SC సంచలన తీర్పు.. రాజీవ్ హత్య కేసులో దోషి విడుదలకు ఆదేశం

ABN , First Publish Date - 2022-05-18T17:33:24+05:30 IST

SC సంచలన తీర్పు.. రాజీవ్ హత్య కేసులో దోషి విడుదలకు ఆదేశం

SC సంచలన తీర్పు.. రాజీవ్ హత్య కేసులో దోషి విడుదలకు ఆదేశం

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పేరరివాళన్‌ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవిత ఖైదును రద్దు చేయాలంటూ దోషి పేరరివాళన్‌ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, ఎఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి, రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు బుధవారం పేర్కొన్నారు. కాగా, పేరరివాళన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 19 ఏళ్ల వయసులోనే రాజీవ్ గాంధీని హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన పేరరివాళన్‌ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.


1991 జూన్‌ 11న చెన్నైలో పేరరివాళన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజీవ్‌గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలు అందించిన కేసులో అతడికి జైలు శిక్ష పడింది. అనంతరం 1999లో మరణశిక్ష విధించినప్పటికీ అది రద్దైంది. చివరిగా 2014లో ఆ శిక్ష జీవితఖైదుగా విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అందులో పేరరివాళన్‌ ఒకడు. కాగా, పేరరివాళన్‌ విడుదలతో మరో ఆరుగురు నిందితుల విడుదలకు మార్గం సుగమం అయిందని అంటున్నారు.

Updated Date - 2022-05-18T17:33:24+05:30 IST