Abn logo
Jul 31 2021 @ 00:30AM

ఎస్సీ కార్పొరేషన్‌ నిస్తేజం

  1. రెండేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం
  2. సబ్సిడీ రుణాలు అందించని వైనం
  3. కులాల వారీగా కార్పొరేషన్లు.. ప్రయోజనం శూన్యం
  4. వైసీపీ ప్రభుత్వం తీరుపై దళిత సంఘాల ఆగ్రహం


కర్నూలు, ఆంధ్రజ్యోతి: అంతన్నారు.. ఇంతన్నారు.. తీరా చూస్తే అసలుకే ఎసరు పెట్టారు అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం తీరు. తాము అధికారంలోకి వస్తే దళితులకు సమస్యలే ఉండబోవన్నట్లు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. చివరకు ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించడమే మానేశారు. ఇదేమిటంటే.. ఏ వర్గం వారికి.. ఆ వర్గం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, వాటి ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. పోనీ అదైనా చేశారా అంటే అదీ లేదు. పేదలను, దళితులను అక్కున చేర్చుకునే ప్రభుత్వమని డబ్బా కొట్టుకోవడం తప్ప ఎస్సీ కార్పొరేషన్‌కు రూపాయి విడుదల చేసింది లేదు. అధికార పార్టీ ఘనకార్యం వల్ల ఎస్సీ కార్పొరేషన్‌ రెండేళ్లుగా నిస్తేజంగా మారింది. ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలు అందక ఆశావహులంతా ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు, సబ్సిడీ రుణాల ద్వారా తమ ఆర్థిక పరిస్థితి అంతో ఇంతో మెరుగు పడుతుందని, మొండిచేయి చూపితే  ఆదుకునేది ఎవరని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కార్యరూపం దాల్చని ప్రణాళిక


ఎస్సీల అభివృద్ధి కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టడం, వాటికి అవసరమైన నిధులు కేటాయించడం ప్రభుత్వం విధి. ఎస్సీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. ‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా దళితులను ఆర్థికంగా బలపడేలా చేస్తామని ప్రకటనలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవ త్సరానికి 3,811 యూనిట్ల ద్వారా 4,045 మంది లబ్ధిదారులకు రూ.69 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక పేపర్లను దాటి కార్యరూపం దాల్చలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికను కూడా రూపొందించలేదు. ఏ ప్రభుత్వమైనా ఒక ఏడాది ఏదో కారణం చేత నిధులు కేటాయించలేకపోతే, మరుసటి ఏడాది ఆ తప్పును సరిదిద్దుకుంటుంది. నిధుల కేటాయింపునకు పూనుకుంటుంది. అందునా షెడ్యూల్‌ కులాల విషయంలో అసలు నిర్లక్ష్యం ప్రదర్శించదు. కానీ ఇక్కడ ఉన్నది జగన్‌ ప్రభుత్వం కాబట్టి వారికి అటువంటి పట్టింపులు ఏమీ లేవు. ఏ అడ్డంకులు లేకుండా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నామని ఘనంగా చెప్పుకుంటున్న వైసీపీ దళితులకు ఏం చేసిందో చెప్పాలని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఊకదంపుడు మాటలు చాలించి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


టీడీపీ హయాంలో..


సందర్భం వచ్చిన ప్రతీసారి తప్పులను గత ప్రభుత్వం మీద నెట్టేందుకు రాష్ట్ర అధినాయకత్వం వెనుకాడదు. వెనుకబడ్డ కులాల వారి కోసం టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి వారందరి స్థితిగతులు మారాయని గొప్పలు చెబుతుంటారు. అయితే రెండేళ్ల పాలనతో పోల్చుకుంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో షెడ్యూల్‌ కులాల్లో లబ్ధి పొందిన వారు ఎక్కువగానే ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటా యించి, షెడ్యూల్‌ కులాల వారిని వివిధ పథకాల్లో భాగస్వాములను చేయడం, రుణాలు అందించడం వంటివి గత ప్రభుత్వం బాగా చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,678 మంది లబ్ధిదారులకు రూ.47.87 కోట్లు విడుదల చేసింది. వీరిలో బ్యాంకు లింకేజీ పథకాల ద్వారా 2,230 మంది లబ్ధి పొందారు. నాన్‌ బ్యాంకింగ్‌ లింకేజీ పథకాల ద్వారా 414 మంది, నైపుణ్య శిక్షణ పొందిన వారు 34 మంది ఉన్నారు. 2017-18 సంవత్సంలో 6,502 మంది లబ్ధిదారులకు రూ.107.66 కోట్లు విడుదల చేసింది. బ్యాంకు లింకేజీ పథకాల ద్వారా 5,803 మంది, నాన్‌ బ్యాంకింగ్‌ లింకేజీ పథకాల ద్వారా 529 మంది, ఉపాధి నైపుణ్య శిక్షణ ద్వారా 170 మంది లబ్ధి పొందారు. 2018-19లో కూడా ఎస్సీ కార్పొరేషన్‌కు టీడీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆ ఏడాది రూ.117.82 కోట్లతో 6,971 మందికి లబ్ధి చేకూర్చేలా కార్యచరణ రూపొందించి, రూ.74.76 కోట్లతో 5,979 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చింది.


