సమస్యలకు లో‘బడి’...!

ABN , First Publish Date - 2022-01-24T04:21:53+05:30 IST

మార్కాపురం పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తం 3 ఉన్నత, 14 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పురపాలక శాఖ నడుపుతోంది.

సమస్యలకు లో‘బడి’...!
సుందరయ్య కాలనీ పాఠశాలలో నేలపైనే చదువులు, వర్షాలకు నాని కూలేందుకు సిద్ధంగా ఉన్న వివేకానంద పాఠశాల పైకప్పు


దయనీయస్థితిలో మార్కాపురం పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలలు

శిథిలావస్థలో తరగతిగదులు, మరుగుదొడ్లు, 

కొన్నిచోట్ల వాటి ఊసే లేదు.. దొరకని తాగు, వాడుక నీరు


మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 23 : మార్కాపురం పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తం 3 ఉన్నత, 14 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పురపాలక శాఖ నడుపుతోంది. పూలసుబ్బయ్య కాలనీ, ఏకలవ్య కాలనీ, ఏసీబీసీ కాలనీల్లో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 3వ వార్డు, ఏకలవ్య, డ్రైవర్స్‌, సుందరయ్య, ఏసీబీసీ, పూలసుబ్బయ్య, జవహర్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీలలో, 5వ వార్డు దళితవాడ, 32వ వార్డు లూథరన్‌ పాఠశాల, ఇస్లాంపేట, ఒంటెద్దు కాలనీ, రాజీవ్‌నగర్‌, ఏకలవ్యకాలనీ, చెన్నరాయునిపల్లెలో మున్సిపల్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మొదటి విడత నాడు-నేడులో రూ.1.80 లక్షలతో ఆధునికీకరణ జరిగాయి. కొన్ని పాఠశాలలు మాత్రం నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు. 


సకల సమస్యలతో...

మూడో వార్డులోని మున్సిపల్‌ తెలుగు, ఉర్దూ పాఠశాలలు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలుగు ప్రాథమిక పాఠశాలలో 71 మం ది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ ఉన్నారు. 1974లో సమీపంలోని బ్రహ్మంగారి మఠంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల తిరువీధుల బావి సమీపంలో భవనం నిర్మించారు. చుట్టూ అలుగు కాలువ, ఎదురు చెరువు కట్ట కింద వేసే పేడ దిబ్బలు, పాఠశాల ఎదురు ఆటోస్టాండ్‌లు, తూర్పువైపు శిథిలావస్థకు చేరిన వాహనాలు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో వాడుక, తాగు నీటి సౌకర్యాలు లేవు. సమీప బోరులో నీరే ఆధారం. పాఠశాలలో ఆకతాయిల గోల, మందు బాబుల వీరంగంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు గేటు దూకి లోపలకు వచ్చి మందుబాబులు మద్యంతోపాటు గం జాయి సేవిస్తున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. పైఅంతస్తులో ఉన్న ఎంపీఎల్‌ ఉర్దూ, బాలికల పాఠశాలలో 82 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా రు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. ఈ పాఠశాలలో సమీపంలోని చిన్న మసీద్‌ ఎదురుగా ఉన్న అక్కమ్మ బావి సమీపంలో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 


సుందరయ్యకాలనీలో అద్దెభవనంలో బడి

అత్యంత దయనీయమైన స్థితిలో సుందరయ్య కాలనీలోని మున్సిపల్‌ బాలసరస్వతి పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాల నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నెలకు రూ.1000 అద్దె చెల్లిస్తున్నారు. బెచ్చల గోడలు, రేకుల షెడ్డు లో ఏడేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారు. కార్మికులు, నిరుపేదలు నివసించే ఈ కాలనీలోని పాఠశాలలో 71 మంది విద్యార్థులు చదువుతున్నారు. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారు. మరుగుదొడ్లతోపాటు నీటి వసతి కూడా లేదు. ఇక విద్యుత్‌ ఊసే లేదు. వర్షం వస్తే చాలు విద్యార్థులు తడవాల్సిందే. వంట గది లేదు. ఒక వరండాలో, 3 తరగతులు ఒక  రూంలో రెండు తరగతులు సాగుతున్నాయి. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోలేదని, కనీసం మంచి అద్దె భవనంలోనైనా తరగతులు నిర్వహించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తాగు, వాడుక నీరే లేదు

రాజ్యలక్ష్మి నగర్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక భవనానికి రూ.3500 అద్దె చెల్లిస్తున్నారు. వృథాగా పడి ఉన్న రేకుల షెడ్డుకు రూ.1500 అద్దె చెల్లిస్తూ చదువు నేర్పుతున్నారు. 126 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక వలంటీర్‌ ఉన్నారు. రేకుల వరండాలో 3 తరగతి గదులు నిర్వహిస్తున్నారు. వర్షానికి తీవ్ర ఇబ్బందులు  పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు ఆడుకోవడానికి కూడా స్థలం లేదు. తాగు, వాడుక నీరు మాటే లేదు. 



వేధిస్తున్న గదుల కొరత

ఐదో వార్డు దళితవాడలోని ఏబీఎం లోయర్‌ ప్రాథమిక పాఠశాల 1952లో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఉన్న స్థలంలోనే రెండంటే రెండు తరగతి గదులతో భవనం నిర్మించారు. రెండేళ్ల క్రితం 34 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో నేడు 94 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌లు ఉన్నారు. వీరికి అదనంగా మరో రెండు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. పై అంతస్తులో నిర్మించాలంటే విద్యుత్‌ తీగలు పాఠశాల పైనుంచి వెళ్తున్నాయి. తీగలు తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేవు.  


వరండాలో చదువులు

మరో దళితవాడలోని లూథరన్‌ ప్రాథమిక పాఠశాల దాదాపు శిథిలావస్థకు చేరింది. 126 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యా వలంటీర్లు ఉన్నారు. 3 గదులతో పాటు వరండాలో విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 3 గదుల అవసరముంది. వంట గది లేదు. తాగు, వాడుక నీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేసి కొత్తది నిర్మించాల్సి ఉంది. 


ప్రమాదకరంగా గదులు

17వ వార్డులోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ వివేకానంద పాఠశాల గదులు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరాయి. 170 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ ఉన్నారు. 1992లో పాఠశాల భవనం ఏర్పాటు చేశారు. 1996లో మరో రెండు అదనపు తరగతి గదులు నిర్మించారు. పాఠశాలలోని ఒక తరగతి గది ప్రమాదకరంగా మారి శిథిలావస్థకు చేరి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలన్నీ అభివృద్ధి చేయాల్సి ఉంది. 


రెండో విడత అభివృద్ధి చేస్తాం

షేక్‌ సుభానీ, డీఈ 

మొదటి విడతలో నాడు-నేడు కింద రూ.1.80 లక్షలతో 6 పాఠశాలలు ఆధునీకరించాం. రెండో విడత 7 పాఠశాలలకు ప్రతిపాదనలు పంపాం. సుందరయ్య కాలనీలోని పాఠశాలకు సొంత భవనం నిర్మించాలంటే దేవదాయశాఖకు చెందిన ఆ భూమి కోర్టు వివాదంలో ఉంది. రాజ్యలక్ష్మికాలనీలో మున్సిపల్‌ స్థలం గుర్తించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తాం.

Updated Date - 2022-01-24T04:21:53+05:30 IST