నేడే బడి గంట

ABN , First Publish Date - 2022-07-05T05:56:06+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభం కానున్నాయి. సమస్యల నడుమే బడిగంట మోగనుంది.

నేడే బడి గంట

పూర్తిస్థాయిలో అందని జగనన్న కిట్లు

ఏ బడికెళ్లాలోనన్న

అయోమయంలో 

3, 4, 5 తరగతుల పిల్లలు

కొత్తచెరువు

ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభం కానున్నాయి. సమస్యల నడుమే బడిగంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం, ఉన్నత తరగతిలో చేరబోయే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లు అందజేసి, పాఠశాలల పునఃప్రారంభాన్ని ఘనంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. అరకొరగానే జేవీకే కిట్లు వచ్చాయి. వాటిని అన్ని పాఠశాలలు సర్దుకుని, కార్యక్రమాన్ని మమ అనిపించాలని అనధికార ఆదేశాలు అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి లేవని చెప్పాలోనని తలలు పట్టుకుంటున్నారు. పాఠశాలల్లో వసతులు కూడా మెరుగుపడింది లేదు. సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేశాయి. నాడు-నేడు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల నడుమే విద్యార్థులు బడిలో అడుగు పెట్టాల్సి వస్తోంది. పాఠశాలల విలీనం తర్వాత 3, 4, 5 తరగతులను ఏ పాఠశాలలో కలిపారన్న దానిపై స్పష్టత లేదు. ఆయా తరగతుల విద్యార్థులు ఏ పాఠశాలకు వెళ్లాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.


బడి ఏది?

పాఠశాలల విలీనంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఏ పాఠశాలలో కలిపారన్న దానిపై స్పష్టత లేదు. మంగళవారం విద్యార్థులు బడికెళ్లాల్సి ఉంది. ఏ బడికెళ్లాలి, తమ బడి ఏది అని వారు అయోమయంలో పడ్డారు. కొత్త బడిలో వారికి వసతులు, టీచర్ల నియామకంపై కూడా స్పష్టత లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


కిట్లు కొన్నే..

పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులందరికీ 7 రకాల ఐటమ్స్‌ (పాఠ్యపుస్తకాలు, బెల్ట్‌, బూట్లు, సాక్సులు, బ్యాగులు, డిక్షనరీ, యూనిఫాం)తో కూడిన జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లను అందజేయనున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. పండుగ వాతావరణంలో పాఠశాలల పునఃప్రారంభోత్సవం నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఆ మేరకు కిట్లు పాఠశాలలకు చేరలేదు. వందల సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలకు పదుల సంఖ్యలో కిట్లు వచ్చాయి. వచ్చిన కొన్నింటినే పాఠశాలలు పంచుకుని, కొందరికే పంపిణీ చేసి, మమ అనిపించాలని అనధికారిక ఆదేశాలు అందినట్లు ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 8వ తరగతికి సంబంధించి పాఠ్యపుస్తకాలు ముద్రించనేలేదు. మిగిలిన  తరగతులకు కూడా అరకొరగా వచ్చాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.


వసతులు కరువు

శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా 2026 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక 1560, ప్రాథమికోన్నత 225, జిల్లా పరిషత, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 241 ఉన్నాయి. ఇవికాక మోడల్‌, కేజీబీవీ తదితర పాఠశాలలున్నాయి. వీటిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 84,743 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 91,010 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి సరిపడా వసతులు పాఠశాలల్లో లేవు. అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవలేదు. దీంతో వరండాలో, చెట్లకింద చదువులు తప్పేలా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు-నేడు కింద ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నా.. ఆ మేరకు ప్రయోజనం కనిపించడం లేదన్న వాదనలున్నాయి.


పారిశుధ్యం.. అధ్వానం

ప్రభుత్వం అన్ని నిధులిచ్చాం.. ఇన్ని నిధులిచ్చాం.. అని చెబుతున్నా.. పాఠశాలల్లో పారిశుధ్యం మాత్రం అధ్వానంగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణం. చాలాచోట్ల దెబ్బతిన్నాయి. అపరిశుభ్రత తాండవిస్తోంది. అమ్మఒడి సొమ్ములో రూ.2వేలు కోత విధించి, పారిశుధ్య పనులకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన పారిశుధ్యం మెరుగుపడాలి. అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఇలా.. సమస్యల నడుమ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Updated Date - 2022-07-05T05:56:06+05:30 IST