ఉక్రెయిన్ నగరాలు ఒక్కొక్కటీ ధ్వంసం...

ABN , First Publish Date - 2022-03-12T23:06:39+05:30 IST

రష్యా అప్రతిహతంగా ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దాడులు మొదలై శనివారంనాటికి..

ఉక్రెయిన్ నగరాలు ఒక్కొక్కటీ ధ్వంసం...

కీవ్: రష్యా అప్రతిహతంగా ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దాడులు మొదలై శనివారంనాటికి 17వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌‌లోని ఏ వైపు నుంచి చూసినా క్రమంగా ఆ దేశం బలహీనపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇది 'వినాశకరమైన యుద్ధం'గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గట్టిగా చెబుతున్నారు. ఏ టౌన్‌ చూసినా సిటీ పరిస్థితి చూసినా బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. భయాలు, కనీస అవసరాల కొరత ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి.


ఉక్రెయిన్ నైరుతి దిశలో ఉన్న మైకోలైవ్‌లో శనివారం ఉదయం బాంబుల మోతలు హోరెత్తాయి. దక్షిణాన ఉన్న మెలిటిపోల్‌లోనూ ఇదే పరిస్థితి. రష్యా చేతుల్లోకి జారిపోయిన తొలి టౌన్ ఇది. తాము చెప్పినట్టు వినలేదని, సమాచారం ఇవ్వడానికి నిరాకరించడానే కారణంగా మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను రష్యన్లు ఆయన కార్యాలయం నుంచి వెంటబెట్టుకుపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. తలపైన బ్యాగ్ పెట్టుకుని ఆయన అక్కడ్నించి కదిలారు. ఆయనను రష్యా కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. మరియుపోల్‌లో ఆకలికేకలు, తాగడానికి నీళ్లు లేక మంచును కరిగించుకుంటున్న దృశ్యాలు, వంట చేసుకునేందుకు కట్టెలు పోగుచేసుకోవడం, సామూహిక ఖననాలు వంటి దృశ్యాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితి దక్షిణ ఉక్రెయిన్‌కే పరిమితం కాలేదు. ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 3 లక్షల మంది ప్రజలు నివసిస్తుంటారు. యుద్ధం రావడం, అప్రతిహతంగా బాంబులు కురుస్తుండటంతో తీవ్రమైన వేడిగాలులతో జనం విలవిల్లాడుతున్నారు. గ్యాస్, విద్యుత్, నీటి సరఫరాలను ఇక్కడ నిలిపివేశారు. జనం సైతం... ఏళ్ల తరబడి యుద్ధం తరువాత సిరియాలో తలెత్తిన పరిస్థితితో ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితిని పోల్చి మాట్లాడుతున్నారు.

Updated Date - 2022-03-12T23:06:39+05:30 IST