ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఈ-ఆఫీసు

ABN , First Publish Date - 2020-07-04T00:38:08+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇక నుంచి ఈ-ఆఫీసు సేవలను ఉపయోగించే దిశగా కమిషన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఈ-ఆఫీసు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇక నుంచి ఈ-ఆఫీసు సేవలను ఉపయోగించే దిశగా కమిషన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం సూచించిన సూచనలను పరిగణలోకి తీసుకున్న కమిషన్‌ఛైర్మన్‌ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఈ-ఆఫీస్‌ ద్వారా కమిషన్‌ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం బషీర్‌బాగ్‌లో కమిషన్‌ కార్యాలయ సిబ్బందికి నేషనల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి) ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ-ఆఫీస్‌ ద్వారా కమిషన్‌ మరింత పారదర్శకంగా, వేగంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. అలాగే కమిషన్‌ కార్యాలయానికి నేరుగా రాకుండా ఇ-మెయిల్‌ ద్వారా గానీ పోస్ట్‌ ద్వారా గానీ కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డ్రాప్‌ బాక్స్‌ కానీ ఉపయోగించి ఫిర్యాదులను పంపవచ్చని ఆయన తెలిపారు.


ఫిర్యాదులకు ఈ- ఆఫీస్‌ ద్వారా సత్వరమే పరిష్కరించి ఎస్సీ, ఎస్టీలకు కమిషన్‌పై ఉన్న భరోసాను, నమ్మకాన్ని ఇంకా పెరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రానున్నరోజుల్లో ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించి ఈ వర్గాలకు భరోసా నింపే ప్రయత్నంలో భాగంగానే కమిషన్‌ ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఛైర్మన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శిక్షణ తర్వాత కమిషన్‌ కార్యకలాపాలు పూర్తిగా ఈ-ఆఫీస్‌ ద్వారానే నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ సెక్రటరీ పాండదాస్‌, డిడి లావణ్య, రిటైర్డ్‌ జేడీ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T00:38:08+05:30 IST