దళితులకు దగా

ABN , First Publish Date - 2022-04-04T09:01:00+05:30 IST

‘మాది సంక్షేమ ప్రభుత్వం’.. వైసీపీ నేతలు తరచూ చెప్పే మాట ఇది. నవరత్నాల పేరుతో డబ్బులు పంచడం తప్ప దళితులకు..

దళితులకు దగా

ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించిన సర్కారు!

యువత స్వయం ఉపాధికి చెల్లుచీటీ

రుణాలు లేవు.. సబ్సిడీలూ లేవు 

గతంలో ఉన్న వ్యవసాయ పథకాలూ బంద్‌ 

విదేశీ చదువుకు ఆర్థిక సాయం ఆపివేత 

మూడేళ్లుగా అమలుకాని పథకాలు

బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ నవరత్నాలకే

మూడేళ్లలో రూ.5,746 కోట్లు దారి మళ్లింపు

మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు నిధులు నిల్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘మాది సంక్షేమ ప్రభుత్వం’.. వైసీపీ నేతలు తరచూ చెప్పే మాట ఇది. నవరత్నాల పేరుతో డబ్బులు పంచడం తప్ప దళితులకు సంక్షేమ పథకాలు ఏవీ? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న పథకాలన్నింటికీ మంగళం పాడేసింది. స్వయం ఉపాధి పథకాలను ఆపేసింది. యువత స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు, సబ్సిడీలు బంద్‌ చేసింది. దళిత రైతన్నలకు పలు తోడ్పాటు పథకాలు అందించడం లేదు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం పూర్తిగా కట్‌ చేసింది. ఎస్సీలకు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే అవకాశాన్నీ చేజార్చింది. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయకుండా ఎగనామం పెట్టింది. కొన్నింటిని దారి మళ్లిస్తోంది. మూడేళ్లుగా ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అందరితో పాటు ఎస్సీ, ఎస్టీలకు నవరత్నాలు అందిస్తూ.. వారికి వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్‌ పద్దుల్లో చూపుతోంది. రాష్ట్రంలో దళితుల జనాభా 16.41 శాతం ఉంది. బడ్జెట్‌లో దళితుల సంక్షేమానికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వారికే ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది. 2020-21 ఏడాదితో పోల్చితే 2021-22లో నిధులు భారీగా తగ్గించింది. పథకాలతో పాటు కార్పొరేషన్లనూ నిర్వీర్యం చేసింది. పేరుకు గొప్పలు చెప్పడం తప్ప ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విమర్శలు వస్తున్నాయి. సబ్‌ప్లాన్‌ నిధులు నవరత్నాలకు వాడటం సిగ్గు చేటని, ఈ విషయంపై అసెంబ్లీలో ఒక్క దళిత, గిరిజన ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం బాధాకరమని రాష్ట్ర కులవివక్ష పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శించారు. 


5,746 కోట్లు దారి మళ్లింపు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో రూ.5,746 కోట్లు ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించింది. గత మూడేళ్లలో బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.26,539 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20,790 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.  ఎస్సీలకు సంబంధించి కేటాయించిన రూ.18,604 కోట్లలో కేవలం రూ.13,794 కోట్లు ఖర్చు చేసింది. ఎస్టీలకు కేటాయించిన రూ.7,935 కోట్లలో సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల కోసం భారీగా రూ.9,231 కోట్లు కేటాయించింది. అయితే కేవలం రూ.4,177 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ నవరత్నాల కోసం ఖర్చు చేసి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసినట్లు చూపించారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అయితే ఏ కార్పొరేషన్‌కూ నిధులు కేటాయించలేదు. చైర్మన్లను మాత్రం నియమించింది. ఎస్సీ కార్పొరేషన్‌కు 2018-19లో రూ.900 కోట్లు, 2019-20లో రూ.350 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్‌ లక్ష్యానికి విరుద్ధంగా 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దళితులకు ఒక్క రుణం కూడా ఇవ్వడం లేదు. గతంలో ఉన్న పథకాలు నిర్వీర్యమయ్యాయి. 


