ఎస్సీ రిజర్వేషన్లను ఆర్థికంగా వర్గీకరించాలి

ABN , First Publish Date - 2022-07-27T06:18:31+05:30 IST

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్.సి.లుగా వర్గీకరించింది...

ఎస్సీ రిజర్వేషన్లను  ఆర్థికంగా వర్గీకరించాలి

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్.సి.లుగా వర్గీకరించింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ, ఈ తేడాను సవరించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తూ ఎ, బి, సి, డి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కోరుతున్నది. అయితే వారు చెబుతున్న వర్గీకరణ ప్రకారం పాక్షిక న్యాయం మాత్రమే లభించే అవకాశం ఉంది.


రిజర్వేషన్లు ప్రారంభమైనప్పుడు ఆయా కులాల్లో మొదటి తరం వారందరూ ఒకే సామాజిక, ఆర్థిక స్థితి కలిగి ఉన్నారు. అయితే ప్రాంతాలను బట్టి క్రైస్తవ మతాన్ని అనుసరించే దాన్నిబట్టి కొన్ని తేడాలు ఉండవచ్చు. అదే సమయంలో దేశంలో రాజకీయంగా సంభవిస్తున్న ఆర్థికంగా సామాజికంగా మార్పుల కారణాన షెడ్యూల్ కులాల్లో కూడా ఒక ఉన్నత వర్గం తయారైంది. ఈ వర్గమే రిజర్వేషన్లలో ఎక్కువ భాగాన్ని పొందుతున్నది. ఈ స్థితిని నియంత్రించడానికి క్రిమిలేయరు పద్ధతిని అనుసరించాలని, లేదా వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించాలనే వాదోపవాదనలు ఉన్నాయి. ఇది ఒక వాస్తవం.


ఇలాంటి నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసిన వర్గీకరణ కూడా ఆయా కులాలలో ఉండే ఉన్నత వర్గమే ముందుగా పొందుతుంది. అటువంటప్పుడు ఎవరైతే ఆయా కులాల్లో పేదరికంలో ఉండి రిజర్వేషన్ అవకాశాలను పొందలేని వారు ఉన్నారో వారికి న్యాయం జరగదు. కాబట్టి కులపరమైన రిజర్వేషన్ పద్ధతితో న్యాయం జరగటం లేదనీ అనుకున్నప్పుడు ఆర్థిక పద్ధతిని అనుసరించటం సరైనది అవుతుంది. బీసీలలో రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే కల్పించారు. ఇప్పుడు షెడ్యూల్ కులాలలో కూడా రిజర్వేషన్ వర్గీకరణ ఉన్నతమైన పద్ధతిలో జరగాలి. ఈ పద్ధతిలో ఆర్థిక ప్రాతిపదికన మూడు తరగతులుగా విభజించవచ్చు. తరగతి–ఎ లో ఉద్యోగాలు చేస్తున్నవారు, రాజకీయంగా పదవులు పొందిన వారు, వ్యాపారాలు చేస్తూ ఒక స్థాయి దాటి ఆర్థికంగా బలపడిన వారిని ఉంచాలి. బి–గ్రూపులో ఎకరం పైబడి భూములు కలిగిన వారిని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందుతున్న వారిని చేర్చాలి. ఇక సి–గ్రూపులో వ్యవసాయ కార్మికులుగా ఉంటూ పేదరికపు రేఖకు దిగున ఉన్న వారిని తీసుకురావాలి.


ఇలా వర్గీకరణ చేయటం వల్ల జరిగే మొదటి ప్రయోజనం ఏమంటే, ఎవరైతే రిజర్వేషన్లు ఉపయోగించుకొని అభివృద్ధి చెందినవారు (అది మాలలు కావచ్చు లేదా మాదిగలు కావచ్చు, ఇతర ఉపకులాలు కావచ్చు) ఉంటారో వారే రిజర్వేషన్లు మరలా మరలా పొందే పద్ధతికి అవకాశం ఉండదు. అంతేకాక వారి జనాభా స్థాయికి అనుగుణంగా రిజర్వేషన్ పొందే విధంగా పరిమితం చేయవచ్చు. అలా పరిమితం చేయటం వల్ల మెజారిటీగా ఉండే పేదలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ లభించే అవకాశం వస్తుంది. ఇక రెండో ప్రయోజనానికి వస్తే, ఇప్పుడున్న పద్ధతిలో షెడ్యూల్డ్ కులాలు ఉప కులాల వారీగా విడిపోతున్నారు. వారిలో సామాజిక, ఆర్థిక మార్పులు జరుగుతున్నప్పటికీ ఉపకుల పైత్యాలు అలాగే పెంచుకుంటూ దళిత ఐక్యతకు గండి కొడుతున్నారు. ఇలా రాజకీయంగా ఐక్యం కాకపోవటం వల్ల డిమాండ్ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది మొత్తం సమాజానికి చాలా నష్టాన్ని మిగుల్చుతున్నది. 


ఎవరి సమస్యల పరిష్కారమైనా అది రాజకీయాల ద్వారానే సాధ్యపడుతుంది. దీన్ని గుర్తించకుండా స్వల్ప ప్రయోజనాల కోసం సంఘాలు పెట్టుకొని ఉద్యమాలు చేయడం వల్ల ఎవరో కొందరికి ఉపాధి లభించవచ్చు లేదా కాన్షీరాం అన్నట్లు రాజకీయ పార్టీలకు కావలసిన చెంచాలు లభించవచ్చు. కానీ ఆ కులాలలో నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారి సమస్యలు పరిష్కారం కావు. అందుకనే కమ్యూనిస్టులు కింది కులాలలో వస్తున్న చైతన్యాన్ని అభినందిస్తూనే, వారి చైతన్యాన్ని ఆయా కులాల్లో ఉండే ఉన్నత వర్గం వారు దారి తప్పిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆర్థిక వర్గీకరణ పద్ధతి ఉపకుల పైత్యాలను తగ్గించడానికి ఉపయోగపడటమే కాక కుల నిర్మూలన మార్గానికి కూడా దారి చూపుతుంది. కాబట్టి ఏ సమస్యనైనా రాజకీయ కోణం నుంచి, అలాగే కుల నిర్మూలన దృక్పథం నుంచి మాత్రమే పరిష్కరించుకోవాలి. ఈ రకంగా చూసినప్పుడు ఎమ్మార్పీఎస్ కోరుతున్న వర్గీకరణ కంటే ఇప్పుడు పేర్కొన్న ఆర్థిక వర్గీకరణ పద్ధతి సరైనదిగా అవుతుంది.

పట్టా వెంకటేశ్వర్లు


Updated Date - 2022-07-27T06:18:31+05:30 IST