విచ్చలవిడిగా రోడ్ల తవ్వకాలు

ABN , First Publish Date - 2020-10-23T10:19:29+05:30 IST

కరోనా ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దసరా సమీపించడంతో షాపింగ్‌ కోసం మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌కు వెళుతున్నారు

విచ్చలవిడిగా రోడ్ల తవ్వకాలు

భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ కోసం పనులు

రోడ్డుపైనే మట్టి కుప్పలు

ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం

వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):  కరోనా ప్రభావం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. దసరా సమీపించడంతో షాపింగ్‌ కోసం మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌కు వెళుతున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్‌ కాస్త పెరిగింది. ఇలాంటి తరుణంలో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ కోసం వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులలో తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్విన తర్వాత డెబ్రిస్‌ను రోడ్డుపైనే కుప్పలుగా వేసేస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అవరోధంగా మారింది. దీని ప్రభావంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రామాటాకీస్‌ నుంచి బీవీకే కాలేజీకి వెళ్లే అంతర్గత రహదారి, స్పెన్సర్స్‌ - బుల్లయ్యకాలేజీ రోడ్డు, ద్వారకానగర్‌ నుంచి సీతంపేట ప్రధాన రహదారి, మేఘాలయ హోటల్‌ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికివెళ్లే రహదారి, డైమండ్‌పార్కు నుంచి శంకరమఠం మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గం, డాబాగార్డెన్స్‌ రహదారి వంటివి కీలక వాణిజ్య ప్రాంతాలు.


ఆయా రహదారుల్లో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్‌ జామ్‌ అయితే కనుచూపు మేరలో వాహనాలు నిలిచిపోతాయి. అంతటి రద్దీ ఉండే రోడ్లన్నీంటినీ ఒకేసారి తవ్వేయడం, డెబ్రిస్‌ను వేరొకచోటుకు తరలించకుండా రోడ్డుమీదే కుప్పలుగా వేసేయడంతో ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్‌ అయిపోతోంది. పోలీసులు, జీవీఎంసీ అధికారులు కూడా దీనిపై దృష్టిసారించకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ తరచూ జరుగుతోంది. దీని వల్ల వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు ఇప్పటికైనా స్పందించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగని విఽధంగా రోడ్లను తవ్వేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వాణిజ్యప్రాంతాల్లోని రోడ్లను పండుగ సీజన్‌లో వదిలేసి ఇతర రోడ్లను తవ్వి కేబుల్‌ ఏర్పాటు పనులు పూర్తిచేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-10-23T10:19:29+05:30 IST