‘మహా’సర్కార్, దేశ్‌ముఖ్‌లకు సుప్రీం షాక్!

ABN , First Publish Date - 2021-04-08T23:38:23+05:30 IST

మహారాష్ట్ర ప్రభుత్వం, మాజీ హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై...

‘మహా’సర్కార్, దేశ్‌ముఖ్‌లకు సుప్రీం షాక్!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత ధర్మాసనం కొట్టేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ చేపట్టాలంటూ బోంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్‌ముఖ్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, నేరం స్వభావం, ఆరోపణల్లో తీవ్రతను బట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం...’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బోంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది.


ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమేననీ... సీనియర్ పోలీస్ అధికారి ఓ సీనియర్ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు ఇలాంటి దర్యాప్తు తప్పేం కాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటి మాటలతో ఆరోపణలు చేశారనీ... కనీసం తమ వాదనను కూడా వినకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని దేశ్‌‌ముఖ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఉన్న మాజీ పోలీస్ కమిషనర్, హోంమంత్రి ఇద్దరూ పరస్పరం విడిపోయే వరకు కలిసే పనిచేశారని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. కాగా బోంబే హైకోర్టు ఈ నెల 5న సీబీఐ విచారణకు ఆదేశించిన కొద్ది సేపటికే హోంమంత్రి పదవికి దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. 

Updated Date - 2021-04-08T23:38:23+05:30 IST