పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటాపై.. జోక్యం చేసుకోం

ABN , First Publish Date - 2022-01-29T08:24:43+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కోటాకు తానుగా కొలమానాన్ని నిర్దేశించేందుకు నిరాకరించింది. అయితే వారికి ప్రమోషన్లు కల్పించే విషయంలో కేడర్‌ను యూనిట్‌ గా తీసుకోవాలని.....

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటాపై..  జోక్యం చేసుకోం

దానికి కొలమానం మేం నిర్దేశించం.. ఆ బాధ్యత రాష్ట్రాలదే

కేడర్‌ యూనిట్‌గా పదోన్నతులివ్వాలి

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ప్రమోషన్‌ కోరే గ్రేడ్‌/కేటగిరీకి

మాత్రమే రిజర్వేషన్‌ పరిమితం

ఆయా పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు

సరైన ప్రాతినిధ్యం ఉందా.. లేదా?

ఆయా రాష్ట్రాలే నిర్ధారించాలి

త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు


న్యూఢిల్లీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.  ఈ కోటాకు తానుగా కొలమానాన్ని నిర్దేశించేందుకు నిరాకరించింది. అయితే వారికి ప్రమోషన్లు కల్పించే విషయంలో కేడర్‌ను యూనిట్‌ గా తీసుకోవాలని.. ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం సరిపడా లేకపోవడంపై డేటాను సేకరించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఏ గ్రేడ్‌/కేటగిరీలో అయినా వారికి తగు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ ఉండాల్సిందేనని పేర్కొంది. అయితే అలాగే పదోన్నతి కోరే గ్రేడ్‌/కేటగిరీకి మాత్రమే డేటా సేకరణ పరిమితం కావాలని.. మొత్తం సర్వీసుకు సంబంధించి డేటా సేకరణ అర్థరహితమని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై పలు అస్పష్టతలు ఉన్నాయని.. ఈ కారణంగా పలు నియామకాలు నిలిపేయాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలుచేశాయి. వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరాయి.  ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతిపై సుప్రీంకోర్టే నిర్దిష్ట, నిర్ణయాత్మక ప్రమాణాలను ఖరారుచేయాలని, వాటిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పాటిస్తాయని కేంద్రం పదోన్నతుల్లో కోటా ఇవ్వడానికి వీల్లేదని 1992లో ఇచ్చిన మండల్‌ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే క్రీమీలేయర్‌ విధానాన్ని ఎస్సీ, ఎస్టీలకూ వర్తింపజేస్తూ..2006లో ఎం.నాగరాజ్‌ కేసులో తీర్పు ఇచ్చింది. పదోన్నతుల్లో వారికి కోటా ఇచ్చేందుకు వీలుగా తీర్పును పునఃసమీక్షించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను 2018లో తోసిపుచ్చింది. ప్రమోషన్లలో వారికి రిజర్వేషన్‌ కల్పించడానికి మాత్రం మార్గం సుగమం చేసింది. పదోన్నతుల్లో కోటాకు ఆయా కులాల వెనుకబాటుతనానికి సంబంధించిన డేటాను రాష్ట్రాలు సేకరించాల్సిన అవసరం లేదని తెలిపింది.


ఈ తీర్పులన్నిటినీ తాజా వాదనల సందర్భంగా కేంద్రం తరఫున ఏజీ కేకే వేణుగోపాల్‌ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతికి దూరమయ్యారని.. దేశహితం దృష్ట్యా వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బల్బీర్‌సింగ్‌, పలువురు సీనియర్‌ న్యాయవాదులు వివిధ పక్షాల తరఫున వాదనలు వినిపించారు. అనంతరం త్రిసభ్య ధర్మాసనం నిరుడు అక్టోబరు 26న తన తీర్పును రిజర్వుచేసి.. శుక్రవారం వెల్లడించింది. జర్నైల్‌సింగ్‌, నాగరాజ్‌ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని.. పదోన్నతుల్లో కోటా అవసరానికి సంబంధించి ఎలాంటి కొలమానాన్నీ తాము నిర్దేశించడం లేదని స్పష్టం చేసింది. గణాంకాల డేటా సేకరణ బాధ్యత మాత్రం రాష్ట్రాలదేనని పేర్కొంది. నైష్పత్తిక ప్రాతినిధ్యం, రిజర్వేషన్‌ అవసరాల జోలికి తాము వెళ్లడం లేదని తెలిపింది. ఆ బాధ్యతను రాష్ట్రాలకే వదిలిపెడుతున్నామని, పోస్టుల్లో పదోన్నతులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందో లేదో వివిధ కోణాల్లో విశ్లేషించి అంచనా వేయాల్సింది అవేనని తేల్చిచెప్పింది. ఈ డేటా సేకరణ మొత్తం ఎస్సీ, ఎస్టీ క్లాసులకు, గ్రూపులకు సంబంధించి చేయరాదని.. పదోన్నతి కోరుతున్న గ్రేడ్‌/కేటగిరీకి మాత్రమే పరిమితం కావాలని పేర్కొంది. ప్రమోషన్లలో రిజర్వేషన్‌ కల్పిస్తూ చేసిన 85వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు 2006లో ఇచ్చిన తీర్పును ఇప్పటి నుంచే అమలుచేయాలని తెలిపింది. వ్యక్తిగత కేసుల మెరిట్లపై తామెలాంటి అభిప్రాయాలూ వ్యక్తీకరించడం లేదని జస్టిస్‌ నాగేశ్వరరావు తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేస్తున్నామని.. అటార్నీ జనరల్‌ వర్గీకరించిన అంశాలపై అప్పుడు విచారణ జరుపుతామని చెప్పారు. తొలుత కేంద్రప్రభుత్వ వ్యాజ్యాలను జాబితాలో చేర్చుతామన్నారు. అదేరోజు హోం కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపైనా విచారిస్తామని తెలిపారు.

Updated Date - 2022-01-29T08:24:43+05:30 IST