Abortion: 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అవివాహితకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2022-07-21T23:38:33+05:30 IST

పరస్పర అంగీకారంతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ అవివాహిత 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు

Abortion: 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అవివాహితకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ  అవివాహిత 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డుకు లోబడి.. ఏకాభిప్రాయం కారణంగా ఏర్పడిన 24 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అవివాహిత మహిళకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా గర్భాన్ని తొలగించవచ్చని ఎయిమ్స్ పేర్కొంది. 


మహిళకు మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరిస్తూ.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు మితిమీరిన ఆంక్షలను తీసుకుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అవివాహిత అన్న కారణంతో పిటిషనర్‌కు ప్రయోజనాన్ని నిరాకరించకూడదని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 


ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్ల అవివాహిత పరస్పర అంగీకారంతో ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. అతడి వల్ల ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 24 వారాల గర్భిణి. అయితే, ఇప్పుడా వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లి చేసుకోకుండా తల్లిని కావడం వల్ల మానసిక వేదన అనుభవించాల్సి వస్తుందని, అలాగే సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె కోర్టుకు తెలిపింది. అంతేకాక, తల్లిని కావడానికి మానసికంగా తాను ఇంకా సిద్ధం కాలేదని పేర్కొంది. 


ఆమె వాదనలు విన్న చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయస్థానం తన అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు చట్టానికి మించి వెళ్లలేదని స్పష్టం చేసింది. కాబట్టి గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వలేమని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును ఆమె సవాలు చేయగా, తాజాగా ఆమెకు ఉపశమనం లభించింది.

Updated Date - 2022-07-21T23:38:33+05:30 IST