కంపులో కాసుల వేట

ABN , First Publish Date - 2022-07-03T06:43:19+05:30 IST

డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు పారుతుంది. కానీ అనంతపురంలో మాత్రం నిధులు పారుతున్నాయి. కొందరు రూ.లక్షల్లో తోడుకుంటున్నారు. డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు పారుతుంది. కానీ అనంతపురంలో మాత్రం నిధులు పారుతున్నాయి. కొందరు రూ.లక్షల్లో తోడుకుంటున్నారు.

కంపులో కాసుల వేట
పాత క్రిష్ణ థియేటర్‌ పక్కన మరువవంక

మరువవంకలో పూడిక తీతకు రూ.18 లక్షలు

ఇతర ప్రాంతాలలో పనులకురూ.10 లక్షలు

డైనేజీల్లో పారుతున్న నగర పాలిక నిధులు


    డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు పారుతుంది. కానీ అనంతపురంలో మాత్రం నిధులు పారుతున్నాయి. కొందరు రూ.లక్షల్లో తోడుకుంటున్నారు. కంపు కొట్టే కాలువలలో కాసులను ఏరుకుంటున్నారు. నగరపాలిక అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై.. పూడిక తీత దందాకు తెరలేపారు. మరువ వంక కాలువలో పూడిక తీతకు ఆరు నెలల క్రితం రూ.10 లక్షలు వెచ్చించారు. మరువ వంకలో సూర్యానగర్‌ రోడ్డులోని మల్లాలమ్మ గుడి నుంచి త్రివేణి థియేటర్‌ వరకు పూడిక తీసినట్లు బిల్లులు చేసుకున్నారు. అప్పట్లో తూతూ మంత్రంగా పనులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. పనులు చేసిన కాంట్రాక్టరు ఓ ప్రజాప్రతినిధితో కుమ్మక్కయ్యారని, రూ.4 లక్షల పని మాత్రమే చేసి, మిగిలిన సొమ్ము జేబులో వేసుకున్నారని ప్రచారం జరిగింది. ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. ఆ కాలువలో భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో మరోసారి నిధులను మింగేందుకు సమాయత్తమయ్యారు. ఇంజనీరింగ్‌ అధికారులు సిల్ట్‌ వర్క్‌కు (రూ.8లక్షలు) టెండర్‌ పిలిచారు. ఆరు నెలల క్రితం రూ.10 లక్షలు.. ఇప్పుడు మరో రూ.8 లక్షలు. ఆ ఒక్క కాలువలో పూడిక నుంచి రూ.18 లక్షలు పిండుకోవచ్చన్నమాట..! ఈ పనులను దక్కించుకునేందుకు రెండు సంస్థలు పోటీ పడ్డాయి. లహరి కనస్ట్రక్షన్స సంస్థ టెండర్‌ దక్కించుకుంది. 


ఎక్స్‌కవేటరే కొనేయొచ్చు..

అనంతపురం నగరపాలక సంస్థకు ఒక ఎక్స్‌కవేటర్‌ మాత్రమే ఉంది. దీన్ని ఎక్కువగా డంపింగ్‌ యార్డులో ఉపయోగిస్తుంటారు. ఇతర పనులకు ఎక్స్‌కవేటర్లను  అద్దెకు తెప్పించుకుని, బిల్లులు చేయిస్తుంటారు. ప్రస్తుతం పూడిక తీత పనులకు కేటాయిస్తున్న నిధులతో ఒక ఎక్స్‌కవేటర్‌ను కొనేయవచ్చు. చిన్నదైతే రూ.25 లక్షలు, పెద్దదైతే రూ.40 లక్షలకు వస్తుంది. దాంతో రోజూ పూడిక తీయించవచ్చు. తాజాగా ఒక ఎక్స్‌కవేటర్‌, రెండు ట్రాక్టర్లతో పను లు చేయించడానికి రూ.10 లక్షలకు టెండర్‌ పిలిచారు. ఇలా వాహనాలకు అద్దె చెల్లించడం, పదే పదే పూడికతీత పనుల పేరిట రూ.లక్షలు కుమ్మరించడం విమర్శలకు తావిస్తోంది. 

- అనంతపురం క్రైం

Updated Date - 2022-07-03T06:43:19+05:30 IST