ఉద్యోగాలిప్పిస్తానని తీసుకొచ్చి.. యాచక వృత్తి..!

ABN , First Publish Date - 2021-01-11T06:40:48+05:30 IST

బాలికలను ఉద్యోగాల

ఉద్యోగాలిప్పిస్తానని తీసుకొచ్చి..  యాచక వృత్తి..!


డొనేషన్ల పేరుతో సిగ్నళ్ల వద్ద వసూళ్లు

మంగళ్‌హాట్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : బాలికలను ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి యాచకులుగా మారుస్తున్న మహిళలను స్మైల్‌ ఆపరేషన్‌ టీమ్‌ సహకారంతో పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆబిడ్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన రవణమ్మ(42) రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలను ఉద్యోగాల్లో చేర్పిస్తానని నగరానికి తీసుకువచ్చింది. వారికి ఫౌండేషన్ల పేరుతో ఉన్న డబ్బాలను ఇచ్చి సిగ్నల్స్‌ వద్ద వాహనదారులను డబ్బులు అడగాలని, అందుకు ప్రతి నెలా జీతం చెల్లిస్తానని చెప్పింది. దీంతో వారు చిన్నారులకు అన్నదానం, వైద్య చికిత్సలు చేయిస్తున్నామంటూ ఎంజే మార్కెట్‌తో పాటు పలు సిగ్నల్స్‌ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. వసూలు చేసిన డబ్బులను సాయంత్రం రమణమ్మ తీసుకునేది. ఇదిలా ఉండగా ఆదివారం స్మైల్‌ ఆపరేషన్‌ టీమ్‌ ఎంజే మార్కెట్‌లో ఫౌండేషన్‌ పేరుతో డబ్బులు అడుగుతున్న బాలికలను విచారించి ఆబిడ్స్‌ పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఆ బాలికల వివరాలు సేకరించి అసలు నిందితురాలు రవణమ్మను అదుపులోకి తీసుకున్నారు. బాలికలను చాంద్రాయణగుట్టలోని రెస్క్యూ హోంకు తరలించారు. రవణమ్మపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-11T06:40:48+05:30 IST