స్కూళ్ల రాయితీ బాట

ABN , First Publish Date - 2020-08-13T07:32:13+05:30 IST

పిల్లల స్కూల్‌ ఫీజులను తగ్గిస్తాం.. స్కూళ్లు తెరిచేవరకు.. ఈ విధానాన్ని అమలు

స్కూళ్ల రాయితీ బాట

  • వార్షిక రుసుం చెల్లిస్తే రాయితీలంటూ ప్లే స్కూల్స్‌ తాయిలాలు
  • ఆన్‌లైన్‌ క్లాస్‌లు కాబట్టి 20% వరకు తగ్గింపు అంటున్న  పాఠశాలలు
  • తగ్గేది లేదంటున్న కార్పొరేట్‌ స్కూళ్లు



ఉప్పల్‌లోని ఓ ప్లే స్కూల్‌ తమ విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ సందేశం పంపింది. ‘బడి ఫీజు ఒకేసారి చెల్లిస్తే రూ.6 వేలు తగ్గిస్తాం. పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు చెబుతాం’ అన్నది దాని సారాంశం. 



బాచుపల్లి మార్గంలో ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కూడా ఇదే తరహాలో ఓ సందేశం పంపింది.  1-5 తరగతుల ఫీజులను 20ు వరకు, 6-12 తరగతుల ఫీజును 15ు తగ్గించాలని నిర్ణయించింది.  పాఠశాల తిరిగి తెరిచే వరకు ఇది వర్తిస్తుంది.  ఇప్పటికే చెల్లించిన  ఫీజులను మినహాయిస్తామన్నది ఆ సందేశ సారాంశం.


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పిల్లల స్కూల్‌ ఫీజులను తగ్గిస్తాం.. స్కూళ్లు తెరిచేవరకు.. ఈ విధానాన్ని అమలు చేస్తాం.. భాగ్యనగరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అందుతున్న ఈ తరహా సంక్షిప్త సందేశాలు కోకొల్లలు. కార్పొరేట్‌ కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోవడానికి అనుసరించే డిస్కౌంట్ల మార్గాన్నే ఇప్పుడు పలు స్కూళ్లు అనుసరిస్తున్నాయి. 2020- 21 విద్యాసంవత్సరం ఫీజుల వసూళ్ల కోసం చేసుకోవడానికి ఇది పాఠశాలలు ప న్నిన నయాఎత్తుగడ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు జరగని క్లాసులకు కూడా(ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెబుతున్నా ఇంటరాక్టివ్‌గా ఉండటం లేదన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల వాదన) ఫీజులు వసూలు చేసే మాయాజాలమే ఈ రాయితీలంటూ దుయ్యబడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ట్యూషన్‌ ఫీజులు పెంచడానికి వీల్లేదు. సంవత్సరం మొత్తం ఫీజు ఒకేసారి కట్టించుకోకుండా ప్రతినెలా ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సగానికి పైగా పాఠశాలలు వీటిని పాటించడం లేదని, పైగా డిస్కౌంట్‌లంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘తల్లిదండ్రుల పోరాటాల ఫలితంగా ఈ ఏడాది రూ.5 వేల రాయితీ పొందగలిగాం. ఫీజులు రెండు వాయిదాల్లో కట్టేయాలన్నారు. కానీ చాలామంది కట్టలేదు. అదృష్టవశాత్తు ఆన్‌లైన్‌లో క్లాస్‌లైతే చెబుతున్నారు’ అని సికింద్రాబాద్‌లో పేరున్న ఓ పాఠశాలలో తమ ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్న రంగ చెప్పారు. అయితే అన్ని స్కూళ్లు ఇదే తరహాలో లేవు. ‘ఒకేసారి ఫీజులు చెల్లించి భారీ రాయితీ అందుకోండి. రెండు టర్మ్‌ ఫీజులు కట్టండి.. 20ు రాయితీ అందుకోండి’ వంటి ఆఫర్లతో ఊరిస్తున్నాయి. పలు ఇంటర్నేషనల్‌ స్కూళ్లు కూడా 10-25ు వరకు ఫీజులో రాయితీ అందిస్తున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఆఫ్‌లైన్‌ తరగతులతో పాఠశాలలకయ్యే ఖర్చు లో 25ు మాత్రమే ఆన్‌లైన్‌ క్లాస్‌లపై వెచ్చిస్తే సరిపోతుందని, అందుకే ఆఫర్లు ప్రకటిస్తున్నామని ఓ స్కూల్‌ యజమాని రమేశ్‌ చెప్పారు. ‘ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభమయ్యే  వరకు ఈ రాయితీ వర్తిస్తుందని మాత్రమే స్కూళ్లు పంపే సందేశాల్లో ఉంటుంది. అంతే కానీ.. ఏడాది మొత్తానికి అని మాత్రం అందులో ఉండదు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడతారోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు కూడా మాట్లాడకుండా ఫీజులు కడుతుంటారు’ అని ఆయన వివరించారు. ‘ఫీజులు వసూలు చేయకుండా మేం పాఠశాలలు నడపలేం. కరోనా కాలంలో తల్లిదండ్రుల కష్టాన్ని మేము అర్థం చేసుకున్నట్లే వారూ కూడా మా కష్టాన్ని అర్థం చేసుకోవాలి. రాయితీ 20ు ఇస్తున్నామంటే అర్థం వ్యాపారం చేస్తున్నామని కాదు.. కనీసం ఆ విధంగానైనా ఫీజులు చెల్లిస్తారనేదే మా ఆశ’ అని పేరొందిన ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మి చెప్పుకొచ్చారు. 


క్లాస్‌ కావాలంటే ఫీజు చెల్లించాల్సిందే!

ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుం డా పలు ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను జూన్‌లోనే ప్రారంభించాయి. కరోనా వల్ల ఆర్థిక ఒడిదొడుకులకు గురైన చాలామంది తల్లిదండ్రులు అప్పుచేసి మరీ ఫీ జులు కట్టారు. అప్పులు చేయలేక ఫీజులు కట్టలేమం టూ టీసీల కోసం తిరుగుతున్న తల్లిదండ్రులూ ఎక్కు వ సంఖ్యలోనే ఉన్నారు. అప్పటి వరకు ఫీజుల కోసం ఒత్తిడి చేసిన స్కూళ్లు కూడా టీసీల కోసం డిమాండ్‌ చేయడంతో దారికొస్తున్నాయంటున్నారు కొందరు తల్లిదండ్రులు. కానీ, స్కూల్‌ ఫీజు కట్టకుండా క్లాస్‌లకు విద్యార్థులను అనుమతించే సమస్యే లేదని అధిక సంఖ్యలో స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-08-13T07:32:13+05:30 IST