DA Case: చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-05-31T22:03:06+05:30 IST

సస్పెండైన ఏడీజీపీ గుర్జీందర్ పాల్ సింగ్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

DA Case: చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సస్పెండైన ఏడీజీపీ గుర్జీందర్ పాల్ సింగ్‌ బెయిలును సుప్రీంకోర్టులో సవాలు చేసిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. 1994 బ్యాచ్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఏడాది జనవరిలో అరెస్టయ్యారు. సింగ్ గతంలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా, రాయ్‌పూర్ ఐజీగా పనిచేశారు. జులై 5న ఆయన సస్పెండ్ కావడానికి ముందు పోలీస్ ట్రైనింగ్ అకాడమీ హెడ్‌గా నియమితులయ్యారు. 


సింగ్ అత్యున్నత స్థాయి అధికారి అని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాధారణ పౌరుడిగా రాజ్యాంగం ప్రకారం ఆయనకు అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడాన్ని అనవసరపు చర్యగా అభివర్ణించింది. అక్రమాస్తుల కేసులో సాక్ష్యాలన్నీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్నాయి కాబట్టి ట్యాంపరింగ్ ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సింగ్ అరెస్ట్ కావడానికి ముందు ఆరు నెలలపాటు పరారీలో ఉన్నారు. ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ప్రభుత్వ అధికారులపై కామెంట్ల నేపథ్యంలో సింగ్‌పై ఆ తర్వాత దేశద్రోహం కేసు కూడా నమోదైంది. 


మే 12న చత్తీస్‌గఢ్ హైకోర్టు సింగ్‌కు బెయిలు మంజూరు చేసింది. సింగ్ తరపు న్యాయవాది అశుతోష్ పాండే ప్రకారం.. కోర్టు పలు కారణాలతో ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మరీ ముఖ్యంగా గుర్జీందర్‌పై కేసు నమోదు చేయడానికి ముందు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. అంతేకాకుండా సింగ్‌ను జుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఇంటరాగేషన్ కూడా పూర్తయింది కాబట్టి ఇక కష్టడీతో పనేంటని అశుతోష్ వాదించారు. కాగా, అరెస్టుకు ముందు ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేయడం గమనార్హం. 

Updated Date - 2022-05-31T22:03:06+05:30 IST