రైతులకు నోటీసులు జారీ.. కిమ్మనకుండా అంగీకరించాలని ఒత్తిళ్లు

ABN , First Publish Date - 2020-02-20T09:39:45+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉగాది నాటికి పాతిక లక్షల మందికి సెంటు చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామన్నది ప్రభుత్వ ప్రకటన! దీనికి సరిపడా ప్రభుత్వ స్థలాలు లేవు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు ...

రైతులకు నోటీసులు జారీ.. కిమ్మనకుండా అంగీకరించాలని ఒత్తిళ్లు

‘సెంటు’ మంట!

పేదల కోసం పేదల స్థలాలే బలి

ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్‌పై అస్త్రం

పేదలు, దళితుల భూముల సేకరణ

పీఓటీ పేరిట రైతులకు నోటీసులు జారీ 

కిమ్మనకుండా అంగీకరించాలని ఒత్తిళ్లు

ఇచ్చేది లేదంటున్న పేద, దళిత రైతులు 

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు


‘పెద్దలను కొట్టు... పేదలకు పెట్టు’... ఇది రాబిన్‌ హుడ్‌ పాలసీ! 

‘పేదలకు ఇంటి స్థలాల కోసం... పేదల స్థలాలనే పట్టు’ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం!


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా ఉగాది నాటికి పాతిక లక్షల మందికి సెంటు చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామన్నది ప్రభుత్వ ప్రకటన! దీనికి సరిపడా ప్రభుత్వ స్థలాలు లేవు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు ఆర్థిక పరిస్థితీ సహకరించడంలేదు. అందుకే... గతంలో పేదలకు, ఇతర వర్గాల వారికి ఇచ్చిన అసైన్డ్‌ భూములపైన ప్రభుత్వ కన్ను పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అసైన్డ్‌ భూములపై సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు. నిరుపేద, దళిత, బలహీనవర్గాల దగ్గర ఉన్న సాగు భూములు వెనక్కు లాక్కొంటున్నారు. అదేమంటే పేదలకు ఇవ్వడానికే కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లాక్కున్నా ఏమీ చేయలేరన్న ధీమాతో పేదలు, దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై కన్నేశారు.


కానీ నమ్ముకున్న భూమిని వదులుకోవడానికి వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. తమ భూముల్లోకి అడుగు పెట్టొదంటూ రెవెన్యూ అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు అసైన్డ్‌, పేద రైతుల ఆందోళనలే. అధికారంలోకి వచ్చీ రాగానే, ఈ పథకం కోసం భూమిని సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 17వేల ఎకరాలేనని, ప్రైవేటుగా మరో 26వేల ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉందని గత ఆగస్టులోనే ఆ శాఖ స్పష్టం చేసింది. దీనికి కనీసం రూ.16వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ తర్వాత 20వేల ఎకరాలు సేకరిస్తే చాలని, దీనికి రూ.14వేల కోట్లు వ్యయం కానుందని ఆర్థికశాఖకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది. ఎంత ఖర్చయినా ఈ ప్రాజెక్టును పూర్తి చేద్దామని సర్కారు గొప్పలు చెబుతుంటే, ఖర్చుకు వెనుకాడకుండా భూసేకరణ చేసి పేదలకు స్థలాలు ఇస్తారేమోనని అంతా అనుకున్నారు. అయితే, అసలు కథ జనవరి నుంచే మొదలైంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ప్రైవేటుగా చేపట్టే భూసేకరణను తగ్గించుకోవాలని, వీలైనంత మేరకు ప్రభుత్వ భూములు గుర్తించి ఇంటిస్థలాలకు వాడుకోవాలంటూ సర్కారు జనవరిలో సరికొత్తగా మార్గదర్శకాలు ఇచ్చింది.


