సిటీ రెడీ

ABN , First Publish Date - 2021-02-24T06:24:09+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి 6,7,8

సిటీ రెడీ

నేటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం

గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఏర్పాట్లలో ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులు

రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు

మూడు తరగతుల్లో 1.90 లక్షల మంది విద్యార్థులు

సంతోషం వ్యక్తం చేస్తున్న ‘బడ్జెట్‌’ యాజమాన్యాలు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి 6,7,8 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి ఆఘమేఘాలపై అధికారులు, పాఠశాలల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో నేటి నుంచి మరో మూడు తరగతులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. గతేడాది మార్చి 16 నుంచి ఇంటికే పరిమితమైన 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ బోధనలు అందించాలని ప్రభుత్వం నిర్ణయుంచింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు తమ పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


జిల్లాలో 1,434 పాఠశాలలు..

హైదరాబాద్‌ జిల్లాలో 6 నుంచి 10వ తరగతికి సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 181. 113 ఎయిడెడ్‌, 1140 ప్రైవేట్‌స్కూళ్లు నడుస్తున్నాయి. అన్ని రకాల యాజమాన్యాలను కలిపి లెక్కిస్తే 6 నుంచి 10 తరగతుల్లో 3,24,233 మంది, 6-8 తరగతుల్లో 1.90 లక్షల మంది చదువుతున్నారు.  


బెంచీకి ఒక్కరే..

ఇప్పటికే 9, 10 విద్యార్థులను బెంచీకి ఒకరి చొప్పున కూర్చోబెట్టి క్లాసులు చెబుతున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు బుధవారం నుంచి 6, 7, 8 పిల్లలకు కూడా అదే పద్ధతిలో పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవంగా 1 నుంచి 5 తరగతుల వరకే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఒక్కో క్లాసును రెండు, మూడు సెక్షన్లుగా విభజించి పాఠాలు చెబుతుంటామని పాఠశాలల నిర్వాహకులు చెప్పారు. 5 నుంచి పై తరగతుల్లో తక్కువ మంది ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. 


రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ బడులు 

6, 7, 8 తరగతులకు క్లాస్‌రూమ్‌ బోధనలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాలకు సమాచారం చేరవేశాం. ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలు పాటించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైషన్‌ నిర్వహించాలి. మాస్కులు లేకుండా వస్తున్న పిల్లలను హెచ్చరించాలి. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధనలు ప్రారంభిస్తాం.

- రోహిణి, జిల్లా విద్యాశాఖాధికారి


భౌతిక దూరాన్ని మరవద్దు

విద్యార్థులు భౌతికదూరంపై జాగ్రత్త వహించాలి. జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, నలతగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న వారు బడికి రాకుండా చూడాలి. టైప్‌-1 మధుమేహం ఉన్న పిల్లలకు తప్పని సరిగ్గా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. పిల్లలు గుంపులుగా చేరకుండా చూడాలి. 

- డాక్టర్‌ జగదీ్‌షకుమార్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, మెడికవర్‌ ఆస్పత్రి


ప్రాణం పోసినట్లయింది 

కరోనాతో బడ్జెట్‌ పాఠశాలలు తీ వ్రంగా నష్టపోయాయి. కొన్ని అర్ధాంతరంగా మూతపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం బడ్జెట్‌ పాఠశాలలకు ప్రాణం పోసినట్లయింది. 

- ఉమాశంకర్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు


చాలా సంతోషం

మాకు ఇద్దరు కుమార్తెలు. మా ఆయన, నేను ఇద్దరం ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నాం. పెద్దమ్మాయి పదో తరగతి చదువుతుండడంతో 15 రోజులుగా పాఠశాలకు వెళ్తోంది. ఆరో తరగతి చదువుతున్న చిన్నమ్మాయి ఇంట్లో ఆన్‌లైన్‌ క్లాసులు వింటోంది. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తుండడంతో చిన్న కూతురు  ఇప్పటివరకు ఇంటిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒంటరిగా ఉండేది. బుధవారం నుంచి పాఠశాలకు రమ్మని సమాచారం వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా వరకు చాలా సంతోషకరం.

- సుకన్య, విద్యార్థిని తల్లి, సోమాజిగూడ

Updated Date - 2021-02-24T06:24:09+05:30 IST