నాడు-నేడులో అవినీతి

ABN , First Publish Date - 2020-11-13T06:10:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల నాసిరకంగా పనులు జరుగుతున్నాయి.

నాడు-నేడులో అవినీతి
నాసిరకంగా వేసిన బండ పరుపు


  1. నాణ్యత లేని నిర్మాణ పనులు 
  2.  పర్సెంటేజీల కోసం అధికారుల మధ్య వాగ్వాదం  
  3.  ప్రేక్షకులుగా పర్యవేక్షణ అధికారులు

పాములపాడు, నవంబరు 12: రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. పాములపాడు మండలంలో 14 పాఠశాలల్లో నాడు నేడు పనులకు రూ 3.31 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇసుక, సిమెంట్‌, టైల్స్‌, పెయింట్‌, ఫర్నిచర్‌ ఇలాంటి వాటిని ప్రభుత్వమే సరఫరా చేసింది. మిగతా ఎలక్ర్టికల్‌ సామాను, బండలు, తాగునీటి బోర్లు, పైపులు, చిన్న నిర్మాణ పనులు, టాయిలెట్లు తదితర సామగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ మెంబర్లు, సభ్యులు కలిసి పీఆర్‌జేఈ సూచించిన ధరలకు కొనుగోలు చేయవలసి ఉంది. అయితే పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ లేకుండా, సభ్యుల అనుమతి తీర్మానాలు లేకుండానే కమిషన్‌లకు ఆశ పడి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అధికారులు కమిటీ సభ్యుల ఇళ్ళ దగ్గరికే వెళ్ళి సంతకాలు చేయించుకుని వారికి తెలియకుండా బ్యాంకులలో డబ్బులు డ్రా చేసి ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులన్నింటినీ అధికారులతో కలిసి కమిటీ ఛైర్మన్‌, సభ్యులు చేయవలసి ఉంది. అయితే పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు మాత్రం వీళ్ళను పక్కన పెట్టి బయటి వ్యక్తులతో నిబంధనలకు విరుద్ధంగా పనులన్నీ చేయిస్తున్నారని కమిటీ సభ్యలు వాపోతున్నారు. ఎలక్రికల్‌ టాయిలెట్‌ నిర్మాణ సామగ్రి లాంటివి కొన్న చోట వ్యాపారులతో బిల్లులు ఎక్కువ ధరలు వేయించి లెక్కలు చూపుతున్నారు. ఇందులో పర్సెంటేజీల విషయంలో అధికారుల మధ్య తారాస్థాయిలో వాగ్వాదం జరగడంతో  సిబ్బంది విస్తు పోయారు. ఇప్పటికే మండలంలో 60 శాతం పనులు పూర్తి చేశారు. నాడు నేడు పనులలో ఇంత జరుగుతున్నా పర్యవేక్షించ వలసిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యలు, విద్యార్థుల తల్లిదండ్రలు కోరుతున్నారు.

ఎంఈవో వివరణ: నాడు నేడు అవకతవకలపై ఎంఈవో బాలాజీనాయక్‌ను వివరణ కోరగా.. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. అలాంటివి తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Updated Date - 2020-11-13T06:10:16+05:30 IST