బడి గంట గణగణ

ABN , First Publish Date - 2021-02-24T07:02:17+05:30 IST

రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

బడి గంట గణగణ

  • 6, 7, 8 తరగతులకూ అనుమతి..
  • నేటి నుంచే ప్రారంభించుకోవచ్చు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం 
  • విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోండి
  • కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి
  • తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే
  • జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు
  • యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు 
  • ఆన్‌లైన్‌ తరగతులూ కొనసాగుతాయి
  • గదులు తక్కువైతే షిఫ్ట్‌ల వారీగా తరగతులు
  • సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. సీఎం కేసీఆర్‌ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 6, 7, 8 తరగతులకు బుధవారం నుంచే తరగతులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను బుధవారం నుంచి మార్చి 1లోపు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8 తరగతుల్లో 17.24 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరితోపాటు ఇప్పటికే హాజరవుతున్న 9, 10 తరగతి విద్యార్థులు కూడా ఉంటారని సీఎస్‌ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశమై 6 నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి ఉంటేనే విద్యార్థులను అనుమతించాలన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 


ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులతో సబిత మంగళవారం సమావేశమయ్యారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు బుధవారం నుంచి మార్చి 1లోపు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. పాఠశాలకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యక్ష తరగతులకు రాని విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగుతాయన్నారు. పాఠశాలల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని కోరారు. తరగతి గదులు తక్కువగా ఉంటే షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 


ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంఘాలు

6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. పాఠశాలల్లో దశలవారీగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నవంబరు నుంచి తాము కోరుతున్నామని, ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎ్‌సయూటీఎఫ్‌) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలను కూడా మార్చి మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని, అవసరం ఉన్నచోట వెంటనే విద్యావలంటీర్లను నియమించాలని కోరా రు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎ్‌సజీహెచ్‌ఎంఏ) స్వాగతించింది. కొవిడ్‌ నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్య నిర్వహణకు పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.రాజభాను చంద్రప్రకాశ్‌, ఆర్‌.రాజగంగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పేద విద్యార్థుల విద్యా అభివృద్థి కోసం ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించాలని సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి కె.మహిపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రత్యక్ష తరగతులనూ ప్రారంభించాలని ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఖమ్రొద్దీన్‌ కోరారు. 


విద్యార్థుల జీవితాలతో చెలగాటం: టీఎస్పీటీఏ

రాష్ట్ర ప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, నాగనమోని చెన్నరాములు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ప్రభు త్వం కార్పొరేట్‌ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి అసంబద్ధ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.  


వలంటీర్లను నియమించాలి:టీవీవీఎస్‌ 

సరిపడా ఉపాధ్యాయులు లేకుండా తరగతులను ఎలా ప్రారంభిస్తారని తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం (టీవీవీఎస్‌) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివానంద స్వామి కోరారు. 


సమగ్ర శిక్షా టీచర్లను కొనసాగించాలి

ప్రాథమికోన్నత పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, వ్యాయామ ఉపాధ్యాయులను కొనసాగించాలని కళా, వృత్తి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కోరింది. పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో 2500 మంది నెలకు కేవలం రూ.9 వేల వేతనంతో పని చేస్తున్నారని, కరోనా కారణంగా వారిని కొనసాగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుకుంట్ల కృష్ణహరి తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే వేతనాలు సమగ్ర శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న అన్ని విభాగాల వారికీ అందుతున్నా తమకు మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు. 

Updated Date - 2021-02-24T07:02:17+05:30 IST