‘మచ్చ’ చెరిపేయాలి!

ABN , First Publish Date - 2020-04-03T06:14:59+05:30 IST

విపత్తు కాలంలో మానవాళి తన అవలక్షణాలను వదులుకుంటుందని అనుకోవడం పొరపాటని ‘కరోనా కల్లోలం’ కూడా నిరూపించింది. మనుషుల సమస్త లక్షణాలూ, స్వభావాలూ, మంచివీచెడ్డవీ...

‘మచ్చ’ చెరిపేయాలి!

విపత్తు కాలంలో మానవాళి తన అవలక్షణాలను వదులుకుంటుందని అనుకోవడం పొరపాటని ‘కరోనా కల్లోలం’ కూడా నిరూపించింది. మనుషుల సమస్త లక్షణాలూ, స్వభావాలూ, మంచివీచెడ్డవీ యథాతథంగానే ఉన్నాయి. భయాలు, అనుమానాలు, అపోహలు, అజ్ఞానాలు, ద్వేషాలు, స్వార్థాలు, తాపత్రయాలూ అన్నీ చెక్కుచెదరలేదు. వీటన్నిటి మధ్య ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొనడం, దానిని అధిగమించడం మాటలు కావు. ఈ కష్టసాధ్యమైన కార్యంలో నిర్ణయాధికారులు, అమలుదారులు, క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు– కూడా ఆ జాడ్యాలకు అతీతులు కాకపోవడం విచారకరం. అయినా సరే, వివేకవంతమైన ఆలోచనను, విచక్షణను నిలబెట్టడడానికి ప్రయత్నాలు జరగవలసిందే. 


బుధవారం నాడు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైనది. కరోనాపై యుద్ధంలో ముందువరుసలో నిలబడి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే సంఘటన. ఒక కరోనా రోగి మరణించగా, అతని కుటుంబసభ్యులు, సహరోగులు అయినవారు వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. ఆ దాడి దౌర్జన్యపూరితమన్నదానిలో సందేహంలేదు కానీ, కరోనా గురించిన అవగాహన లేకపోవడమే వారి దుర్మార్గానికి ప్రేరణగా కనిపిస్తోంది. దాడి జరుగుతున్నప్పుడు, ఇతర ఆరోగ్యసిబ్బంది కానీ, పోలీసులు కానీ తగినంతగా స్పందించకపోవడానికి, దాడికి పాల్పడుతున్నవారు కరోనా రోగులు కావడమేనని, సమీపిస్తే తమకు కూడా అంటుకుంటుందని వారు భయపడ్డారని చెబుతున్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది చేసే త్యాగపూరిత విధినిర్వహణను జనతాకర్ఫ్యూ ముగింపువేళ అభినందించవలసిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. రంగంలో నిలిచినవారికి జేజేలు చెప్పవలసిందే. కానీ, ఆ రంగంలో కూడా అనేకమంది కరోనా వైద్యసేవలకు సంసిద్ధత ప్రకటించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ఏవైనా కరోనా సేవలు అందిస్తుంటే, ఆ విభాగంలో పనిచేయడానికి అనేకులు వెనుకాడుతున్న సంఘటనలు కూడా వింటున్నాము. మరోవైపు, కరోనా పీడితులకు కానీ, అనుమానితులకు కానీ సేవలు అందించే ఆరోగ్యసిబ్బందిని వారి నివాస ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్‌ల్లో వేధించడం ఎక్కువైంది. అద్దె ఇళ్లలో ఉండే నర్సులు, డాక్టర్లను ఖాళీచేయమని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. కరోనా చుట్టూ ఈ ‘మచ్చ’ ఉండడం కారణంగానే, అనుమానితుల కోవలో ఉండే అనేకులు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు రావడంలేదని అనిపిస్తోంది. 


తమ నిష్ఠాగరిష్ఠత ముందు, దైవభక్తి ముందు కరోనా ఆటలు సాగవు అంటూ, మర్కజ్‌ కార్యక్రమ నిర్వాహకుడు తన ప్రసంగంలో అన్నాడని చెబుతున్నారు. అటువంటి నమ్మకం వ్యక్తిగత స్థాయిలో ఉంటే సరే కానీ, పెద్ద సంఖ్యలో గుమిగూడే జనంతో చెలగాటమాడడం సరి కాదు. అట్లాగే కాకపోయినా, అటువంటి పద్ధతిలోనే అజాగ్రత్తగా ఉండేవారు, అనవసరమైన అతి జాగ్రత్తతో ఇతరులను బాధపెట్టేవారు మన సమాజంలో ఉన్నారు. ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లివచ్చినవారు ఎందుకు తమంతట తాము పరీక్షలకు, చికిత్సలకు సిద్ధం కావడం లేదు? ఈ వైరస్‌ సోకిన నూటికి ఎనభైమందికి వైద్యచికిత్సే పెద్దగా అవసరం ఉండదని, అతి స్వల్పసంఖ్యలో మాత్రమే తీవ్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరవలసి వస్తుందని, యువకులకు ప్రమాదం అతి తక్కువ– అన్న విషయాలు తక్కువగా ప్రచారమయ్యాయి. కరోనా పోరులో కీలకమైన విధుల నిర్వహణకు యువకులు తమంతట తాము సిద్ధపడవచ్చు, వలంటీర్లుగా ముందుకు రావడం ద్వారా, సమాజంలో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించవచ్చు. 


