Advertisement
Advertisement
Abn logo
Advertisement

బడి మారుతోంది!

పాఠశాలల విలీనానికి సర్వం సిద్ధం

ఉన్నత విద్యాలయాల్లోకి 3, 4, 5 తరగతులు

1 నుంచి అమలుకు కసరత్తు

నూతన విధానంపై తల్లిదండ్రుల ఆందోళన


నెల్లూరు (విద్య), అక్టోబరు 21 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన విద్యావిధానం అమల్లో భాగంగా పాఠశాల విద్యారంగంలో పలు మార్పులు సంతరించుకోనున్నాయి. నూతన విధానంలో ఆరు రకాల పాఠశాలలను నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయం.  దీనిని దశలవారీగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడత ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. దీనికోసం జిల్లా విద్యాశాఖ ప్రాఽథమికంగా కసరత్తు పూర్తి చేసింది. నవంబరు 1 నుంచి నూతన విధానం అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.


జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉండే 227 ప్రాథమిక పాఠశాలల జాబితాను సిద్ధం చేశారు. వాటిని ఆయా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి 3, 4, 5 తరగతుల విద్యార్థులను తరలించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సదరు ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలను కూడా వేగవంతం చేశారు. ప్రాఽథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఎస్‌జీటీలను 30 మందికి ఒకరు చొప్పున 1, 2 తరగతులకు కేటాయించనున్నారు. ఉపాధ్యాయులకు తగినట్లుగా తరగతులు అప్పగించాలి. ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాలు లేకుంటే ప్రస్తు తం నడుస్తున్న చోటే 3, 4, 5 తరగతులను నిర్వహిస్తారు.  3 నుంచి 10 తరగతులు బోధించే వారికి వారానికి 32 బోధన కాలాంశాలు మించకుండా హెచ్‌ఎంలు చూడా ల్సి ఉంటుంది. అదనపు సౌకర్యాలు కల్పించకుండా, ఉపాధ్యాయుల కొరత తీర్చకుండా ఈ ప్రక్రియ చేపట్టడం ఒకింత ఇబ్బందికరమేనని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రస్తుత ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


తల్లిదండ్రుల ఆందోళన


ప్రతి ప్రాంతంలో ప్రాఽథమిక పాఠశాల ఉండాలన్న ఉద్దేశంతోనే గతంలో అన్ని ప్రాంతాల్లో బడులను ప్రారంభించారు. ప్రాఽథమిక విద్య అందుబాటులో ఉంటేనే పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుందని, బడి దూరం పెరిగితే చదువు సాగడం కష్టమని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా కొవిడ్‌తో చిన్నాభిన్నం అయిన విద్యావ్యవస్థకు నూతన విద్యావిధానంతో మరింత విఘాతం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. 


ఉన్నతాధికారులకు నివేదిక


ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించి దూరం, పాఠశాల గదులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలన్నీ సేకరిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో పాఠశాలలను విలీనం చేస్తాము.

- రమేష్‌, డీఈవో


Advertisement
Advertisement