పేరుకే కార్పొరేషన్లు..


షెడ్యూల్‌ కులాల్లోని ఉపకులాల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి మాదిగ కార్పొరేషన్‌, రెండోది మాల కార్పొరేషన్‌. రెల్లి, ఇతర ఉపకులాలను కలిపి మూడో కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. వాటికి చైర్మన్లను కూడా ప్రభుత్వం నియమించింది. ప్రతి కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, నిధులను ఖర్చు చేస్తే ఆయా కులాల వారిని పేదరికం నుంచి త్వరగా బయటకు తీసుకురావచ్చన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. అయితే ఎస్సీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఉండగా మళ్లీ ఉపకులాలకు కార్పొరేషన్లు ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఏ ఉద్దేశంతో కార్పొరేషన్లను ఏర్పాటు చేశారో అదైనా నెరవేరుస్తున్నారా? అంటే అదీ లేదు. కార్పొరేషన్‌ చైర్మన్లకు జీతభత్యాల పేరిట రూ.కోట్లు ఖర్చు చేయడం తప్ప, ఎస్సీ కార్పొరేషన్ల వల్ల ఒనగూరిన ప్రయోజనమేమిటో అమాత్యులకే తెలియాలి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ మేలు చేస్తున్నానని చెబుతూ, కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని, సంఘటితంగా ఉంటే ఉద్యమాలు చేస్తారన్న అభిప్రాయంతో ఇలా చీలికలు తెస్తున్నారని దళిత నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎస్సీల కోసం కార్యచరణ ప్రణాళికను రూపొందించి, ఉపాధి పథకాలు, సబ్సిడీ రుణాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.


నిధులు కేటాయిస్తే..


ఎస్సీ కార్పొరేషన్‌ వ్యక్తిగత, గ్రూపు యూనిట్ల ద్వారా ఎస్సీలను వివిధ పథకాల్లో భాగస్వామ్యులను చేస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత, గ్రూపు యూనిట్లకు సంబంధించిన పథకాలకు లక్షన్నర నుంచి ఏడున్నర లక్షల రూపాయల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుంది. బ్యాంకు లింకేజీ లేకుండా మరికొన్ని పథకాలు ఉన్నాయి. విద్యుద్దీకరణ పథకాలు, చిన్న నీటిపారుదల పథకాలు, భూ అభివృద్ధి, వడ్డీలేని రుణాలకు సంబంధించిన పథకాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ పథకాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా అరవై వేల మంది లబ్ధి పొందారు. కార్పొరేషన్‌కు సజావుగా నిధులు కేటాయిస్తే మరింత మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధులు విడుదల చేయలేదని, వచ్చే సంవత్సరం కూడా నిధులు కేటాయించేది అనుమానమేనని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులే చెప్పడం గమనార్హం.


నిధులు విడుదల చేయాలి..


వైసీపీ ప్రభుత్వం దళితులకు నిధులను కేటాయించకుండా మోసం చేస్తోంది. అణగారిన వర్గాల వారికి ప్రతి ప్రభుత్వం నిధులను కేటాయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా షెడ్యూల్‌ కులాల వారికి ఏమీ చేయకుండా, కార్పొరేషన్ల పేరుతో మభ్యపెట్టడం సరికాదు. కరోనా కారణంగా ఎస్సీల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొని ఎస్సీ కార్పొరేషన్‌కు వెంటనే నిధులు విడదల చేయాలి.


- గోపీ దరూరు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి


సిగ్గు చేటు..


అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విభజించే పనిలో భాగంగానే కార్పొరేషన్లు తెచ్చింది తప్ప దళితుల అభివృద్ధి కోసం కాదు. ఎస్సీల అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ ఉండగా మరో మూడు కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేశారో వైసీపీ వారికే తెలియాలి. పైగా ఆ కార్పొరేషన్‌ చైర్మన్లకు కేబినెట్‌ హోదా, జీతం, ఖర్చులకు రూ.లక్షల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు నిధులను కేటాయించకుండా దుబారా ఖర్చు చేయడం సమంజసం కాదు. వెంటనే ఎస్సీలకు నిధులు కేటాయించాలి.

- ఆనంద్‌బాబు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి, కర్నూలు