ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపును సమర్ధించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-09-08T20:58:39+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగిస్తూ..

ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపును సమర్ధించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బుధవారంనాడు సమర్ధించింది. అయితే, మరోసారి గడువు పొడిగించవద్దని కేంద్రానికి స్పష్టం చేసింది. పదవీ విరమణ సమయంలో సర్వీసు పొడిగింపు చాలా అరుదుగా, ప్రత్యేక సందర్భాల్లోనే జరుగుతుందని, అయితే ఇలాంటి సందర్భాల్లో స్వల్పకాలిక పొడిగింపు మాత్రమే ఉండాలని జస్టిస్ నాగేశ్వరరావు సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. ''ఈడీ డెరెక్టర్ పదవీకాలం పొడిగించేందుకు భారత ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని మేము ధ్రువీకరిస్తున్నాం. పదవీ విరమణ చేయాల్సిన సమయంలో పొడిగింపు అనేది ప్రత్యేక సందర్భాల్లోనే జరగాలి. అదికూడా స్వల్పకాలానికే పరిమితం కావాలి'' ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో మిశ్రా పదవీకాలం ముగియాల్సి ఉంది. 2018 నవంబర్ 19న రెండేళ్ల పదవీకాలానికి మిశ్రా ఈడీ డైరక్టర్‌గా నియమితులయ్యారు. అయితే 2020 నవంబర్ 13న కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఎన్జీఓ 'కామన్ కాజ్' సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

Updated Date - 2021-09-08T20:58:39+05:30 IST