కన్నేశారు..?

ABN , First Publish Date - 2020-06-24T11:00:00+05:30 IST

దళితుల స్వయం ఉపాధి కోసం ఎస్సీ కొర్పొరేషన్‌ కొనుగోలు చేసిన భూమి అది.

కన్నేశారు..?

పులివెందులలో 3.20 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్‌ భూములు

విలువ సుమారు రూ.10 కోట్లు

ఖాళీగా ఉందని అధికార నేతల కబ్జా యత్నం

ఏకంగా ప్రహరీ గోడ నిర్మాణం.. టెన్నిస్‌ కోర్టు ఏర్పాటు

జేసీ గౌతమి తనిఖీలో వెలుగు చూసిన బాగోతం


కడప, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితుల స్వయం ఉపాధి కోసం ఎస్సీ కొర్పొరేషన్‌ కొనుగోలు చేసిన భూమి అది. దాదాపు రూ.10 కోట్ల విలువచేసే భూమి కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కన్నేశారు. కబ్జాకు పక్కా ప్రణాళిక వేశారు. ఏకంగా ప్రహారీ గోడ నిర్మించారు. జేసీ గౌతమి తనిఖీలో ఈ భాగోతం వెలుగు చూసింది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి కథనం.


పులివెందుల పట్టణానికి సమీపంలో దళితులకు కోళ్ల పెంపకం ద్వారా స్వయం ఉపాధి చూపించాలనే ఆశయంతో 1987లో అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్‌ 62/1లో 1.40 ఎకరాలు, 61/2లో 0.56 ఎకరాలు, 60/2లో 0.04 ఎకరాలు కలిపి 2 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్‌ రైతుల నుంచి కొనుగోలు చేసింది. 22 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. కోళ్ల పెంపకానికి అవసరమైన సిమెంట్‌ రేకుల షెడ్లు, దాణా, గుడ్లు నిల్వ చేసే గోదాములు, ఆఫీస్‌ భవనం నిర్మించారు. కొన్నేళ్లు కోళ్ల పెంపకం బాగానే జరిగింది.


లబ్ధిదారులకు అక్కడే ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంగా పక్కనే 1989లో సర్వే నంబర్‌ 62/1లో మరో 1.20 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే.. ఎస్సీ కార్పొరేషషన్‌ 3.20 ఎకరాలు కొనుగోలు చేసింది. కోళ్ల పెంకపంలో నష్టాలు రావడం, నాటి అధికారుల పర్యవేక్షణ కొరవడ్డంతో కోళ్ల పెంపకం ఆపేశారు. లబ్ధిదారులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళ్లడంతో కోళ్ల ఫారం మూత పడింది. కొన్నేళ్లకు అక్కడ కోళ్ల ఫారం ఒకటి ఉందనే ఆనవాళ్లు కూడా లేకుండా పునాదులతో సహా తొలగించి చదును చేశారు. ప్రస్తుతం అక్కడ ఖాళీ స్థలాలే దర్శనం ఇస్తున్నాయి.


కబ్జా యత్నాలు

పులివెందుల రింగ్‌ రోడ్డు ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. ప్రధాన రోడ్డుకు భూమి దూరాన్ని బట్టి ఎంత తక్కువ కాదన్నా గజం రూ.40 వేల నుంచి 80 వేలు పలుకుతోంది. ఎస్సీ కార్పొరేషన్‌ స్థలం రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉంది. ఇక్కడ ఎకరం రూ.2-3 కోట్లు పైమాటేనని స్థానికులు అంటున్నారు. అంటే.. 3.20 ఎకరాల విలువ రూ.8-10 కోట్లు చేస్తుంది. ఎంతో విలువైన ఈ భూమిపై అధికార పార్టీకి చెందిన కొందరి కన్ను పడింది. కబ్జా చేసేందుకు ఏకంగా ఆ భూముల్లో ప్రహరీ గోడ నిర్మించారు. మరో పక్క టెన్నిస్‌ కోర్టు ఏర్పాటు చేసుకున్నారు. పక్కాగా ఆక్రమణకు తెర తీశారు.


అయితే.. అదే భూమిపై కన్నేసిన మరికొందరు అధికారపార్టీ నేతలు జిల్లా అధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. ఆ మేరకు జేసీ గౌతమి తనిఖీ చేయంతో ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. వెంటనే ఎక్స్‌కవేటర్లతో ప్రహరీ గోడను కూల్చేశారు. ఈ భూమి ‘జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ కడప’కు చెందినది. దురాక్రమణదారులు శిక్షార్హులు’ అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ సుమారుగా 0.70 ఎకరాలకు పైగా కబ్జాలో ఉందని స్థానికులు అంటున్నారు. సర్వే చేసి సరిహద్దులు గుర్తిస్తే ఆక్రమణలో ఎంత భూమి ఉందో వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు.


దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

దళితుల స్వయం ఉపాధి, పక్కా ఇళ్ల నిర్మాణాల కోసమే 1987, 1989లో 3.20 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది. సీఎం జగన్‌ ప్రభుత్వం జిల్లాలో 1.20 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. పులివెందులలో ఎస్పీ కార్పొరేషన్‌ స్థలంలో దళితులకు ఇంటి పట్టాలు ఇస్తే దాదాపు 200 మందికి స్వంతింటి కల సాకారం అవుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని దళిత సంఘాలు నాయకులు కోరుతున్నారు.


ప్రహరీ గోడ కూల్చేశాం - గోపాల్‌, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌, కడప

పులివెందుల పట్టణంలో ఎస్సీల స్వయం ఉపాధి కోసం 1987, 1989లో 3.20 ఎకరాలను ఎస్సీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది. కోళ్ల పెంపకం కోసం షెడ్లు, గోదాములు, ఆఫీసు భవనం నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనాలు పునాదులతో సహా తొలగించారు. ఖాళీగా ఉన్న ఎస్పీకార్పొరేషన్‌ భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశాం. ఎస్పీ కార్పొరేషన్‌ భూములు ఆక్రమిస్తే శిక్షార్హులంటూ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశాం. కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి సర్వే చేసి సరిహద్దులు గుర్తించి, ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-06-24T11:00:00+05:30 IST