బడి లేక.. బువ్వ దొరకక.. విద్యార్థుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2021-05-08T17:49:49+05:30 IST

కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 16న మూతపడిన పాఠశాలలు

బడి లేక.. బువ్వ దొరకక.. విద్యార్థుల ఆకలి కేకలు

హైదరాబాద్‌ సిటీ : వైరస్‌ నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు మూతపడి ఉంటున్నాయి. స్కూళ్లు నడిచిన సమయంలో విద్యాబుద్ధులతో పాటు నాణ్యమైన భోజనం చేసిన వేలాది మంది పిల్లలు ప్రస్తుతం అర్ధాకలితో అలమటిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా 2020 మార్చి 16న మూతపడిన పాఠశాలలు మధ్యలో కొన్నాళ్లు తెరుచుకుని రెండో దశ నేపథ్యంలో 2021 మార్చి 24 నుంచి మళ్లీ మూతపడ్డాయి.


భోజనం లేక బక్క చిక్కి

సర్కారు పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనాన్ని అందించేవారు. వేలాది మంది పేద పిల్లలు మధ్యాహ్నం బడిలో, రాత్రి పూట ఇంట్లో రెండు పూటలా కడుపు నింపుకునేవారు. పాఠశాలలు మూతపడి ఉంటుండడంతో మధ్యాహ్న భోజనం కరువైంది. తల్లిదండ్రులకు కూడా చేసేందుకు పనులు లేకపోవడంతో తమ పిల్లలకు పూర్తి స్థాయిలో ఆహారాన్ని అందించలేకపోతున్నారు. దీంతో చాలామంది పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నట్లు డాక్టర్లు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. బడులు తెరిచి ఉంటే నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు రాష్ర్టీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎ్‌సకే) ద్వారా వారి శారీరక ఎదుగుదలను గుర్తించి చికిత్స అందించేవారు. కానీ ప్రస్తుతం అవేమీ లేవు.


కొవిడ్‌ వేళ.. గుడ్లు అందక..

కొవిడ్‌ రెండో దశ పంజా విసురుతోంది. పెద్దలు, యువకులతోపాటు పిల్లలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ సమయంలో బడీడు పిల్లలకు పోషకాహారం అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో రోజూ తప్పనిసరిగా గుడ్డు పెట్టాలని సూచిస్తున్నారు. పాఠశాలలు నడిచిన సమయంలో వారానికి మూడు గుడ్లు పిల్లలకు అందేవి.  పనులు లేక ప్రస్తుతం తాము పిల్లలకు వారానికి ఒక గుడ్డు కూడా ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ఇంటివద్దకు తెచ్చి అందించాలి 

పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. యూ-డైస్‌ లెక్కల ప్రకారం ప్రాంతాల వారీగా పిల్లలను గుర్తించి నేరుగా ఇంటి వద్దకే భోజనం తయారు చేసి అందించాలి. ఏడాదిన్నరగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయిన కారణంగా ఒక్కో విద్యార్థిపై పెట్టే  ఖర్చు వారి తల్లిదండ్రుల ఖాతాలో జమచేయాలి. 

- పగిడిపల్లి శ్రీహరి, ఏబీవీపీ.

Updated Date - 2021-05-08T17:49:49+05:30 IST