యక్షులు, ఇచ్ఛాపురం.
 

Updated Date - 2022-06-30T05:01:28+05:30 IST