ఉత్తర్వులేనా..?

ABN , First Publish Date - 2021-08-31T05:21:12+05:30 IST

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల్లోని ఇంటర్‌ కళాశాలల ఫీజులను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులేనా..?

ఇంటర్‌ ఫీజుల భారం తగ్గేనా

ఫీజుల అమలు జీవోపై స్పష్టత శూన్యం

ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అయోమయం

ఫీజుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారమెవ్వరికో?

ఉత్తి ఉత్తర్వులతో ఫలితం ఏమిటంటున్న విద్యార్థి సంఘాలు


ఫీజుల దోపిడీని అరికట్టేలా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిర్దేశిత ఫీజులు ఏవిధంగా అమలు చేస్తారు.. పట్టించుకోని కళాశాలల నిర్వాహకులపై తల్లిదండ్రులు ఎక్కడ ఫిర్యాదులు చేయాలి.. అనే అంశాలపై స్పష్టత లేకుండా ప్రభుత్వం జీవో 52 జారీ చేసింది. ఈ ఉత్తిత్తి.. ఉత్తర్వులతో ఫలితం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జీవోలో ఫీజులు విషయం గురించి మాత్రమే ప్రస్తావించారని చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ బోర్డుకు ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతో ఏ ఒక్క కళాశాల కూడా విద్యార్థుల్ని చేర్చుకునే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


గుంటూరు(విద్య), ఆగస్టు 30: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల్లోని ఇంటర్‌ కళాశాలల ఫీజులను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు.. గత ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ వ్యవహారంలాగే ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు గత ఏడాది గుంటూరులోని ఓ ఇంటర్‌ మీడియట్‌ కార్పొరేట్‌ కళాశాలో తనిఖీ చేశారు.. అక్కడ ఒక్కో రెసిడెన్సియల్‌ విద్యార్థి నుంచి రూ.1.50 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నట్లు.. సౌకర్యాలు, వసతులు అధ్వానంగా ఉన్నాయని గుర్తించింది. అయినా సదరు కళాశాలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఫీజుల ఉత్తర్వులు కూడా ఇదే కోవలోకి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చిన్న, మధ్య తరహా ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు దాదాపు 200కిపైగా ఉన్నాయి. ఏ కళాశాలలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతో విద్యార్థులకు సీటు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఫీజు తీసుకుని సీటు ఇవ్వాలని అడిగితే కనీసం స్పందించే కళాశాలలు కూడా లేవని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు హాస్టల్‌+జేఈఈ/నీట్‌/ఈఏపీసెట్‌/ కోచింగ్‌ కోసం హీన పక్షం రూ.లక్షపైనే చెల్లించుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వాస్తవంగా పంచాయతీ పరిధిలోని కళాశాలల్లో ఏడాదికి సైన్స్‌ విద్యార్థుల వద్ద రూ.25 వేలు, ఆర్ట్స్‌ విద్యార్థుల వద్ద రూ.15 నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అదే మున్సిపల్‌, కార్పొషన్‌ పరిధిలో అయితే రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు కొన్ని కళాశాలల్లో అయితే రూ.2లక్షల వరకు(హాస్టల్‌తో) వసూలు చేస్తున్నారు.


ఇప్పటికే చాలావరకు ఫీజులు వసూలు

ఇప్పటికే జిల్లాలోని పలు కళాశాలల నిర్వాహకులు దాదాపు 30 శాతం ఫీజు విద్యార్థుల నుంచి వసూలు చేశారు. మరికొన్ని కళాశాలలు అయితే ఇంటర్‌, హాస్టల్‌, జేఈఈ/నీట్‌/ఏపీఈసెట్‌ల పేరుతో మొత్తం ఫీజులు కూడా వసూలు చేశాయి. మూడు నెలలకు పైగా తరగతులు జరుగుతుండటం.. ఫీజులు కట్టిన వారికే లింక్‌లు పంపుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఫీజలు చాలావరకు చెల్లించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రభుత్వం ఫీజులు నిర్దేశిస్తూ జీవో జారీ చేయడంతో గతంలో తాము చెల్లించిన ఫీజులపై తల్లిదండ్రులు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకునే వారు ఎవరూ లేరు. ఉత్తర్వులు అమలు చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ప్రభుత్వ ఫీజులు ఇలా

కేటగిరి         సైన్స్‌ గ్రూపు         ఆర్ట్స్‌ గ్రూపు

గ్రామ పంచాయతీ రూ.15,000         రూ.12,000

మున్సిపాల్టీ         రూ.17,500     రూ.15,000

నగరపాలక సంస్థ రూ.20,000         రూ.18,000 

(జేఈఈ, నీట్‌, ఏపీఈసెట్‌ శిక్షణకు మరో రూ.20 వేలు


Updated Date - 2021-08-31T05:21:12+05:30 IST