ధర్మ సంసద్ ద్వేషపూరిత వ్యాఖ్యల ఫలితం.. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-26T23:29:26+05:30 IST

పదేపదే ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ధర్మసంసద్‌ను అడ్డుకోవడంలో

ధర్మ సంసద్ ద్వేషపూరిత వ్యాఖ్యల ఫలితం.. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: పదేపదే ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ధర్మసంసద్‌ను అడ్డుకోవడంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై విఫలమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి దురదృష్టకర ఘటనలను, ఆమోదయోగ్యం కాని ప్రసంగాలను అడ్డుకుని ఉండాల్సిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రసంగకర్త ఒకరే అయినప్పుడు సమస్య అవుతుందని తమకు తెలియదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ప్రసంగకర్త ఏం మాట్లాడతారో తమకు తెలియని, ఎవరైనా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు దానికి అనుమతి నిరాకరించలేమని ఉత్తరాఖండ్ ప్రభుత్వ న్యాయవాది చేసిన వ్యాఖ్యలకు కోర్టు ఇలా ప్రతిస్పందించింది.

 

ధర్మసంసద్‌లో వివక్షాపూరిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని కోరింది. పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తూ.. ఇప్పుడు రూర్కీలోనూ సంసద్ నిర్వహించనున్నట్టు ప్రకటించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని ఉత్తరాఖండ్ లాయర్‌ దృష్టికి తీసుకెళ్లిన న్యాయస్థానం.. మరో ఘటన జరగబోతోందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారని, దీనిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన ఇప్పటికే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, నిర్వాహకుల కోసం ఆరా తీస్తున్నట్టు చెప్పారు.  


ఇలాంటి సమస్యలను పరిష్కరించే తీరు ఇది కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం.. ఇకపై ఎలాంటి ఘటన జరిగినా ముఖ్య కార్యదర్శి, ఐజీ, డీజీపీని బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.  నివారణ చర్యలు తీసుకోవడం చేతకాకపోతే చీఫ్ సెక్రటరీ తమ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని న్యాయస్థానం తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

Updated Date - 2022-04-26T23:29:26+05:30 IST