గత ప్రభుత్వంలో ఉపాధి పథకాలు

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా వందలాది మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేవారు.


పలు రకాల యూనిట్ల ఏర్పాటుకు ఏటా సుమారు రూ.400 కోట్ల దాకా ఖర్చు చేసేవారు. 


స్వయం ఉపాధి యూనిట్లకు 60ు దాకా సబ్సిడీ 


డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఇన్నోవా కార్లు అందజేశారు.


పేద రైతులకు ముర్రా గేదెలు, మేలు రకపు ఆవులు, గొర్రెలు, మినీ డైరీ తదితర ప్రయోజనాలు కల్పించారు


వెట్టి, జోగినులకు పునరావాస కార్యక్రమాలు 


పేద రైతుల పొలాల్లో బోర్లు, పంపుసెట్లు, విద్యుత్‌. 


భూమి అభివృద్ధి, భూమి లేని పేదలకు భూములు కొనివ్వడం, ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఇవ్వడం. 

ఫ ఎస్సీలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి యూనిట్లకు  రుణాలు అందజేశారు. 

వైసీపీ సర్కారులో ఏవీ ఆ పథకాలు?


గతంలోని ఎస్సీ, ఎస్టీల పథకాలన్నిటికీ నిధులు  బంద్‌


ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఉపాధి  సంక్షేమానికి సాయం అందడం లేదు. 


2019-20లో రూ.79 లక్షలు కేటాయించి పైసా ఖర్చు చేయలేదు. 2020-21, 2021-22 బడ్జెట్‌లో వరుసగా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు కేటాయించి ఖర్చు చేయలేదు. 


భూమి కొనుగోలు పథకానికి 2020 నుంచి రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో భూమి లేని దళితులు వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు. 


కార్పొరేట్‌ విద్యకు స్వస్తి 

గతంలో మెరికల్లాంటి ఎస్సీ విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌, డిగ్రీ కోర్సులు చదివించేవారు. ప్రాథమిక విద్యను పేరొందిన కార్పొరేట్‌ పాఠశాలలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పేరుతో అందించేవారు. విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించేది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో చదివే అదృష్టం కోల్పోయారు. సంక్షేమ గురుకుల పాఠశాలల బడ్జెట్‌కు కోత విధించి మెనూ తగ్గించింది. 


స్మృతివనంపై నీలినీడలు 

దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణాన్ని సైతం ఈ ప్రభుత్వం నిలిపివేసింది. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా గత ప్రభుత్వం రాజధాని అమరావతి నడిబొడ్డున శాకమూరులో స్మృతివనాన్ని ఏర్పాటు చేయదలపెట్టింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 20 ఎకరాల విస్తీర్ణంలో  125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, మెమోరియల్‌ పార్క్‌, బుద్దధ్యాన కేంద్రం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదట రూ.97.69 కోట్లు మంజూరు చేసింది. 22 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పనులను నిలిపేసింది.  వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్‌ స్మృతివనంగా విజయవాడలోని స్వరాజ్‌మైదానాన్ని మార్చాలని నిర్ణయించింది. 


విదేశీ విద్య, విద్యోన్నతికి గండి 

విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ యువతకు గతంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టారు. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు పెంచి రూ.15 లక్షలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ పథకానికి గండి కొట్టారు. ఏటా అసెంబ్లీలో ఈ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఒక్క ఏడాది కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదు. అలాగే విద్యోన్నతి పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్‌ సర్వీస్‌కు సన్నద్ధమయ్యేందుకు గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా శిక్షణ ఇప్పించారు. ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర ప్రముఖ నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పించారు. వారి హాస్టల్‌ ఖర్చులకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ప్రభుత్వంలో ఇవేవీ అమలు కావడం లేదు. ఏపీ స్టడీ సర్కిల్స్‌కు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు.

Updated Date - 2022-04-04T09:01:00+05:30 IST