రెడ్లలో ఎస్సీ భావన

ABN , First Publish Date - 2022-04-19T08:25:55+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా పుడితే బాగుండేదన్న భావనలో ఎక్కువమంది రెడ్లు ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

రెడ్లలో ఎస్సీ భావన

వారిలా పుడితే బాగుండేదనుకుంటున్నారు

డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు

జగన్‌ చిత్రపటంతో కొత్త చాంబర్‌లోకి..

వారిలా పుడితే బాగుండేదనుకుంటున్నారు

డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు


అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా పుడితే బాగుండేదన్న భావనలో ఎక్కువమంది రెడ్లు ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో రెడ్ల రాజ్యం ఉందనేది నిజం కాదు. ఇప్పుడు నడిచేది బడుగుల ప్రభుత్వం. జగన్‌ ప్రభుత్వం ప్రధానంగా వారికోసమే పనిచేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. అమరావతి సచివాలయంలో నాలుగో బ్లాకు లోని తన చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్త చాంబర్‌లోకి దేవుని చిత్రపటంతో మంత్రులు ప్రవేశించడం ఆనవాయితీ. ఇందుకుభిన్నంగా సీఎం జగన్‌ చిత్రపటంతో నారాయణస్వామి ప్రవేశించారు. చాంబర్‌ ముఖద్వారం వద్ద గోడకు జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.  ఆబ్కారీశాఖలో పని చేస్తూ అనారోగ్యంతో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కొత్త కేబినెట్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాకు అధికారాలు ఇవ్వకపోతే తప్పు చేసిన ఎక్సైజ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయగలిగేవాడినా? కానీ, సస్పెండ్‌ చేయాల్సి వచ్చినప్పుడల్లా బాధపడుతుంటాను. ఎక్సైజ్‌ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దు. సస్పెండ్‌ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు’’ అని కోరారు. జగన్‌ పటంతో చాంబర్‌లోకి రావడంపై వివరణ ఇచ్చుకున్నారు. ‘‘దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు జగన్‌. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్‌ పదవులు ఇవ్వరు. పార్టీ కోసం పని చేసిన వారిని మాత్రమే జగన్‌ గుర్తిస్తారు. రెండోసారి పదవి దక్కుతుందని ఊహించలేదు. పదవులు ఇవ్వడమే కాదు పవర్‌ కూడా ఇచ్చారు. అందుకే ఆయన ఫొటో పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించాను’’ అని తెలిపారు. చరిత్రలో తొలిసారి కేబినెట్‌లో 70శాతం స్థానాలు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఇచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-19T08:25:55+05:30 IST