పాఠశాలల.. ప్రారంభమెలా?

ABN , First Publish Date - 2021-08-10T05:00:33+05:30 IST

చ్చే సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది.

పాఠశాలల.. ప్రారంభమెలా?
విద్యార్థులు

ఇంకా విడుదల కాని ప్రభుత్వ మార్గదర్శకాలు

మరో వారంలో పునః ప్రారంభంకానున్న పాఠశాలలు

విధివిధానాలపై స్పష్టత లేక.. ఉపాధ్యాయుల్లో అయోమయం

విలీన పాఠశాలల విద్యార్థుల అడ్మిషన్లపై తల్లిదండ్రుల్లో ఆందోళన 



గుంటూరు(విద్య), ఆగస్టు 9: వచ్చే సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఇంతవరకు పాఠశాలల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలపై ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. మరోవైపు పిల్లల్ని చేర్పించేందుకు పలువురు తల్లిదండ్రులు ఆయా పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. అయితే అడ్మిషన్ల విధివిధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం వచ్చే వారిని వెనక్కి పంపేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల నుంచి అడ్మిషన్‌ ప్రక్రియ గురించి దాదాపు పట్టించుకోవడం లేదు.  సాధారణంగా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో అడ్మిషన్ల కోసం వచ్చే వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభంకానున్నా అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు.   


241 పాఠశాలలు విలీనం

నూతన విద్యా విఽధానంలో భాగంగా జిల్లాలో దాదాపు 241 పాఠశాలలు విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు దాదాపు 4 వేలకుపైగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యాభాస్యం చేస్తున్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా ఈ ఏడాది 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్న పాఠశాలల్లో చేర్పించాలని భావిస్తున్నారు. ఇలా ఉన్నత పాఠశాలల్లో విలీనం అయ్యే ప్రాథమిక పాఠశాలలు దాదాపు 241 ఉన్నాయి. విలీనం అయ్యే పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రధానంగా 3, 4, 5 తరగతులు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉన్నత పాఠశాలల్లో విలీనం అయితే తమకు అనుకూలంగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాలలకు వెళితే టీసీలు ఇప్పుడే ఇవ్వమని ఉపాధ్యాయులు చెబుతున్నారు.   ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, అప్పటి దాకా తాము ఏమీ చేయలేమంటూ తల్లిదండ్రులను వెనక్కి పంపేస్తున్నారు.


ఆందోళన అవసరం లేదు 

అడ్మిషన్ల విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు అదే స్కూల్‌ పరిధిలోనే ఉంటారు. పాఠశాలలు పునః ప్రారంభం కాగానే అడ్మిషన్లు, ఇతర విషయాలపై స్పష్టత వస్తుంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల్ని పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పాఠశాలలకు జగనన్న విద్యా కిట్లు, పుస్తకాలు, ఇతర వస్తువులు చేరాయి. ఈ నెల 16 నుంచి వాటిని పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

- ఆర్‌ఎస్‌ గంగాభవాని, డీఈవో

Updated Date - 2021-08-10T05:00:33+05:30 IST