Abn logo
Sep 25 2021 @ 01:10AM

అక్కడక్కడా అసంతృప్తులు

పురుగుల మందు తాగిన సి.బెళగల్‌ -1 ఎంపీటీసీ

  1. అధికారపార్టీలో బయటపడ్డ లుకలుకలు
  2. ఎన్నికల ప్రక్రియకు కొందరు గైర్హాజరు


ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగానే ముగిసినా.. అధికార పార్టీలో అసంతృప్తి మాత్రం అక్కడక్కడా బయటపడింది. తమకు పదవి ఇవ్వలేదని కొందరు ఎన్నికకే గైర్హాజరయ్యారు. ఇంకొందరు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. సి.బెళగల్‌ మండలంలో తాను సూచించిన వ్యక్తికి కో ఆప్షన్‌ మెంబర్‌ ఇవ్వలేదని వైసీపీ ఎంపీటీసీ సమావేశం హాలులోనే పురుగుల మందు తాగారు. పార్టీలో తొలి నుంచి పని చేసే వారికి గుర్తింపు లేదని ఆ ఎంపీటీసీ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. 


వైసీపీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం


  1. సమావేశం హాలులోనే పురుగుల మందు తాగి..


సి.బెళగల్‌, సెప్టెంబరు 24: కర్నూలు జిల్లా సి.బెళగల్‌-1 వైసీపీ ఎంపీటీసీ ఈరన్నగౌడు శుక్రవారం పురుగుల మందు తాగారు. తాను ప్రతిపాదించిన వ్యక్తికి కో-ఆప్షన్‌ మెంబర్‌ పదవి ఇవ్వలేదన్న మన స్తాపంతో అధికారుల ఎదుటే ఈ ఘటనకు పాల్పడ్డారు. సి.బెళగల్‌ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీ 9, టీడీపీ 4 గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 3 కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. కో ఆప్షన్‌ మెంబర్‌కు ముల్లా అరోన్‌ బాషా నామినేషన్‌ మాత్రమే దాఖలు చేయడంతో ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా ఎంపీటీసీ ఈరన్న గౌడు ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టాలని కోరారు. ఇందుకు ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కో ఆప్షన్‌ మెంబర్‌ పదవికి తాను ప్రతిపాదించిన వారికి కాకుండా వేరొకరికి ఇచ్చారంటూ ఈరన్న గౌడు వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. కార్యాలయ సిబ్బంది వెంటనే పురుగుల మందు డబ్బాను లాక్కుని ఈరన్నగౌడును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వలేదంటూ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌పై ఈరన్నగౌడు కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. ఈరన్నగౌడుకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే బాధ్యుడని కుటుంబ సభ్యులు మల్లికార్జున గౌడు, ప్రదీప్‌, రాజు, వెంకటేశ్వర్లు తెలిపారు. 


వెల్దుర్తిలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియకు ఎల్‌.నగరం వైసీపీ ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ గైర్హాజరయ్యారు. తనకు ఎంపీపీ పదవి ఇవ్వకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 


ఆత్మకూరు మండల పరిషత్‌ సమావేశ భవనంలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవానికి, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు వైసీపీకి చెందిన పిన్నాపురం ఎంపీటీసీ కుందూరు వెంకటేశ్వరమ్మ గైర్హాజరయ్యారు. ఎంపీపీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఆ స్థానాన్ని ఈమెకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే కరివేన ఎంపీటీసీ తిరుపాలమ్మను ఎంపీపీ పదవి వరించడంతో వెంకటేశ్వరమ్మ మనస్తాపానికి గురై ప్రమాణ స్వీకారానికి రానట్లు తెలుస్తోంది. 


డోన్‌ వైస్‌ ఎంపీపీ పదవి ఇవ్వలేదని వైసీపీకి చెందిన ఓబులాపురం ఎంపీటీసీ సుధాకర్‌ యాదవ్‌ అలకబూనారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ భవనంలో ముందుగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం చేయించారు. సుధాకర్‌ యాదవ్‌ కూడా చేశారు. అనంతరం వైస్‌ ఎంపీపీ పదవి కోసం సుధాకర్‌ యాదవ్‌ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే.. పార్టీ అధినాయకత్వం అంగీకరించలేదు. దీంతో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు సుధాకర్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు. 


ప్రశాంతంగా ఎంపీపీల ఎన్నిక


  1. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు
  2. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు 


కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 24: మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సహకరించిన సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు ఎన్నికల అబ్జర్వర్‌ నవీన్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. 


కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షణ


శుక్రవారం ఉదయం 9 నుంచి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికల అబ్జర్వర్‌ నవీన్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.


