భయపెడుతూ.. మభ్యపెడుతూ

ABN , First Publish Date - 2020-08-11T09:34:48+05:30 IST

కరోనా నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోయి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. వైరస్‌ నియంత్రణలో

భయపెడుతూ.. మభ్యపెడుతూ

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన

కరోనా నియంత్రణలో కేసీఆర్‌ ఉదాసీనత, నిర్లక్ష్యం

కాళేశ్వరం అంచనా వ్యయం పెంపులో అవినీతి

నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఏవీ!?

7లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏవీ?..నడ్డా విమర్శ

బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు: సంజయ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోయి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. వైరస్‌ నియంత్రణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. భయపెడుతూ, ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తోందని నడ్డా తీవ్రంగా విమర్శించారు. ‘‘రాష్ట్రంలో పరీక్షలకు కనీస సౌకర్యాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అయినా, వైఖరి మారలేదు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న రోగికి రోజుకు లక్ష రూపాయలు ఖర్చవుతోంది. ఇదేమి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వ పనితీరు?’’ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు నడ్డా సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ వేదికగా భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడం లేదని, ఫలితంగా, తెలంగాణలో సుమారు కోటిమంది పేదలు 5 లక్షల ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని ఆరోపించారు.


‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.45 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెంచారు. ఇది అవినీతి కాకపోతే మరేంటి? అధికారంలోకి వస్తే పేదలకు 7 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆరేళ్లలో కేవలం 50 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. ఇందుకు కేసీఆర్‌ జవాబు చెప్పాలి’’ అని నిలదీశారు. ఆరేళ్లలో పేదలకు ఏం చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని ఆరోపించారు. ుూకరోనా నియంత్రణ చర్యల్లో ప్రధాని మోదీ ప్రపంచానికే దారి చూపారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు నవంబరు వరకు ఉచితంగా బియ్యం, పప్పులు అందిస్తున్నాం. కరోనా ఆపదను అవకాశంగా మలచుకోవాలని పిలుపునిచ్చిన మోదీ.. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించి అమలు చేస్తున్నారు’’అని వివరించారు. పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అత్యధిక స్థానాలు సాధించేలా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు. 


ఉగ్రవాదులకు అడ్డాగా ఎంఐఎం ఆఫీసు: సంజయ్‌

ఎంఐఎం పార్టీ కార్యాలయం ఉగ్రవాదులు, తీవ్రవాదులకు అడ్డాగా.. కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులు సంఘ విద్రోహ శక్తులకు నిలయాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఓ కుటుంబానికే పరిమితమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తే పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, వారి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని మండిపడ్డారు. గతంలో యూపీలో ములాయం, మాయావతి ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలపై దమనకాండ కొనసాగించాయని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌, కేరళ ప్రభుత్వాలతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల శక్తిని తట్టుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, ఈ వైఖరిని ఎదుర్కొని తారతామని స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం స్ఫూర్తిగా ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. టీఆర్‌ఎ్‌సను గద్దె దింపుతామని, బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించారు. పేదలకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.

Updated Date - 2020-08-11T09:34:48+05:30 IST