కరోనా వంటి ఈతిబాధలను ఎదుర్కొనడంలో సాంస్కృతిక అంశాలు కూడా అనేకం ఇమిడి ఉంటాయి. మడి, మైల, అంటు, వెలి వంటి భావనల భారం ఉన్న మన సమాజంలో, భౌతిక దూరం అన్న భావనకు విపరీత అర్థాలు ధ్వనిస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. 1890 దశాబ్దం నాటి బొంబాయి ప్లేగు (బ్యుబోనిక్‌ ప్లేగ్‌) సమయంలో గుంపునియంత్రణ, ఆరోగ్య పరీక్షల సందర్భంగా కఠినమైన వ్యవహారసరళి ప్రదర్శించిన డబ్ల్యు.సి. రాండ్‌ అనే ప్లేగ్‌ కమిషనర్‌ను అప్పటి విప్లవకారులు హత్యచేశారు. ప్రజల సాంస్కృతిక విశ్వాసాలను పట్టించుకోకుండా ప్లేగు అణచివేత చర్యలు చేపట్టడమే ఆ చర్యకు కారణం. ప్రభుత్వాసుపత్రులలో చేరడం కంటె, ప్లేగుతో చనిపోవడమే మెరుగని ఆనాడు భావించేవారు. ఇంగ్లీషువారు ప్లేగు పేరుతో ఆస్పత్రులలో చేర్పించి, తరువాత చంపుతారని నమ్మేవారు. చావు ఊరేగింపు అనుమతించకపోతే, రోజుల తరబడి మృతదేహాలను ఇళ్లలోనే దాచి, అనువైన రోజున ఏ అర్ధరాత్రో ఊరుఊరంతా కదిలి అంత్యక్రియలు జరిపేవారు. కరోనా సందర్భంగా, చేతులు కడుక్కోవడం వంటి అంశాలమీద జరిగినంతగా, ఆ జబ్బు మీద ఉన్న దురభిప్రాయాలను తొలగించడానికి ప్రచారం జరగలేదు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కానీ, కరోనా సోకినవారిని, వారి కుటుంబసభ్యులను, విదేశాల నుంచి వచ్చినవారిని– వెలివేసినట్టు చూడనక్కరలేదు. కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి వార్తలు వింటున్నాము. సాటివారు, తోటివారు తనను తక్కువగా చూస్తారన్న భావనే కదా, వారిని అఘాయిత్యానికి పురికొల్పింది? టెస్టులకు దొరక్కుండా అనుమానితులు తప్పించుకోవడానికి కూడా కారణం అదే. కరోనా గురించిన వాస్తవిక అంశాలను ప్రచారం చేయడానికి ప్రభుత్వం తగిన మాధ్యమాలను అన్వేషించాలి. కరోనా పోరాటంలో సామాజిక నాయకుల సహాయం తీసుకోవాలని ప్రధాని గురువారం నాడు ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో సమావేశంలో చేసిన సూచన విలువైనది.


కరోనాలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వైరసంబంధం లేదు. ప్రజల సహకారంలేకపోతే, ఈ యుద్ధంలో గెలుపు లేదు. ఆ సహకారం కావాలంటే, విశ్వాసం కావాలి. తామో, తమ కుటుంబసభ్యులో కరోనా చికిత్సకు వెళ్లవలసివస్తే అదేమంత పాపం కాదని, ఇతరులకు ఆ స్థితి వచ్చినా తాను వారిని గౌరవంగానే చూస్తానని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అట్లా అనుకుంటేనే వైద్యులకు, ప్రజలకు అందరికీ రక్ష. అటువంటి మంచి విలువను, నమ్మకాన్ని ప్రజలలో కల్పించడానికి ప్రజలలో గౌరవం, విశ్వాసం కలిగిన వివిధ శ్రేణుల సామాజిక నాయకుల సాయం తీసుకోవాలి.

Updated Date - 2020-04-03T06:14:59+05:30 IST