Pink Sky: గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం.. స్థానికులకు షాక్.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-07-22T23:41:10+05:30 IST

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోగల మిల్‌దురా టౌన్‌లో(Midura) ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడం సంచలనంగా మారింది.

Pink Sky: గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం.. స్థానికులకు షాక్.. ఆ తరువాత..

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియాలోని(Australia) విక్టోరియా రాష్ట్రంలోగల మిల్‌దురా టౌన్‌లో(Mildura) ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చకే దారి తీశాయి. ఏలియన్స్ వచ్చాయా లేక రాబోయే ప్రళయానికి ఇది సంకేతమా అన్న కామెంట్లూ వినిపించాయి. వైద్య అవసరాలు, పరిశోధన కోసం గంజాయిని సాగు చేస్తున్న కాన్ గ్రూప్ లిమిటెడ్ అనే కంపెనీకి సమీపంలోని ఆకాశం బుధవారం సాయంత్రం ఇలా గులాబీ వర్ణంలోకి మారిపోయింది. 


ఈ వింతని చూసి స్థానికులు షాకైపోయారు. ఏలియన్స్ వచ్చేశాయంటూ హడావుడి పడిపోయారు. అయితే.. కంపెనీ లోపలి నుంచి వెలువడిన గులాబీ రంగు కాంతి కారణంగానే ఆకాశం ఇలా కనిపించి ఉంటుందని కొందరు ఆలోచనాపరులు సందేహించారు. ఆ తరువాత.. కంపెనీ వారు ఆ అనుమానాలు నిజమేనని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గులాబీ రంగు కాంతిలో గంజాయి మొక్కలు బాగా పెరుగుతాయని సంస్థ యాజమాన్యం చెప్పింది. కాబట్టి.. ఈ తరహా కాంతిని వెదజల్లే ప్రత్యేకమైన లైట్లను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ వెలుతురు బయటకు రాకుండా..కిటికీలకు నల్లని తెరలను అడ్డం పెడతామని పేర్కొంది. ఇక బుధవారం నాడు ఈ తెరల్లో కొన్ని పక్కకు తొలగడంతో గులాబీ లైట్ల కాంతి బయటకు వచ్చి ఆకాశం గులాబీ రంగులో ఉన్నట్టు కనిపించిందని వివరించింది. దీంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 





Updated Date - 2022-07-22T23:41:10+05:30 IST