అంతే, భూ సేకరణ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. కొత్తగా లిటిగేషన్‌ భూములు తెరపైకొచ్చాయి. ఆ భూములపై కోర్టుల్లో అఫిడవిట్లు వేయాలని, ఈలోగా వాటిని ఇంటిస్థలాలకు వాడుకోవాలని మార్గదర్శకాలు ఇచ్చారు. వీలైన మేరకు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూమిని వాడుకోవాలని పేర్కొన్నారు. అయితే అందులో బాగా విలువైన భూములు మాత్రం రిజర్వ్‌ చేశారు. వీటిని బిల్డ్‌ ఏపీ మిషన్‌ కింద అమ్ముకోవాలన్నది సర్కారు వ్యూహం. ఇప్పటికే జిల్లాల వారీగా వాటి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇక, ప్రభుత్వ శాఖల వద్ద గ్రామీణ ప్రాంతాల్లో 1,181 ఎకరాలు, పట్టణాల్లో 230 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. లిటిగేషన్‌లో ఉన్న భూములు 1,076 ఎకరాలు. ఈ రెండు కేటగిరీల్లో నికరంగా 3.5లక్షల మందికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 20వేల ఎకరాలు. గ్రామీణ, పట్టణాల్లోని 14లక్షల మందికి కూడా సరిపోదు. ఇంకా ప్రైవేటుగా 9,619.22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 


అసైన్డ్‌ భూములపై కన్ను 

ఖరీదైన ప్రైవేటు భూములు సేకరించడం శ్రేయస్కరం కాదని భావించిన సర్కారు అసైన్డ్‌ భూముల సేకరణ నిబంధన తీసుకొచ్చింది. జీఓ367లోనే ఈ అంశాన్ని చేర్చారు. ‘‘ప్ర త్యామ్నాయ భూములు లేకుంటే, చాలా అరుదైన కేసుల్లో అసైన్డ్‌ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలి. వాటిని ఇంటిస్థలాలకు వినియోగించాలి. వాటికి కూడా పరిహారం చెల్లించాలి’’ అని చేర్చారు. ఈ నిబంధన అమలుకు రెవెన్యూశాఖ సిద్ధమైంది. దీనిపై రైతులకు నోటీసులు ఇస్తున్నారు. వారిలో ఇప్పటికే 10మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. సర్కారు ఇచ్చిన నోటీసుతో మనోవేదనకు గురై తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు సత్యాడ బాలరాజు(46)మృతి చెందాడని ఆయన కుమార్తె ఫిర్యాదు చేశారు. 


రైతులకు నోటీసులు  

భూ సేకరణ చట్టం ప్రకారం ప్రైవేటు భూముల సేకరణ ప్రక్రియ రైతుల సమ్మతి లేకుండా ముందుకు సాగదు. ఇప్పటికే ఇంటి స్థలాలకు భూములు ఇచ్చేది లేదని అనేక ప్రాంతాల్లో రైతులు తెగేసి చెబుతున్నారు. తప్పనిసరి భూసేకరణ విధించాలంటే ఇంటిస్థలం కోసం అన్నది సహేతుకమైన కారణం కాదు కాబట్టి దీన్ని అమలు చేయలేరు. దీంతో, పేదలు, దళితులు, బలహీనవర్గాల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములపై సర్కారు కన్నేసింది. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌(పీఓటీ) నిబంధనల ప్రకారం ఈ భూములు పేదల చేతుల్లో ఉన్నా, యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే. ప్రభుత్వ అవసరాల కోసం ఎప్పుడంటే అప్పుడు వెనక్కు తీసుకోవచ్చన్న నిబంధన ఉంది. దీన్ని ఆసరా చేసుకొని అసైన్డ్‌ భూములు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని జీఓ.367లో ఒక క్లాజుగా చేర్చి,. ఇప్పుడు దాన్నే అసలైన అస్త్రంగా వాడుతోంది. రైతులకు నోటీసులు ఇస్తున్నారు. అల్లరి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమ్మతి తెలపాలంటూ పేద రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T09:39:45+05:30 IST