రాజమ్మ దీక్ష భగ్నం


  1. ఎంపీపీ పదవి కోసం నిరసన 
  2. వరించిన ఉపాధ్యక్ష పదవి 


గూడూరు, సెప్టెంబరు 24: గూడూరు ఎంపీపీ పదవి కోసం వైసీపీకి చెందిన కె.నాగులాపురం ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు, వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి, పార్టీ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షను రెండో రోజు పోలీసులు భగ్నం చేశారు. కె.నాగులాపురం గ్రామంలో గురువారం వైఎస్సార్‌ విగ్రహం దగ్గర ఎంపీపీ పదవి కోసం వీరు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు శుక్రవారం గూడూరు మండల కేంద్రంలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, కె.నాగులాపురం ఎస్‌ఐ ప్రేమ, ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి పోలీసులు వచ్చి వారి దీక్షను భగ్నం చేశారు. అనంతరం ఎంపీటీసీ రాజమ్మ గూడూరులోని మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు హాజరయ్యారు. కాగా ఈ ఎన్నికలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా రాజమ్మ ఎన్నికయ్యారు. అధ్యక్ష పీఠం కోసం నిరసన దీక్ష చేపట్టి ఉపాధ్యక్ష పదవితో ఆమె సరిపెట్టుకో వాల్సి వచ్చింది. 


ప్రమాణ స్వీకారానికి వచ్చి.. 


  1. రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి 


నందవరం, సెప్టెంబరు 24: నందవరం ఎంపీపీ లక్ష్మీదేవమ్మ ప్రమాణ స్వీకారానికి వచ్చి తిరిగి వెళుతున్న ఇద్దరు కార్యకర్తలు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కనకవీడుకు చెందిన నరసింహులు, గోపాల్‌ ఎంపీపీ ప్రమాణ స్వీకారం తర్వాత నందవరం నుంచి కనకవీడుకు బైకుపై బయలుదేరారు. నాగలదిన్నెకు చెందిన నిసార్‌ అహ్మద్‌ నాగలదిన్నె నుంచి బైకుపై అతి వేగంగా వస్తూ వీరి బైకును ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు తెలిపారు. గోపాల్‌, నిసార్‌ అహ్మద్‌ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ఎంపీపీలు వీరే


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 24: ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రిసైడింగ్‌ అధికారులు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు.


మండలం ఎంపీపీ

ఆలూరు బూర్ల సుభాషిని

తుగ్గలి ఆదెమ్మ

ఎమ్మిగనూరు కడిమెట్ల కేసన్న 

కౌతాళం అమరేష్‌

పెద్దకడుబూరు శ్రీవిద్య

మహానంది బుడ్డారెడ్డి యశస్విని

మద్దికెర అనిత

నందికొట్కూరు మురళీక్రిష్ణారెడ్డి 

గోనెగండ్ల నసీరుద్దీన్‌

పత్తికొండ నారాయణదాసు

వెల్దుర్తి బొమ్మన సరళ

గూడూరు కుందం సునీత

శిరివెళ్ల నాయక్‌ మహ్మద్‌ వసీం

మిడ్తూరు మల్లు వెంకటేశ్వరమ్మ

నందవరం ముగతి లక్ష్మీదేవమ్మ

కొత్తపల్లి కే.సుమలత

కల్లూరు బి.శారద

కర్నూలు బి.వెంకటేశ్వరమ్మ

కోడుమూరు రూతమ్మ

సి.బెళగల్‌ బొంతల మునెమ్మ

ఓర్వకల్లు కె.తిప్పన్న 

జుపాడుబంగ్లా సువర్ణమ్మ

రుద్రవరం మబ్బు బాలస్వామి

పగిడ్యాల మండ్ల మల్లేశ్వరి

చాగలమర్రి రామిశెట్టి వీరభద్రుడు

ఆళ్లగడ్డ గజ్జల రాఘవేంద్రారెడ్డి 

దొర్నిపాడు గోపరరం అమరనాథరెడ్డి 

బనగానపల్లె మానసవీణ

బేతంచెర్ల నాగభూషణ్‌రెడ్డి

కోవెలకుంట్ల భీమిరెడ్డి రమాదేవి

కొలిమిగుండ్ల కారపాకుల నాగవేణి

కోసిగి పెండేకల్‌ ఈరన్న 

మంత్రాలయం వై.గిరిజమ్మ 

అవుకు చల్లా రాజశేఖర్‌రెడ్డి

ప్యాపిలి ఎస్‌.గోకుల్‌ లక్ష్మీ

సంజామల పోచా రమాదేవి 

ఉయ్యాలవాడ బుడ్డా భాగ్యమ్మ 

నంద్యాల శెట్టి ప్రభాకర్‌

బండిఆత్మకూరు డి.చిన్నసంజీవరెడ్డి

గడివేముల ఎ.నాగమద్దమ్మ

గోస్పాడు ఎస్‌.ఆర్థర్‌ సైమన్‌

డోన్‌ రేగటి రాజశేఖర్‌రెడ్డి 

క్రిష్ణగిరి వెంకటరామిరెడ్డి 

దేవనకొండ దాసరి లక్ష్మీదేవి

ఆదోని బడాయి దానమ్మ

ఆస్పరి ఉమాదేవి

హాలహర్వి నెట్టెకంటమ్మ

చిప్పగిరి హేమలత

హొళగుంద నూర్జహన్‌బీ

పాణ్యం కె.హుస్సేన్‌బీ

ఆత్మకూరు నల్లకాల్వ తిరుపాలమ్మ

వెలుగోడు లాలమ్‌ రమేష్‌

పాములపాడు వి.సరోజిని