Abn logo
Aug 4 2021 @ 02:32AM

ఓ స్కూలు.. గేటు.. బార్‌!

బార్‌ అనుమతుల కోసం పాఠశాల గేటును వెనక్కు జరిపి కడుతున్న కార్మికులు

బార్‌ అనుమతుల కోసం పాఠశాల గేటును వెనక్కి కట్టారు..

ఆ తర్వాత యథాస్థానంలో నిర్మాణం  

అభ్యంతరం చెప్పని పాఠశాల యాజమాన్యం  

కాలనీ వాసులు వ్యతిరేకించినా ఏర్పాటు  

బార్‌ ఏర్పాటైన పక్షం రోజులకే నిబంధనలకు నీళ్లొదిలిన నిర్వాహకులు


కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రాంగణం. మద్యపానం, ధూమపానం వంటి ఇతర చెడు వ్యసనాలతో ఆరోగ్యాలు దెబ్బతింటాయని, వాటిజోలికి వెళ్లొద్దంటూ బోధించాల్సిన  పాఠశాల యాజమాన్యం తీరు అందుకు విరుద్ధంగా ఉంది. పాఠశాల సమీపంలోనే కొందరు ఏర్పాటుచేస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు పాఠశాల యాజమాన్యం అన్ని విధాలా సహకరింస్తోందని కాలనీవాసులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. నివాస యోగ్యమైన కాలనీలో ఈ బార్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వారు అటు ప్రజాప్రతినిధులకు, ఇటు సంబంధిత అధికారులకు వినతులు సమర్పించినా, ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటైంది. 


ప్రజాప్రతినిధుల మధ్యవర్తిత్వంతో...

కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లోని పద్మానగర్‌ ఫేజ్‌-2 సర్కిల్‌(రింగ్‌రోడ్డు)లో ఇటీవల ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాలనీలో ప్రజల దైనందిన జీవితాలలో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదనలో బార్‌ ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరం  తెలిపారు. ఆ మేరకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు అందజేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు పనులను నిలిపివేసినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధుల మధ్యవర్తిత్వంతో మళ్లీ పనులు వేగం పుంజుకుని చివరకు బార్‌ ఏర్పాటయింది.  


బార్‌ కోసం పాఠశాలగేటుతో అందర్‌, బాహర్‌

బార్‌ ఏర్పాటుకు ఓ పాఠశాల ప్రాంగణం వారికి అడ్డంకిగా మారింది. ఇందుకోసం నిర్వాహకులు దోబూచులాడారు. పాఠశాల గేటు పథకం వేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఓ బార్‌ను ఏర్పాటు చేయాలంటే వంద మీటర్ల దూరం వరకు ఎటువంటి విద్యాలయాలు, ఆలయాలు ఉండకూడదు. బార్‌ గేటు నుంచి పాఠశాల గేటుకు మధ్య 100 మీటర్ల దూరం కచ్చితంగా ఉండాలనేది నిబంధన. అయితే సదరు బార్‌ ఏర్పాటు చేసే భవనం నుంచి ఈ పాఠశాల గేటు మధ్య 100 మీటర్ల లోపు దూరం ఉంది. దీంతో అనుమతులు పొందేందుకు ఇబ్బందిగా మారుతుందని బార్‌ నిర్వాహకులు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. వారిని ప్రలోభాలకు గురిచేసో... భయపెట్టో పాఠశాల గేటును తొలగించారు. బార్‌ గేటు నుంచి పాఠశాల ప్రవేశ ద్వారానికి 100 మీటర్ల దూరం ఉండేలా గేటును లోపలికి జరిపి తాత్కాలికంగా నిర్మించారు. బార్‌ అనుమతులను చేజిక్కించుకొన్న అనంతరం గత నెల 19వ తేదీన బార్‌ను ప్రారంభించారు. బార్‌ ఏర్పాటు కావడంతో కాలనీ వాసులు సైతం నివ్వెరపోయారు. తాము అభ్యంతరం చెప్పినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై వారు మండి పడుతున్నారు. 


బార్‌ ప్రారంభమైన తర్వాత గేటు యథాతథం..

బార్‌ను ప్రారంభించిన తర్వాత నిర్వాహకులు పాఠశాల గేటును మళ్లీ యథాస్థానంలో నిర్మించారు. మొదట్లో తాత్కాలికంగా నిర్మించిన గేటు తొలగించి గతంలో మాదిరిగానే పాఠశాల పాతగేటును మరల యథాస్థానంలో పునర్‌నిర్మించారు. బార్‌ అనుమతులు వచ్చాయి.. ప్రారంభం కూడా అయుపోయిందనే దీమాతో బార్‌ నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కారని స్థానికులు మండిపడుతున్నారు. మరి బార్‌ను ప్రారంభించిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించినా అనుమతులు వర్తిస్తాయా..? లేక అధికారులు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తారా...? ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు  

సదరు బార్‌ విషయం మా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో అనుమతి పత్రాలను పరిశీలించి బార్‌ ఏర్పాటు అనంతరం కూడా నిబంధనలను అతిక్రమించినట్లు ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం.

-విజయ భాస్కర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా