తనఖా నేల.. నేత ఇలాకా!

ABN , First Publish Date - 2020-06-30T08:44:34+05:30 IST

నేల ఉంటే నిబ్బరం! ఇల్లు కూడా అమిరితే నిశ్చంత! మిగతావర్గాల మాట ఎలాఉన్నా పేదల ఈ కలను తీర్చుతానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

తనఖా నేల.. నేత ఇలాకా!

  • బ్యాంకులో ఉన్న మెట్టభూమిలో స్థలాలు
  • నివాసయోగ్యంకాని ఆ కొండపై సేకరణ
  • తీసిన ఎర్రకంకరపైనా నేత వసూలు
  • కోస్తా, గోదారి జిల్లాల్లో భూమాయలు
  • జీడిమామిడి చెట్లు కొట్టివేసి.. చదును
  • తీసిన ఎర్రకంకరపైనా నేత వసూలు
  • కోస్తా, గోదారి జిల్లాల్లో భూమాయలు
  • కోట్లలో దండుకున్న అధికార నేతలు
  • నేతకు మేతకోసం శ్మశానం పక్క ప్లాట్లు
  • గుంటూరులో చౌడునేలలో లేఅవుట్లు
  • కృష్ణాజిల్లాలో మడను పూడ్చి ప్లాట్లు
  • ‘పశ్చిమ’లో దళారుల మహా దందా
  • ఓ ఊళ్లో 30 వేలు చొప్పున వసూలు
  • గ్రామానికి 11.కి.మీ. ఎడంలో జాగాలు
  • కోస్తా,గోదారి జిల్లాల్లో ఆంధ్రజ్యోతి విజిట్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నేల ఉంటే నిబ్బరం! ఇల్లు కూడా అమిరితే నిశ్చంత! మిగతావర్గాల మాట ఎలాఉన్నా పేదల ఈ కలను తీర్చుతానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ముచ్చటగా ‘పేదింటి ఇళ్ల స్థలాలు’ పథకం పెట్టింది. పథకంలో పేరు చూసుకొని మురిసిన పేద లబ్ధిదారులు ‘స్థలాలు ఎక్కడ ఇస్తున్నారు’ అంటూ అప్పట్లో ఆరాలు తీసేశారు. ఇప్పుడేమో..స్థలాల మాట ఎత్తితేనే నీరుగారిపోతున్నారు. కారణం..వారికి కేటాయించిన నివేశనాలన్నీ నివాసయోగ్యంగా లేకపోవడమే! అధికార నేతలను సంతుష్టులను చేయడానికి.. వారి భూములు ఎక్కడ ఉంటే అక్కడ అధికారులు కోట్లు పోసి కొని, లే అవుట్లు వేసేస్తున్నారు. శ్మశానం పక్క భూములను సైతం లక్షల్లోనే ధర కడుతున్నారంటే ఏ స్థాయిలో ఎంతగా ‘పథకం’ ప్రకారం అమలవుతుందో ఇట్టే తెలిసిపోతుంది.


కొన్నిచోట్ల ఎత్తయిన కొండలపై ప్లాట్లు వేసి...స్థలానికి, ఇంటికి ముడేసి ‘ఎక్కాల్సిందే’ అంటూ పేదలను ఒత్తిడి పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్‌లో అనేకచోట్ల వరద వస్తే మునిగిపోయి నివాసానికి పనికిరాని పల్లపు భూములను అంటగట్టేశారు. ఉప్పాడకొత్తపల్లిలో ఏకంగా జనసంచారంతో సంబంధం లేని సెజ్‌ భూముల్లో పట్టాలివ్వబోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో నాలుగు ఊళ్ల పేదలకు.. పది కిలోమీటర్ల దూరంలో స్థలాలు చూపింపారు. దళారులూ రంగంలోకి దిగి.. ఎడాపెడా దోచేస్తున్నారు. ‘రైతులకు సర్కారు ఇచ్చేది చాలదు.. కొంత మీరూ వేసుకోవాలి’ అంటూ తణుకు నియోజకవర్గం రేలంగి గ్రామంలో సేకరించిన ఆరు ఎకరాల పైచిలుకు భూములకుగాను 370 మంది లబ్ధిదారుల నుంచి చెరో రూ. 30 వేలు వసూలు చేసుకొన్నారు. వర్షం పడితే  ఉప్పిడిసిపోయే చౌడుభూములను గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం పరిధిలో సేకరించారు. 


అంత దూరం.. భారమే!

తూర్పుగోదావరి పెద్దాపురం మండలం రామేశంమెట్ట వద్ద వేస్తున్న ఇళ్ల స్థలాల లే అవుట్‌ ఇది. పెద్దాపురం ప్రజలకు కేటాయించిన ఈ ప్లాట్లు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అధికారులు చకచకా చదును చేసి.. లే అవుట్లను వేగంగా సిద్ధం చేస్తున్నారుగానీ, అంత దూరం వెళ్లడానికి లబ్ధిదారులు ఇష్టపడటం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పారని అధిక పరిహారం కట్టబెట్టి తీసుకొన్న భూములు కావడంతో.. ఏమైనా వెళ్లాల్సిందేనని అధికారులు ఒత్తిడి పెడుతున్నారట!’


మడపై మట్టేశారు.. 

వరదలు, తుఫాన్లు వచ్చి ఊర్లు కొట్టుకుపోకుండా మడ అడవులు రక్షిస్తాయి. ఇప్పుడు ఆ అడవులకే రక్షణ కరువయింది. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బలో మడపై మట్టి పోసి పూడ్చి.. అక్కడి ఏడు ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేస్తున్నారు. అడవిలా ఉన్న ఈ ప్రాంతంలో తాము ఉండలేమని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 


శ్మశానం పక్కనే మార్కింగ్‌..

ఆలయానికి దగ్గరగా, శ్మశానానికి వీలున్నంతవరకు దూరంగా ఊరు ఉండాలి. ఎవరైనా పాటించే ఈ సెంట్‌మెంట్‌ను అధికార వైసీపీ నేత కోసం అధికారులు పక్కన పెట్టేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో శ్మశానాన్ని ఆనుకొని ఉన్న ఆయన భూముల్లో పేదల కోసం ప్లాట్లు వేశారు. రేటు కూడా తక్కువేమీ కాదు.. ఎకరాను రూ. రూ.27.5 లక్షలు పెట్టి కొన్నారు.  


నేతలకు మేత..

ప్రకాశం జిల్లా కనిగిరిలోని పేదలకు, పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన కేటాయించిన స్థలాలివి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు పదేళ్ల క్రితం ఎకరం రూ. 27వేలు చొప్పున ఇక్కడ 36 ఎకరాలు కొన్నారు. మార్కెట్‌ రేటు ఇప్పుడు ఎకరం రూ. 3 లక్షలకు మించదు. ఈ నేతలు, అధికారులు కలిసి ఈ భూముల్లో 27 ఎకరాలను రూ. 15లక్షలకు, తొమ్మిది ఎకరాలను రూ. 22 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించారు. 


వేసిన లే అవుట్‌కు వే లేదు..

భూమికి చెల్లించిన ధర ఎక్కువ! చేరుకొనే మార్గం చూస్తే ఇరుకిరుకు! పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ ప్రజలకు ఇళ్లస్థలాలు సమకూర్చేందుకుగాను ఎకరాకు నలభై రెండు లక్షలు చెల్లించి మరీ యలమంచిలి మండలం కొంతేరులో భూములు కొనుగోలు చేశారు. పాలకొల్లు నుంచి కొంతేరుకు మూడు కిలోమీటర్లు. దూరమైనా ఫరవాలేదు ఇళ్లు కట్టుకొనేందుకు అనువైన వాతావరణం, మార్గాలు ఉంటే చాలునని లబ్ధిదారులు అనుకొన్నారు. కానీ ఇక్కడంతా సీన్‌ రివర్స్‌!  పదహారు ఎకరాల్లో వేసిన రెండు లే-అవుట్‌ల దగ్గరకు ఎలా చేరుకోవాలనేది పెద్ద ఫజిల్‌! ఈ ప్రాంతానికి వెళ్లడానికి కేవలం పుంత మార్గమే ఉంది. సరాసరిన ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల వెడల్పు ఉంది. ఇంత ఇరుకు మార్గంలో కిలోమీటరు మేర ప్రయాణిస్తేనే, లే అవుట్లలోకి అడుగుపెడతారు. 


నివాస యోగ్యం కాని స్థలాలు

గ్రామాల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఒకటన్నర సెంటు దేనికీ చాలదు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పాడి పశువులు కలిగి ఉంటారు. ఈ స్థలంలో నిర్మించే ఇల్లు ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది ప్రశ్న. అలాగే ఈ స్థలాలు గ్రామాలకు అందుబాటులో లేవు. ఇళ్ల నిర్మాణాలను ఇదే స్థలాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో ఒక్కరు కూడా ఈ స్థలాల్లో ఇల్లు నిర్మించేందుకు ముందుకొచ్చే అవకాశమే లేదు. ఊరవతల నిర్మించే ఇళ్లకు ప్రభుత్వమిచ్చే నిధులతో పాటు అదనంగా కనీసం రూ.4 లక్షలు దాకా లబ్ధిదారు ఖర్చు చేస్తేనే ఇప్పటి పరిస్థితుల్లో ఇల్లు నిర్మించుకోగలరు. 

Updated Date - 2020-06-30T08:44:34+05:30 IST